కరోనా రహిత తెలంగాణ 24 కల్లా..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ‘మర్కజ్‌’ లేకుంటే ఇప్పటికే జరిగేది
  • నేడు 70 మంది వరకు డిశ్చార్జి
  • అయినా జాగ్రత్తలు పాటించాల్సిందే
  • వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌గా తేలి చికిత్స పొందుతున్నవారంతా ఈ నెల 24వ తేదీ నాటికి  కోలుకుంటారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మర్కజ్‌ కేసులు లేకుంటే ఇప్పటికే తెలంగాణ కరోనా రహితం అయ్యేదని అన్నారు. రాష్ట్రంలో వైరస్‌ కేసుల పరిస్థితిపై హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రి గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘శుక్రవారం నుంచి కేసులు తగ్గుముఖం పడతాయి. నాలుగైదు రోజుల తర్వాత అసలుండవు.మర్కజ్‌ లింక్‌ నమూనాల సేకరణ పూర్తయింది. వారిలో గురువారం 665 మంది నమూనాల ఫలితాలు రాగా 18 మాత్రమే పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 471కి చేరింది’ అని వివరించారు. వీరిలో 388 మంది మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌లున్నవారేనని పేర్కొన్నారు. 45 మంది డిశ్చార్జి కాగా, 12 మంది చనిపోయారని చెప్పారు.

హైదరాబాద్‌లోని గాంధీ, ఛాతీ, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో ప్రస్తుతం 414 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. మర్కజ్‌ లింక్‌ ఉన్నవాళ్లలో శుక్రవారం 60 నుంచి 70 మంది డిశ్చార్జి అవుతారని మంత్రి తెలిపారు. వెయ్యి వెంటిలేటర్లను ఆర్డర్‌ ఇచ్చామని, తెలంగాణ వైద్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేనంతంగా రూ.70 కోట్ల సామగ్రి కొనుగోలుకు నిర్ణయించామని చెప్పారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేతపై సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇస్తారని పేర్కొన్నారు. కేసులు తగ్గుతున్నాయని తేలిగ్గా తీసుకోవద్దని, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని మంత్రి కోరారు.

హైదరాబాద్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. హోం కార్వంటైన్‌లో గదులు చిన్నగా ఉంటే తెలియజేయాలని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా ఓపీ విభాగాన్ని కింగ్‌ కోఠి ఆస్పత్రికి మార్చామని మంత్రి తెలిపారు. గాంధీలో కేవలం పాజిటివ్‌ కేసుల రోగులు మాత్రమే ఉంటారని, వైరస్‌ లక్షణాలుంటే కింగ్‌ కోఠి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

రక్తం దానం చేయండి
రాష్ట్రంలో 1,500 మంది తలసేమియా రోగులకు నెలకు రెండుసార్లు రక్తం ఇవ్వాల్సి ఉంటుందని, ప్రజలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని మంత్రి కోరారు. 10 వేల మంది డయాలసిస్‌ రోగులు నెలకు 10 సార్లు డయాలసిస్‌ చేసుకుంటున్నారని, వారికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. కేన్సర్‌ రోగులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని వివరించారు. కుటుంబ పెద్ద క్వారంటైన్‌లో ఉంటే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని వివరించారు. శుక్రవారం నుంచి టెలీ మెడిసిన్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని, ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే ఫోన్‌ చేస్తే వైద్యులు మందులు ఇస్తారని అన్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates