ఈఎంఐలపై వడ్డీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 మారటోరియం కాలంలోనూ..
వాయిదా చెల్లింపులపై బ్యాంకుల నిర్ణయం

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపుల మీద మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకుని ఈఎంఐలు చెల్లించని వారిపై ఆ మొత్తానికి బ్యాంక్‌లు వడ్డీని వసూలు చేయనున్నాయి. గృహ, వాహన, వ్యక్తిగత, వ్యవసాయ తదితర రుణాలపై ఆర్బీఐ గత వారం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మారటోరియం స్కీమ్‌ విధివిధానాలను వెల్లడించాయి. దీనికి ప్రకారం ఈ మూడు నెలల కాలానికి ఈఎంఐలు వాయిదా వేసుకు న్న వారు ఆ మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. రిటైల్‌, వ్యవసాయ, పెట్టుబడి మూలధనం తదితర వాటా ఇఎంఐల చెల్లింపు వాయిదాపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న రుణ గ్రహీతలకు ఇది మరో దెబ్బ కానున్నది. దీంతో ఆర్బీఐ తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్పించినట్టయిందని నిపుణులు పేర్కొంటున్నారు.

మారటోరియం కాలంలోని వాయిదాలపై వడ్డీ రేట్లు అమల్లో ఉంటాయని దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. ఉదాహరణకు ఓ బ్యాంక్‌ నుంచి రుణ గ్రహీత ఏడాదికి 12 శాతం వడ్డీతో రూ.1 లక్ష రుణం తీసుకుంటే.. నెలకు రూ.1000 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మారటోరియం పీరియడ్‌లోని మూడు నెలలకు గాను రూ.3000 వడ్డీ అవుతోంది. దీనికి కూడా 12 శాతం వడ్డీతో ఆ మూడు నెలల తర్వాత రూ.3030.10 చెల్లించాల్సి ఉంటుంది. రుణ గ్రహీత వాహన కొనుగోలుకు రూ.6 లక్షల రుణం పొందితే 54 నెలల పాటు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటే.. అందులో మూడు నెలలు ఈఎంఐ తది వరకు వాయిదా వేసుకుంటే అదనంగా వడ్డీ రూ.19,000 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సమానంగా ఖాతాదారుడు 1.5 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐలు వాయిదా వేసుకోకుండా సాధారణంగా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎంత కాలం ఈ వాయిదాలు చెల్లించకుండా ఉంటే అంత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మారటోరియం నేపథ్యంలో సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో మూడు నెలల మారిటోరియంను లాక్‌ చేశామని, దీంతో ఆటోమేటిక్‌గా ఈఎంఐ నిలిచిపోతుం దని ఎస్బీఐకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలియజేశారు.

ఒకవేళ ఈఎంఐ కట్‌ అయితే గనక ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. ఆ బ్యాంక్‌ శాఖను సంప్రదించడం ద్వారా తిరిగి ఆ మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. అన్ని రకాల రుణాల ఈఎంఐలు వాయిదా వేయడంతో పాటు క్రెడిట్‌ కార్డుల చెల్లింపులు కూడా వాయిదా వేయాలని ఆర్బీఐ సూచించింది. అంటే క్రెడిట్‌ కార్డులపై ఆయా కస్టమర్లు ఉపయోగించుకున్న మొత్తం బ్యాలెన్స్‌, వడ్డీ చెల్లింపు అన్నింటికీ ఆ మూడు నెలల విరామం వర్తిస్తుంది. ఆ రకంగా ప్రతీ నెలా కనీసం చెల్లించాల్సిన ‘మినిమమ్‌ బ్యాలెన్స్‌ డ్యూ’ చెల్లించకపోయినా ఫర్వాలేదు. గతంలో వలె క్రెడిట్‌ కార్డు కంపెనీలు కస్టమర్‌ను చెల్లింపు నిమిత్తం వెంటాడవు. కానీ ఆ సదుపాయం ఉపయోగించుకుంటే మాత్రం కస్టమర్లకు గల క్రెడిట్‌ కార్డు బకాయి మొత్తం మీద చక్రవడ్డీ విధిస్తారు. అంటే కస్టమర్‌కు భారం తడిసి మోపడవుతుందన్న మాట. ఉదాహరణకి ఎవరైనా కస్టమర్‌కు మార్చి 1 నాటికి కార్డుపై మొత్తం బకాయి రూ.50,000 ఉందనుకుంటే మూడు నెలల విరామం ముగిసే సమయానికి అతను చెల్లించాల్సిన మొత్తం అమాంతం రూ.58,000కి పెరిగిపోతుంది. ఈ ఇబ్బందిని తప్పించుకోవాలంటే నెలవారీ మినిమం బ్యాలెన్స్‌ డ్యూ చెల్లించడం మంచిదని బ్యాంకర్లు అంటున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates