టుడే న్యూస్‌ రౌండప్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కోవిడ్‌-19 మృతుల సంఖ్య భారత్‌లో అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 199 మంది చనిపోయారు.

భారత్‌లో కరోనా మృతులు 199
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 678 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, కోవిడ్‌ బారినపడి 33 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పటివరకు 6402కు చేరిందని, మృతుల సంఖ్య 199కి పెరిగిందని ప్రకటించింది. 5709 పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం చురుగ్గా ఉండగా 503 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్టు వెల్లడించింది.

పంజాబ్‌లోనూ లాక్‌డౌన్ పొడిగింపు
లాక్‌డౌన్‌ పొడిగించిన రెండో రాష్ట్రంగా పంజాబ్‌ నిలిచింది. మే 1 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ అమరీందర్‌ సింగ్‌ సర్కారు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ పొడిగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఏపప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నవీన్‌ పట్నాయక్‌ సర్కారు గురువారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో మాస్క్‌లు తప్పనిసరి
ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారు కచ్చితంగా ముఖానికి మాస్క్‌లు ధరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు మాస్క్‌లు ఉపయోగపడతాయని పేర్కొంది. వైరస్‌ సోకినా చాలా మందికి లక్షణాలు కనబడవని, అలాంటివారు కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ మాస్క్‌లు వాడాలని సూచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు మాస్క్‌లు ధరించాలని, వాషబుల్‌ మాస్క్‌లు వాడటం మంచిదని తెలంగాణ సర్కారు సలహాయిచ్చింది.

ఏపీలో మరో 2 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం తాజగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ రెండు కొత్త కేసులు నమోదయినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. గురువారం రాత్రి 9 నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు జరిగిన పరీక్షల్లో ఈ రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 365కు చేరింది. కోవిడ్‌-19 బారిన పడి ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. కాగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న 133 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీ ఎన్నికల కమిషనర్‌ తొలగింపు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకం నిబంధనలను సవరిస్తూ ఏపీ సర్కారు పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదముద్ర వేయడంతో రమేశ్‌కుమార్‌ పదవి ఊడింది.

జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 21 రోజుల లాక్‌డౌన్‌ గడువు ఏప్రిల్‌ 14తో ముగియనున్న నేపథ్యంలో మోదీ ఏం చెబుతారోనని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 24న విధించిన లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

వలస కార్మికులను తరలించండి: కాంగ్రెస్‌
లాక్‌డౌన్‌తో అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ఉపాధి కరువై, తినడానికి తిండి, ఉండటానికి గూడు లేక బిక్కుబిక్కుమంటున్న వలస కార్మికులను సొంతూళ్లకు తరలించేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. అవసరమైతే కోవిడ్‌ నివారణ రైళ్లను వినియోగించాలని సర్కారుకు సూచించింది.

భారత్‌లో సమూహ వ్యాప్తి లేదు: డబ్ల్యూహెచ్‌ఓ
భారత దేశంలో సమూహ వ్యాప్తి ద్వారా కోవిడ్‌ విస్తరిస్తుందన్న వ్యాఖ్యలు పొరపాటేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఒప్పుకుంది. ఇండియాలో ఆయా ప్రాంతాల్లో కొన్ని కరోనా బాధిత కేసులు మాత్రమే నమోదయ్యాయని వివరణ ఇచ్చింది. వైరస్‌ ఎవరి నుంచి వ్యాపించిందో తెలియనప్పుడు దాన్ని సమూహ వ్యాప్తిగా పేర్కొంటారు.

RELATED ARTICLES

Latest Updates