దివైర్‌ ఎడిటర్‌పై కేసు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

న్యూఢిల్లీ : సీనియర్‌ జర్నలిస్టు, ‘ది వైర్‌’ వెబ్‌సైట్‌కు చెందిన ఎడిటర్‌ సిద్ధార్ద్‌ వరదరాజన్‌పై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను తీరును ఆకక్షేపించినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రామజన్మభూమిలో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 2 వరకు మతపరమైన వేడుకలను నిర్వహించాలని ఢిల్లీలో తబ్లీగీ జమాత్‌ కార్యక్రమం జరిగిన రోజే ఆదిత్యనాథ్‌ అనుకున్నారని సిద్ధార్ద్‌ మార్చి 31న ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ నుంచి రాముడు కాపాడతాడంటూ ఈ కార్యక్రమం చేయాలి అనుకున్నారని అందులో పేర్కొన్నారు.

అయితే దీనిపై ముఖ్యమంత్రి మీడియా సలహాదారు మృత్యుంజయ కుమార్‌ వివరణ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమం ఏదీ ముఖ్యమంత్రి తలపెట్టలేదని, సిద్ధార్ద్‌ ట్వీట్‌ తొలగించకుంటే పరువునష్టం దావా వేస్తామని కుమార్‌ హెచ్చరించారు. దీంతో తప్పును సవరించుకుంటూ సిద్ధార్ద్‌ మరో ట్వీట్‌ పెట్టారు. ‘కరోనా మహమ్మారి బారిన పడకుండా భక్తులను రాముడు మాత్రమే కాపాడగలడు. ఆదిత్యనాథ్‌ కాదు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో మార్చి 25న నిర్వహించనున్న బహిరంగ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఇందులో ముఖ్యమంత్రి కూడా పాల్గొనాలి’ అని హిందుత్వవాది, అయోధ్య ఆలయ ట్రస్ట్‌ ముఖ్య అధికారి ఆచార్య పరమహంస పేర్కొన్నట్టు సిద్ధార్ద్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో మృత్యుంజయ కుమార్‌ మరోసారి ట్వీట్‌ చేశారు. సిద్ధార్ద్‌ తన ట్వీట్‌ తొలగించనందున, క్షమాపణ చెప్పనందున ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఎఫ్‌ఐఆర్‌ కాపీని సిద్ధార్ద్‌కు పంపించారు.

ఫేస్‌న్యూస్‌ను వ్యాప్తి చేశారన్న కారణంతో సిద్ధార్ద్‌పై ఫైజాబాద్‌లో పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారని ఏఎన్‌ఐ తెలిపింది. ఐపీసీ సెక్షన్లు 188, 505 (2) కింద కేసులు నమోదు చేశారు. సిద్ధార్ద్‌పై యూపీ పోలీసులు కేసు పెట్టడాన్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ తప్పుబట్టింది. కాగా, తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని సిద్ధార్ద్‌ వరదరాజన్‌ వ్యాఖ్యానించారు. సిద్ధార్ద్‌పై పెట్టిన వెంటనే ఉపసంహరించాలని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం డిమాండ్‌ చేశారు.

మీడియాను నిందించడం సరికాదు: ఎడిటర్స్‌ గిల్డ్‌
కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో వలస కార్మికుల వెతలపై కథనాలు రాసిన పత్రికలు, ఇతర ఎలక్ట్రానిక్‌, వెబ్‌ మీడియా సంస్థలను కేంద్రం ప్రభుత్వం నిందించడం సరికాదని ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది. లాక్‌డౌన్‌ విధించే ముందే రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని వలస కార్మికులను స్వస్థలాలకు వెళ్లేలా చర్యలు తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఈ మేరకు గురువారం ఎడిటర్స్‌ గిల్డ్‌ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్‌ గుప్తా, ఏకే భట్టాచార్య ఒక ప్రకటన విడుదల చేశారు. తమకు అనుకూలంగా వార్తలు రాయని మీడియాను మీడియాను బెదిరించాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మీడియా ప్రయత్నిస్తోందని తెలిపారు.

RELATED ARTICLES

Latest Updates