హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్లేవ్..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నిన్న మాస్కులు.. శానిటైజర్లు
నేడు ఆ మందు మార్కెట్‌ నుంచి గాయబ్‌
ఇష్టానుసారంగా వాడితే దుష్పరిణామాలు : డాక్టర్లు

హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లకే పరిమితమైన కొరత తాజాగా ఔషధాలను తాకింది. ప్రధానంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు మార్కెట్లో అందుబాటులో లేకపోవడం ఇందుకు సాక్ష్యం. కరోనా చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్ర బాగా పని చేస్తున్నదని, ఆ తరుణంలో అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం సైతం ఆ మాత్రలను తమకు ఎగుమతి చేయాలని కోరడంతో మార్కట్లో కొరతకు దారితీసింది. దీంతో మెడికల్‌ షాపుల నుంచి ఆ మందు గోలీలు ఒక్కసారిగా మాయమయ్యాయి. ఒకవైపు ప్రపంచం కరోనా భయాందోళనలో మునిగిపోతే కొంత మంది మాత్రం ఆ పరిస్థితిని కాసుల కోసం వేటాడుతున్నారనే వాదన వినిపిస్తున్నది. మరోవైపు ఆందోళనకు లోనైన ప్రజలు పెద్ద మొత్తంలో ఆ మాత్రల కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్టు సమాచారం. దాదాపు రెండు వారాలుగా ఈ మాత్రల సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్టు మెడికల్‌ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు.

ఇప్పటికే ఉత్పత్తి చేసిన సంస్థల నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రులు, ఇతరత్రా పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసుకొని పెట్టుకోవడంతో ఇక కొత్తగా ఉత్పత్తి అయితే తప్ప మాత్రలు బహిరంగ మార్కెట్లోకి రాకపోవచ్చని మెడికల్‌ ప్రాక్టీషనర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచఔషధ ఉత్పత్తి, సరఫరా భారత్‌ నుంచే మూడో వంతు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్పత్తి అయిన ఔషధాల్లో దాదాపు 60శాతం పైగా ఇతర దేశాలకు ఎగుమతయ్యేవే. ఇందు కోసం ఆయా దేశాలు ప్రతిసారీ ఆంక్షలువిధించడం, తక్కువ ప్రమాణాలు కలిగినవని తిరస్కరిస్తుండడం తో వీటి ఉత్పత్తి కూడా పరిమితంగానే చేయాల్సి ఉంటుంది. పలుసార్లు అమెరికా ఔషధాలపై ఆంక్షలు విధించగా, మిగిలిన దేశాలు కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటుండడంతో ఎంత మొత్తం తయారు చేయాలనే దానిపై ఎప్పుడూ సందిగ్ధమే. దీనికి తోడు కరోనా చికిత్సకు వీటిని ఉపయోగిస్తున్నారనే సమాచారంతో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే కార్పొరేట్‌ ఆస్పత్రులు ఈ ఔషధాలను పెద్ద మొత్తంలో అట్టిపెట్టుకున్నట్టు అంచనా. అయితే ప్రభుత్వాస్పత్రు ల్లో ఈ మాత్రలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.

సొంతంగా వాడితే ఇబ్బందులు తప్పవు :
డాక్టర్‌ చంద్రశేఖర్‌ (ఫార్మా.డి అసోసియేషన్‌ అధ్యక్షులు )
ఔషధాలను ఇష్టానుసారంగా వాడితే దుష్పరిణామాలు తప్పవు. రోగి వయస్సు, బరువు, ఇతర వ్యాధులున్నాయా? లేవా తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని మోతాదును నిర్ణయించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. అలా కాదని ఉపయోగిస్తే గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదముందని డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి చేసిన సంస్థల నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రులు, ఇతరత్రా పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసుకొని పెట్టుకోవడంతో ఇక కొత్తగా ఉత్పత్తి అయితే తప్ప మాత్రలు బహిరంగ మార్కెట్లోకి రాకపోవచ్చని అంచనా.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates