జార్ఖండ్‌లో ఆకలిచావు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రాంచి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా అమలవుతున్న నిర్బంధం పేదల పాలిట పెనుశాపంగా మారింది. ఉపాధి లేక, తినడానికి తిండిలేక నిరుపేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి దయనీయ గాథ జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ గొలా బ్లాక్‌లో చోటుచేసుకుంది. ఆకలితో 70 ఏళ్లు పైబడిన వృద్ధురాలు గురువారం కన్నుమూసింది. జార్ఖండ్‌ రాజధాని రాంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగ్రామ్‌పూర్‌ అనే గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గత రోజుల నుంచి తినడానికి తిండి లేకపోవడంతో పయాసో దేవి అనే వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. రేషన్‌ ఇవ్వకపోవడం.. వండటానికి సరుకులేమీ లేకపోవడంతో ఐదు రోజులుగా ఆమె ఆకలితో బాధ పడుతోంది.

పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు డ్రమ్ము వాయిస్తూ జీవనం సాగించే ఆమె కుమారుడు తన కుటుంబంతో అదే ఊళ్లో వేరుగా ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రేషన్‌ సరుకులు తీసుకుని తన తల్లికి తిండి పెట్టడానికి కూడా డబ్బు సంపాదించలేకపోయినట్టు పయాసో దేవి కొడుకు వాపోయాడు. మూడేళ్ల క్రితం తన తల్లి పేరును రేషన్‌ కార్డు నుంచి తొలగించారని, ఎన్నిసార్లు అధి​కారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెకు చివరిసారిగా 2017లో మాత్రమే కార్డుపై రేషన్‌ ఇచ్చారని వెల్లడించాడు. ఆ తర్వాత రేషన్‌ ఎందుకు ఆగిపోయిందో, అధికారులు కార్డు ఎందుకు ఇవ్వలేదో కారణాలు తెలియదన్నాడు. కాగా, పయాసో దేవి కొన్నేళ్లుగా బిచ్చమెత్తుకుని జీవిస్తుందని తెలిసింది.

పెన్షన్‌ ఇస్తున్నాం: బీడీఓ
ఈ ఘటనపై బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి(బీడీఓ) కులదీప్‌ కుమార్‌ స్పందించారు. పయాసో దేవి కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉందని, ఆమె రేషన్‌ కూడా తీసుకోవడం లేదని చెప్పారు. వృద్ధాప్యపు పెన్షన్‌, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ప్రయోజనాలు అందుతున్నాయని వెల్లడించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రేషన్‌ కార్డు లేకపోయినా ప్రతి కుటుంబానికి 10 కిలోలు రేషన్‌ అందించాలని జార్ఖండ్‌ ప్రభుత్వం ఆదేశించినా ఆకలి బాధతో వృద్ధురాలు చనిపోవడం అధికారుల అలసత్వానికి అద్దం పడుతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

RELATED ARTICLES

Latest Updates