పస్తులే.. కార్మికుల కడుపులు ఖాళీ..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

పాలమూరు పోలేపల్లి సెజ్‌లో వేలాది మంది దీనస్థితి
– 4 నెలలుగా అందని వేతనాలు
కరోనా పేరుతో ముఖం చాటేసిన కాంట్రాక్టర్లు
సొంతూళ్లకు వెళ్లలేక పొరుగురాష్ట్రాల వారి గోడు

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా అయ్యింది పోలేపల్లి సెజ్‌ కార్మికుల పరిస్థితి. నాలుగు నెలలుగా వేతనాల్లేకుండా ఖాళీ కడుపులతో కాలం వెళ్లదీస్తున్న అమాయకులకు కరోనా కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కంపెనీల్లో పనులు నిలిపేయడంతో డబ్బులు చెల్లించక కాంట్రాక్టర్లు ముఖం చాటేశారు. గోడు చెప్పుకుందామన్నా ఎవరూ స్పందించకపోవడంతో బీహార్‌, ఒడిషా, బెంగాల్‌ రాష్ట్రాల కార్మికులు సాయం కోసం నిత్యం ఎదురుచూస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లో 45 పరిశ్రమలున్నాయి. 30 వేల మంది కార్మికులు వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నారు. అరబిందో ఫార్మసీ, హెటేరో ఫార్మా, మైలాన్‌, శిల్పా, ఎవరి టూషన్‌ ధర్మ కేబుల్‌, సుప్రీమ్‌ కంపెనీలు సహా కరోనా దెబ్బకు అన్నీ మూతపడ్డాయి. మూతపడ్డ కంపెనీలకు నెల వేతనం పూర్తిగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చినా అమలు చేస్తున్న దాఖలాల్లేవు. పనిచేయని సంగతేమోగానీ.. నాలుగు నెలలుగా వేతనాలు అందక కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. పోలేపల్లి సెజ్‌లో బహుళజాతికి చెందిన వర్సిటీ నిర్మిస్తుండగా.. బీహార్‌, ఒడిశా, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వలసకూలీలు వచ్చారు. కాంట్రాక్టర్లు సైతం పొరుగు రాష్ట్రాలవారే కావడంతో స్థానిక సూపర్‌వైజర్లకు పనులు అప్పగించారు. కార్మికులకు ఏ కష్టమొచ్చినా కాంట్రాక్టర్లెవరూ పట్టించుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికులకు నాలుగు నెలలుగా కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక, భార్యా పిల్లల వద్దకు వెళ్లలేక ఇక్కడే మగ్గిపోతున్నారు. పదిహేను రోజులుగా పనుల్లేక తిండికీ తిప్పలు పడుతున్నారు. కొందరైతే బిస్కెట్లు, చపాతీలు తింటూ ఆకలి తీర్చుకుంటున్నారు. నిర్మాణ పనుల్లో 800 మంది కార్మికులుంటే.. ఇప్పటివరకు వారికి బియ్యం, ఇతర సాయం ఏవీ అందలేదు. రేకుల షెడ్ల కింద నివసిస్తున్నా యాజమాన్యాలు కన్నెత్తి చూస్తున్న పాపాన పోలేదు.ఉమ్మడి జిల్లాలో 360 కంపెనీల్లో 70 వేల మంది కార్మికులందరూ దాదాపు ఆకలితో అలమటిస్తున్నవారే.

షాపులో సరుకులివ్వడం లేదు : అస్లాం, పశ్చిమ బెంగాల్‌
కరోనా పేరుతో పనులు నిలిపేశారు. తిండిగింజలు లేవు. డబ్బుల్లేక కిరాణాషాపులో సరుకులివ్వడం లేదు. ఎలా బతికేది? కాంట్రాక్టర్‌కు ఫోన్‌ చేస్తున్నా ఎత్తడం లేదు. ఆకలితో చచ్చిపోతున్నాం.

లాక్‌డౌన్‌ పరిహారం అందించాలి : ఏ.రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్‌
లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రకటించిన పరిహారం ఈ కార్మికులకు అందజేయాలి. ఇక్కడ పనిచేస్తున్న వారికి సరైన వసతుల్లేవు. రేకుషెడ్లలో నివసిస్తున్నా రు. నూతనంగా నిర్మిస్తున్న భవనంలోకి మార్చాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం, ప్రతి కుటుంబానికి రూ.5వేలు ఉచితంగా అందించాలి.

తినడానికి తిండి లేదు..
ఇక్కడ మూడు నెలలుగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు కాంట్రాక్టర్‌ ముఖం చూడలేదు. మాకు నయాపైసా ఇవ్వలేదు. ఇంటి దగ్గర్నుంచి అవసరాలకు డబ్బులు పంపాలని ఫోన్లు వస్తున్నాయి. మాకే తినడానికి తిండి లేదు.
సాహురూన్‌, వలసకూలీ, పశ్చిమబెంగాల్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates