రిటైల్లో ఉద్యోగాల కోత !

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– 80,000 వరకూ పోవచ్చు
ప్రమాదంలో చిరుఉద్యోగుల భవిష్యత్తు
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ ఇది : ఆర్‌ఏఐ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : ప్రస్తుత లాక్‌డౌన్‌ దెబ్బతో రిటైల్‌ రంగంలో భారీగా ఉద్యోగాలు పోతాయని మరో సర్వేలో తేలింది. ఇప్పటికే మాంద్యంతో కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థకు కరోనా వైరస్‌ తోడు కావడంతో భారత్‌లో ఉద్యోగభద్రత గాలిలో దీపంలా మారింది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రిటైలర్లు దాదాపుగా 80,000 మందిని తొలగించే అవకాశాలున్నాయని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 768 రిటైలర్ల అభిప్రాయాలను సేకరించింది. ఈ సంస్థలో దాదాపుగా 3.92,963 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో చిన్న స్థాయి రిటైలర్లు తమ సిబ్బంది సంఖ్యను 30 శాతం దాకా తగ్గించుకోనున్నారు.

దాదాపు 100 మంది దాకా ఉద్యోగులున్న సంస్థలను చిన్న రిటైలర్లుగా, 100-1000 దాకా సిబ్బంది ఉన్న సంస్థలను మధ్య స్థాయిగాను, 1,000కి మించి సిబ్బంది ఉన్న సంస్థల ను పెద్ద రిటైలర్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో చిన్న స్థాయివి 65 శాతం, మధ్య స్థాయి 24 శాతం, భారీ స్థాయివి 11 శాతం ఉన్నాయి. కరోనా కారణంగా వారి వ్యాపారాలు, మానవ వనరులపై ప్రభా వాల గురించి ఈ సర్వేలో అభిప్రాయాలు సేకరించి, నివేదిక రూపొందించింది. ఆ వివరాల ప్రకారం.. మధ్య స్థాయి రిటైలర్లు సుమారు 12 శాతం, పెద్ద రిటైలర్లు దాదాపు 5 శాతం మేర సిబ్బందిని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద రిటైలర్లంతా సిబ్బంది సంఖ్యను సుమారు 20 శాతం మేర తగ్గించుకునే యోచనలో ఉన్నారు. వ్యాపార అవకాశాలకు సంబంధించి సుమారు 70 శాతం రిటైలర్లు వచ్చే ఆరు నెలల్లో రికవరీ ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. 20 శాతం మంది మాత్రం వ్యాపార రికవరీకి ఏడాది పైగా సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు.

జీఎస్టీలో తగ్గింపునివ్వాలి
మార్చి 25న ప్రధాని మోడీ లాక్‌డౌన్‌ విధించిన తర్వాత 95 శాతం అహారేతర రిటైలర్లు తమ వ్యాపారాలు, అవుట్‌లెట్లను మూశారు. ప్రస్తుత సమయంలో ఎలాంటి రెవెన్యూ రావడం లేదు. గతేడాది వ్యాపారంతో పోల్చితే వచ్చే ఆరు నెలల్లో 40 శాతం రెవెన్యూ తగ్గొచ్చని అంచనా వేశారు. అహారోత్పత్తులను విక్రయించే రిటైలర్లు వచ్చే ఆరు నెలల్లో గతేడాదితో పోల్చితే 56 శాతం తగ్గుదల నమోదు చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా ఫుడ్‌ రిటైలర్లు అహారేతర ఉత్పత్తులను ఇతర స్టోర్లను కలిగి ఉన్నారు.
ఈ క్లిష్ట మసయంలో ప్రభుత్వం తమకు కొంత మద్దతును ఇవ్వాలని ఆర్‌ఏఐ కోరింది. అద్దెలో మద్దతు, ఉద్యోగుల జీతాల్లో కొంత సాయం చేయాలని తెలిపింది. ఆ విధంగా మద్దతు చేయలేకపోతే ఉద్యోగుల్లో 20 శాతం మందిని తగ్గించుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతీ ఐదుగురిలో ఇద్దరు తమకు జీఎస్టీలో తగ్గింపు, వ్యాపారాల కోసం రుణాలు ఇవ్వాలని కోరారు. రెండు నెలల పాటు విద్యుత్‌ చార్జీలను రద్దు చేయాలని ప్రతీ 10 మందిలో ఒక్కరు అభిప్రాయపడ్డారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates