వందమందిలోపు అతిథులతో రామయ్య పెళ్లి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

భద్రాద్రిలో నిరాడంబరంగా కల్యాణం
ముత్యాలు సమర్పించిన ఇంద్రకరణ్‌
టీవీల ద్వారానే వీక్షించిన భక్తులు
ఆన్‌లైన్‌లో తలంబ్రాలు పంపిణీ
నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం
యాదాద్రిలోనూ కల్యాణం
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌

జగదానంద కారకుడైన రామయ్య కల్యాణం జనం లేకుండా నిరాడంబరంగా జరిగింది. శ్రీ రామనవమి సందర్భంగా గురువారం భద్రాద్రి   ఆలయ ప్రాంగణంలో కేవలం 100 మందిలోపు అతిథుల మధ్య  వేడుకను నిర్వహించారు. భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణాన్ని తిలకించారు.  

భద్రాచలం : భద్రాద్రి క్షేత్రంలో గురువారం సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకను టీవీల ద్వారా కోట్లాది మంది భక్తులు తిలకించి పులకరించిపోయారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ముత్యాల తలంబ్రాలను, పట్టువస్త్రాలను సమర్పించారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా ఉండేందుకు వేడకకు భక్తులను అనుమతించలేదు. ఏటా వేలమంది భక్తుల మధ్య మిథిలా స్టేడియంలో శిల్ప కళాశోభితమైన కల్యాణ వేదికపై సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈసారి ఆలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ మండపంలో నిరాడంబరంగా స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. 100 మంది లోపే వేడుకకు అనుమతించారు. తొలుత విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, శ్రీ సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సరిగ్గా 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జీలకర్ర, బెల్లాన్ని అర్చక స్వాములు ఉంచారు. మూడు మంగళసూత్రాలను భక్తులకు అర్చకస్వాములు చూపించి మాంగల్యధారణ గావించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ముట్టాయి. వేడుకకు ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు మరో మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు కేవీ రమణాచారి, ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య,  జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్‌ హాజరయ్యారు. కరోనా సమస్య నుంచి బయటపడి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని కోరుకున్నామని మంత్రులు చెప్పారు. శుక్రవారం శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు.

మరోసారి రామనారాయణ అంశం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం నిత్య కల్యాణ మండప వేదికపై మరోసారి రామనారాయణ అంశం ప్రస్తావనకు వచ్చింది. కల్యాణ తంతులో భాగంగా రామయ్య కల్యాణ విశిష్టతను వివరిస్తూ పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, రామనారాయణ అంశాన్ని ప్రస్తావించారు.. రాముడు, నారాయణుడు ఒక్కరేనని ఈ విషయంలో ఎటువంటి సందేహానికి తావులేదని స్పష్టం చేశారు.

అమాత్యా… భౌతిక దూరం ఏది?
కల్యాణ వేడుకలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు భౌతిక దూరం పాటించకుండా దగ్గరగా నిలబడ్డారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలను చైతన్యం చేయాల్సిన వారే ఇలా గుంపుగా నిలబడటం ఏమిటి అని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు.

Courtesy Adhrajyothi

RELATED ARTICLES

Latest Updates