ఇండియాలో ఒక్కరోజే 675 కేసులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తెలంగాణలో మొత్తం 272 కరోనా కేసులు
ఏపీలో 190 మందికి కోవిడ్‌-19
ఇప్పటివరకు 96 మరణాలు.. 3,470 మందికి పాజిటివ్‌
ప్రపంచవ్యాప్తంగా 11.40 లక్షల కేసులు.. 61 వేలకు పైగా మరణాలు
నెల చివరికి తీవ్రతరం: ఇండియన్‌ చెస్ట్‌ సొసైటి

న్యూఢిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్న కోవిడ్‌-19.. అంతకంతకు విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలతో పాటు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు సైతం సామాజిక దూరాన్ని పాటించండి.. ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండండి ! మరిన్ని ప్రాణాలు పోకుండా నిలపండి ! అని చెబుతున్నాయి. అయినప్పటికీ వైరస్‌ వ్యాప్తి ఆగడంలేదు. లాక్‌డౌన్‌ విధించినప్పటికీ మన దేశంలోనూ కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తూ.. ప్రాణాలు తీస్తున్నది. ఒక్కరోజులోనే 675 కొత్త కేసులు నమోదుకావడం వైరస్‌ వ్యాప్తికి అద్దం పడుతున్నది. 12 మంది చనిపోయారు.

కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోకుండా తీవ్రంగా శ్రమిస్తున్న వైద్యులు సైతం దాని బారినపడుతున్నారు. ఇప్పటికే 50 మందికి పైగా వైద్య సిబ్బంది వైరస్‌ సోకినట్టు కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో ఇద్దరు కరోనా బాధితులకు వైద్యం అందించిన 108 ఆస్పత్రి సిబ్బందిలో వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఈ ఘటన గంగారామ్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సంబంధిత వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. వీరి వైద్య పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది.

కాగా, ఢిల్లీలో ఇప్పటికే 445 మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, మొత్తం వైరస్‌ బాధితుల్లో నిజాముద్దీన్‌ మత ప్రార్థనలకు హాజరైన వారే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకూ 3,470 మందికి కోవిడ్‌-19 సోకగా.. వారిలో 96 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులోనే 18 మంది మృతి చెందడంతో పాటు 675 మందికి కరోనా ప్రబలడం కలకలం రేపుతున్నది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కల్లోలమే సృష్టిస్తున్నది. అక్కడ తాజాగా 49 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో 30 కేసులు ముంబయిలోనే నమోదయ్యాయి. ధారవి మురికివాడలో మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 539 చేరింది. మొత్తం 19 మంది మృతిచెందారు.

మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో కోవిడ్‌-19 వేగంగా విస్తరిస్తున్నది. ఇక్కడ 485 కరోనా కేసులు నమోదుకాగా.. వీరిలో 364 మంది తబ్లిఘీ జమాత్‌కు హాజరైనవారు ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమావేశానికి రాష్ట్రం నుంచి 1,200 మంది హాజరయ్యారనీ, వారందరి రక్తనమునాలను వైద్య పరీక్షలకు పంపినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేశ్‌ వెల్లడించారు. కేరళలో శనివారం కొత్తగా 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ తెలిపారు. దీంతో బాధితుల సంఖ్య 306కు చేరగా.. వీరిలో ఇద్దరు మృతిచెందారని చెప్పారు. కర్నాటకలోనూ ఒకరు చనిపోగా.. 16 కొత్త కేసులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య నాలుగుకు చేరగా… 144 మందికి వైరస్‌ ప్రబలింది.

ఉత్తప్రదేశ్‌లోనూ వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తున్నది. శనివారం ఒక్కరోజునే 64 కరోనా కేసులు నమోదుతో బాధితుల సంఖ్య 234కు చేరింది. వైద్య సిబ్బందితో పాటు, క్షేత్రస్థాయిలో కరోనా కట్టడికి పోరాడుతున్న ఉద్యోగులందరికి ప్రత్యేక బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు యూపీ సర్కారు ప్రకటించింది. అలాగే, 248 మంది బాల నేరస్తులను బెయిల్‌పై విడుదల చేయడానికి నిర్ణయించింది. కాగా, రాజస్థాన్‌లో 191, మధ్యప్రదేశ్‌లో 163 మందికి కరోనా ప్రబలింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతంగా వ్యాపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో వైరస్‌ బాధితుల సంఖ్య 190కి చేరగా.. తెలంగాణలో 275 మందికి కోవిడ్‌-19 ప్రబలింది.

నెల చివరికి తీవ్రతరం: ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ
ఈ నెల చివరినాటికి భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు తీవ్రస్థాయిలో పెరిగే అవకాశముందని ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ అంచనా వేసింది. ‘మనకి మరో నెల సమయముంది. ఏప్రిల్‌ చివరి నాటికి లేక మే తొలి వారం నాటికి దేశంలో కరోనా కేసులు తీవ్రతరమయ్యే అవకాశముంది. అయితే, పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేస్తే ఈ తీవ్రతను తగ్గించుకోవచ్చు’ అని ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ చీఫ్‌ క్రిస్టోఫర్‌ తెలిపారు.

ఉద్యోగాలు కాదు ప్రాణాలు ముఖ్యం!
ఉద్యోగాల కన్నా ముందుగా ప్రజల ప్రాణాలు ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అధినేతలు వెల్లడించారు. వైరస్‌ కారణంగా ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభాన్ని ‘చీకటి కాలం’గా అభివర్ణించారు. ఆర్థిక కార్యకలాపాలు సవ్యంగా సాగాలంటే ముందు కొవిడ్‌-19 నియంత్రణలోకి రావాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌, ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టాలినా జార్జీవా అన్నారు. వారిద్దరూ బ్రిటిష్‌ పత్రిక ‘ది డైలీ టెలిగ్రాఫ్‌’కు సంయుక్తంగా రాసిన కథనంలో.. ‘కొవిడ్‌-19ను నియంత్రించేందుకు ప్రతి దేశం ప్రయత్నిస్తున్నది. సమాజ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలను నిలిపివేసి ముందుకు సాగుతున్నాయి. చాలాచోట్ల ప్రజల ప్రాణాలా లేక ఉద్యోగాలు కాపాడాలా అన్న కోణంలో ఆలోచనలు సాగుతున్నాయి. కానీ ఇది తప్పుడు వైఖరి. ముందు వైరస్‌ను కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడటమే ఇప్పుడు అత్యంత ముఖ్యం.’ అని వారు వెల్లడించారు.

హృదయాన్ని కదిలించే ట్వీట్‌ !
”నేను కృష్ణను కలిశాను. ఆయన తన ఐదేండ్ల బిడ్డను తన భుజం మీద ఎత్తుకుని నడుస్తున్నాడు. ఆయన భార్య పూనం తమ సరుకుల మూటను మోస్తూ నడుస్తున్నది. వారు ఇంకా 700 కిలోమీటర్లు నడిచి మధ్యప్రదేశ్‌ చేరుకోవాలి. నేను కలిసే సమయానికి వారికి వాలంటీర్లు ఆహార పొట్లాలు, నీళ్లు అందజేయబోతే.. వారు మా దగ్గర ఆహారం, నీళ్లు ఉన్నాయి. ధన్యవాదాలు ! అని తీసుకోలేదు. ఇవి ఇతరులకు ఉపయోగపడతాయి అని. ఇది పేదల ఆత్మగౌరవం”.
– కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను కలిసిన సందర్భంలో ప్రముఖ టీవీ జర్నలిస్టు బర్కదత్‌ చేసిన ట్వీట్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates