లాక్‌డౌన్‌ లేకపోతే ఇప్పటికి 8.2 లక్షల కేసులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ముందుగానే స్పందించి జాగ్రత్త చర్యలు 
  • దేశవ్యాప్తంగా 586 కొవిడ్‌ ఆస్పత్రులు
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడంపై నిషేధం విధించాలని అన్ని రాష్ట్రాలకు లేఖ

న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌, ఇంతర ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లనే భారీ సంఖ్యలో కేసులు పెరగకుండా నిరోధించగలిగామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. లేకపోతే ఈ నెల 15 నాటికి 8.2 లక్షల కేసులు నమోదయ్యేవని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలతో కేసులను చాలా తగ్గించగలిగామన్నారు. ఇప్పటి వరకు కొవిడ్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా 586 ఆస్పత్రులను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో లక్ష వరకు ఐసొలేషన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, వాటిలో 11,500 ఐసీయూ బెడ్లు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 1.7 లక్షల నమూనాలను పరీక్షించామని, శుక్రవారం 16,564 నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తెలిపింది. దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్‌ పరిధిలో 167 కేంద్రాలు, ప్రైవేటుగా 67 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, పొగాకు నమలడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎ్‌సలకు లేఖ రాసింది. ‘‘పొగాకు, పాన్‌ మసాలా, సుపారీ నమలడం వల్ల ఉమ్మి ఎక్కువగా వస్తుంది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తున్నారు. ఇది వైరస్‌ వ్యాప్తిని ఎక్కువ చేయవచ్చు’’ అని పేర్కొంది.  ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పొగాకు ఉత్పత్తులపై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడంపై నిషేధం విధించాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates