మహావిపత్తులో కూడా పాత పద్ధతులేనా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
– కె. వేణుగోపాల్‌

ఈ మూడు వారాల లాక్‌డౌన్‌ నెల చివరిలో, నాలుగోవారంలో మొదలైంది. ఈ మూడువారాలు ఎలా గడుస్తాయనేది ఒక సమస్య అయితే, మొదటివారంలో జీతాలు అందకపోతే నెలవారీ జీతాలు అందుకునే ఉద్యోగుల గతి ఏమవుతుందనే ఆలోచనే ప్రభుత్వానికి రాలేదు. వారం రోజులు గడిచినాక క్షమించండి అని అడగడం కాదు, తాము నిర్వాహకులుగా ఉన్న దేశంలో, సమాజంలో ఏయే వృత్తుల, ఉపాధుల, ఉద్యోగాల మనుషులున్నారో, వారి అవసరాలు ఏమిటో, వారి నిత్య జీవిత పరిస్థితి ఏమిటో తెలిసిన ప్రభుత్వమే ఉన్నదా, అసలు తాను పాలిస్తున్న ప్రజలెవరో తెలిసిన ప్రభుత్వమే ఉన్నదా అని ప్రశ్నించుకోవలసిన సందర్భమిది.

మన రాష్ట్రాన్నో దేశాన్నో మాత్రమే కాదు, ప్రపంచాన్నే కరోనా వైరస్‌ మహావిపత్తు అతలాకుతలం చేస్తున్నప్పుడు మామూలుగా పాత పద్ధతి వ్యాసాలకు కాలం కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరిశీలించడానికి మాత్రమే పరిమితమైన ఈ శీర్షికను విస్తరించి ఈ విపత్తు సమయంలో ఆలోచించవలసిన కీలకమైన విషయాలు చర్చించవలసి ఉంది. ఈ విపత్తు ఏ తక్షణ కారణాల వల్ల వచ్చిందో పరిశీలించడం అవసరమే గానీ, దీర్ఘకాలిక కారణాలను కనిపెట్టడం అంతకన్న ఎక్కువ అవసరం. ద్రవ్య పెట్టుబడి రాజ్యంలో అమలవుతున్న ప్రపంచీకరణ, పర్యావరణ విధ్వంస రాజకీయార్థిక పరిణామాల మూలాన్ని పరిశీలించాలి. బహుళజాతి సంస్థల విజ్ఞాన శాస్త్ర సాంకేతిక పరిశోధనలు లాభాలవేటలో అత్యవసరమైన ప్రజోపయోగ అన్వేషణలను ఎలా విస్మరిస్తున్నాయో చరిత్రలు తవ్వాలి. దశాబ్దాలుగా ఉన్న వేరు వేరు కరోనా వైరస్‌లను ఓడించడానికి శాస్త్రవిజ్ఞాన అన్వేషణలు ఎందుకు జరగలేదో ప్రశ్నించాలి. ఈ సారి విపత్తు బైటపడిన తర్వాత సామ్రాజ్యవాద పాలకులూ, దేశ పాలకులూ, రాష్ట్ర పాలకులూ కూడా ఎటువంటి స్పందన చూపారో ఆలోచించాలి. అవసరమైన సమయంలో సరైన స్పందన చూపకుండా, ఒకానొక రోజు మేల్కొని హఠాత్తుగా ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా ఎటువంటి హడావుడి చర్యలు చేపట్టి సామాజిక జీవనాన్ని ఎంత అల్లకల్లోలం చేశారో ఆలోచించాలి.

అటు అనవసరమైన అతి భయానికీ, నిరాశకూ లోను కాకుండా, ఇటు ఏ జాగ్రత్తలూ తీసుకోని మితిమీరిన దుస్సాహసమూ చేయకుండా సమగ్ర ద’ష్టితో, సంయమనంతో ఈ మహా విపత్తు నుంచి ఎట్లా గట్టెక్కగలమో ఆలోచించాలి. ఈ మహావిపత్తు వల్ల కలగగల ప్రాణ నష్టాన్నీ, మానసిక భయాందోళనలనూ, ఇబ్బందులనూ మాత్రమే కాదు, ఈ విపత్తు అనంతర సామాజిక, ఆర్థిక జీవనాల గురించి కూడా ఆలోచించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకూ మన పాలకులూ, మనమూ పాటిస్తున్న, అలవాటైన ప్రాప్త కాలజ్ఞ వైఖరులను పక్కన పెట్టి విశాలంగా, సుదూరంగా ఆలోచించవలసిన అవసరాన్ని ఈ కరోనా మహావిపత్తు మానవజాతి ముందు పెడుతున్నది.

అటు భారత ప్రభుత్వమైనా, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ మహా విపత్తు విషయంలో, బాధిత ప్రజలకు ఉపశమనం, సహాయం అందించే విషయంలో చేపడుతున్న చర్యలన్నిటినీ సమర్థిస్తూ కూడా ఆ చర్యల బాగోగుల గురించి మాట్లాడవలసి ఉంది. ఆ చర్యల పూర్వాపరాల గురించి చర్చించవలసిన అంశాలున్నాయి. ఈ విపత్తును ఎదుర్కునే ప్రయత్నాలు ఎవరు చేసినా, ఎంత చేసినా, ఎందుకు చేసినా ప్రశంసించవలసిందే. పాత పరిశీలనలనూ విమర్శలనూ పక్కన పెట్టి కొత్త సమస్యలకు కొత్త పరిష్కారాలను అన్వేషించవలసిందే. అయితే అన్నిటికన్న ముందు ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన, గుర్తు చేసుకోవలసిన, ఇతరులకు గుర్తు చేయవలసిన మౌలిక అంశం ఒకటుంది.

ఒక ఆపత్సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పడం, కనీస సౌకర్యాలు కల్పించడం, ఉపశమనాలు ఇవ్వడం, సహాయం చేయడం ప్రభుత్వాల బాధ్యత. అదేమీ మెహర్బానీ కాదు. పాలకుల సొంత ఔదార్యమూ కాదు. ఆ పని చేయడానికే వారు అక్కడ ఉన్నారు. అది వారి బాధ్యత. ఒక ప్రజాస్వామిక సమాజంలో ప్రజా ప్రాతినిధ్య పాలన నెరపుతున్న పాలకులు, ప్రజల వనరులనూ, ప్రజాధనాన్నీ నిర్వహించే పాలకులు ప్రజల కోసం ఎంత చిన్న పని చేసినా, ఎంత పెద్ద పని చేసినా అది వారి బాధ్యతా నిర్వహణ మాత్రమే గానీ, అదేదో వారి మంచితనానికి చిహ్నం కాదు. కేవలం ఆ బాధ్యతను నిర్వర్తించినందుకు వారిని ప్రశంసించవలసిన అవసరమేమీ లేదు. ఆ బాధ్యతా నిర్వహణ సక్రమంగా సాగుతున్నదా లేదా ప్రశ్నించే, చర్చించే, సలహాలు చెప్పే అధికారం కూడ ప్రజలకు ఉంటుంది.

ఇప్పుడు సమస్య ఇంతటి క్లిష్ట పరిస్థితిలో బాధ్యతా నిర్వహణలో కూడా ప్రభుత్వాలు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించకపోవడం, తమకు అలవాటైన అలసత్వాన్నీ నిర్లక్ష్యాన్నీ కొనసాగించడం, పాత అక్రమ, అపసవ్య పద్ధతులనే పాటించడం, చేయవలసిన సముద్రమంత పనులను మూసిపెట్టి, చేసిన చెంబెడు పనులకు తమ భుజాలు తామే చరుచుకోవడం.

కరోనా వైరస్‌ మహమ్మారి గురించి తెలిసిన డిసెంబర్‌ – జనవరి నుంచి మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది మహావిపత్తు అని ప్రకటించేవరకూ, మార్చి 12న దేశంలో తొలి కరోనా మరణం సంభవించేవరకూ భారత ప్రభుత్వం ఏమీ చేయలేదనేది ఒక చేదు వాస్తవం. కరోనా వైరస్‌ మనుషుల ద్వారా మాత్రమే దేశంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి వైరస్‌ సోకినవారు ప్రవేశించకుండా చూడడం, ప్రవేశిస్తే వెంటనే పరీక్షలు చేసి కనిపెట్టడం, ఇతరులకు వైరస్‌ సోకకుండా సోకిన వారిని దూరం పెట్టడం, ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య వ్యవస్థలను సంసిద్ధం చేయడం, అవసరమైన పరికరాలనూ ఔషధాలనూ సిబ్బందినీ సిద్ధం చేసుకోవడం, ఈ విషయాలన్నీ ప్రజలతో పారదర్శకంగా పంచుకోవడం వంటి అనేక పనుల్లో ఏ ఒక్కదాన్నీ భారత ప్రభుత్వం చేయలేదు. కేంద్ర ప్రభుత్వమే చేయలేదు గనుక రాష్ట్రప్రభుత్వాలు చేస్తాయని ఆశించడం కూడా సాధ్యం కాదు.

కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ ప్రతికూల చర్యలు చేపట్టకపోవడం మాత్రమే కాదు, అసలు ప్రపంచంలో అటువంటిదేమీ లేదన్నట్టుగా బాధ్యతారహితంగా ప్రవర్తించింది. సామ్రాజ్యాధిపతికి స్వాగత సన్నాహాల్లో, లక్షలాది మందిని సమీకరించి సాగిలపడటంలో ఉత్సాహంగా మునిగి పోయింది. అప్పటికే ప్రారంభమైన మహమ్మారి చలనాన్ని ఇటువంటి భారీ జన సమీకరణలు మరింత త్వరితం చేస్తాయని కనీస జాగ్రత్తలు కూడా ఆలోచించలేదు.

పోనీ, మార్చి11-12ల్లో ఆలస్యంగా మేలుకొన్న తర్వాతనైనా తక్షణ, త్వరిత, సమర్థ స్పందనలు చూపారా అంటే అదీ లేదు. నింపాదిగా పది రోజుల తర్వాత పద్నాలుగు గంటల బంద్‌కు పిలుపు ఇచ్చారు. పన్నెండు గంటల కన్న ఎక్కువ సేపు మనుషులు ఒకరినొకరు కలవకపోతే వైరస్‌ గొలుసు తెగిపోతుందని ఒక భ్రమను ప్రచారం చేశారు. సంఫ్‌ు పరివార్‌కు సహజమైన అబద్ధాల, భ్రమల ప్రచారంలో భాగంగానే దీన్నీ చూశారు. ఆ పద్నాలుగు గంటల తర్వాత వైరస్‌ భారతదేశం నుంచి ఎగిరిపోతుండగా నాసా ఫొటోలు తీసిందని సంఫ్‌ుపరివార్‌ వాట్సప్‌ అబద్ధాల ఫాక్టరీ ప్రచారం కూడా ప్రారంభించింది. ఆ బంద్‌లో భాగంగా సాయంత్రం 5గంటలకు ప్రతి ఒక్కరూ తమ బాల్కనీల్లో నిలబడి చప్పట్లు కొట్టాలనీ, కంచాలు మోగించాలనీ, శంఖం ఊదాలనీ పిలుపు ఇచ్చారు. పాతకాలంలో గత్తర, మహమ్మారి వచ్చినప్పుడు, అవి క్షుద్రదేవతల ఫలితమని అనుకుని, వాటిని ఊరి పొలిమేరల అవతలికి పారదోలడానికి ఇటువంటి చప్పుళ్లతో ఊరేగింపులు జరిగేవి. అటువంటి మూఢనమ్మకాన్నే పునరుద్ధరించి దానికి వైద్య సిబ్బందికి కృతజ్ఞత అనే ముసుగు తొడిగారు.

నిజానికి ఇటువంటి మహావిపత్తు వచ్చినప్పుడు వైద్య సిబ్బందికి అవసరమైన పరికరాలు, యంత్ర సామగ్రి, వ్యక్తిగత భద్రతా సామగ్రి కావాల్సిన దానిలో పదిశాతం కూడా లేని దేశం మనది. అవసరమైనన్ని ఆస్పత్రులు, ఐసీయూ ఏర్పాట్లు, వెంటిలేటర్లు, ఔషధాలు, పరీక్ష కిట్లు వంటివేవీ లేవు. ఈ చప్పట్ల కన్నా అవి కల్పించడానికి ప్రయత్నం చేయడం అవసరం. ఈ పాలకుల ఆశ్రితులు బ్యాంకు రుణాల రూపంలో లూటీ చేసిన ప్రజాధనాన్ని వెనక్కి తెప్పించినా ఆ పరికరాలు కొనవచ్చు.

ఆ చప్పట్ల ప్రహసనం గడిచిన తర్వాత రెండు రోజులకే ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు, హెచ్చరికలు, అత్యవసర సేవల సంసిద్ధతా ప్రయత్నాలు ఏమీ లేకుండానే సరిగ్గా పెద్ద నోట్లరద్దు ప్రకటన లాగనే పన్నెండు గంటల నుంచి ఇరవై ఒక్కరోజుల పాటు లాక్‌డౌన్‌ అని రాత్రి ఎనిమిది గంటలకు ప్రకటించారు.
అంటే మొత్తం మీద అవసరమైన సమయంలో స్పందించడంలో, చర్యలు తీసుకోవడంలో వైఫల్యం, ఆ తర్వాత ఎటువంటి ఏర్పాట్లూ, సంసిద్ధతలూ లేకుండా హఠాత్తు నిర్ణయాలు తీసుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శించింది కేంద్ర ప్రభుత్వం.

ఇక ఈ లాక్‌ డౌన్‌ కు సంబంధించి పరిశీలించవలసిన కోణాలెన్నో ఉన్నాయి. లాక్‌డౌన్‌లో ప్రధానమైన అంశం ప్రభుత్వం ప్రకటించిన సోషల్‌ డిస్టెన్స్‌. నిజానికి భారత సమాజంలో ఈ సామాజిక దూరం, సామాజిక వివక్ష, సామాజిక వెలి వేల సంవత్సరాలుగా అత్యంత దుర్మార్గంగా అమలవుతున్నవే. కావలసింది సామాజిక దూరం కాదు. ఆరోగ్యానికి అవసరమైన దూరం, భౌతిక దూరం, వైరస్‌ సోకకుండా ఎడం. ఇంతకూ పేరేదైనా ఈ భౌతిక దూరం కూడా ఈ దేశంలో ఒక విలాసం. ఒంటిగది ఇండ్లలో, కిక్కిరిసిన ఇండ్ల సమూహాలలో, మురికి కాలువల పక్కన జీవించే దుర్భరస్థితిలో ఉన్న కోట్లాది మంది ఎంత ప్రాణావసరమైనా సరే, భౌతిక దూరాన్ని పాటించడం అసాధ్యం. అంతే గాక, వర్క్‌ ఫ్రమ్‌ హౌం అనే విలాసం సాధ్యమయ్యే ఉద్యోగాల కన్న వందల రెట్లో, వేల రెట్లో ఎక్కువ ఉద్యోగాలూ ఉపాధులూ వృత్తులూ పనులూ సామూహికంగా, సమష్టిగా మాత్రమే సాధ్యమయ్యేవి. అవన్నీ ఒక్క కలం పోటుతో ‘మిత్రోం’ అనగానే ఆగిపోయేవి కావు. ఆగిపోయాయంటే ఆ కోట్ల మంది తిండి ఆగిపోయినట్టే. మనుగడ ఆగిపోయినట్టే. అటువంటి కోట్లాది మంది భౌతిక దూరాన్ని పాటించడానికి అవసరమైన పరిస్థితులను ఎలా కల్పించాలనే కనీస ఆలోచన కూడ ప్రభుత్వం చేయలేదు.

దేశంలో అసంఘటిత రంగంలో, దుర్భరమైన పని పరిస్థితులలో, ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా నెలవారీ జీతాలతో పనిచేస్తున్న కోట్లాది మంది, ఏ రోజుకు ఆరోజు సంపాదనతో బతికే కోట్లాది మంది ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా పని పోగొట్టుకుంటే ఎట్లా మనుగడ సాగించగలరనే కనీస ఆలోచన కూడా చేయని ప్రభుత్వమిది. ఇటువంటి ఆఘాతాలను తట్టుకోగల ఆర్థిక వనరులు, సామాజిక వనరులు ఉన్న పిడికెడు మంది గురించి మాత్రమే ఆలోచించి, పని చేయకపోతే పూట గడవని కోట్లాది ప్రజలను, శ్రామికులను, చివరికి మధ్యతరగతిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ప్రకటించిన నిర్ణయం అది.

సరిగ్గా పెద్దనోట్ల రద్దు సమయంలో లాగనే మొదట నిర్ణయం తీసుకుని, దాని పర్యవసానాలను గురించి ఎప్పుడు ఆ పర్యవసానం జరిగితే అప్పుడు ఆలోచించి, అప్పుడు ఒక తాత్కాలిక పరిష్కారం ఆలోచించినట్టుగానే, ఈ లాక్‌డౌన్‌ నిర్ణయం ప్రకటించిన తర్వాత గాని పాలకులకు రోజువారీ కూలీల గురించి, వలస శ్రామికుల గురించి, అత్యవసర సేవల గురించి గుర్తు రాలేదు. రోజు కూలీలు, చిన్న వ్యాపారులు, దుకాణాలలో, చిన్న వ్యాపార సంస్థలలో, చిన్న కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, రోడ్ల పక్కన సరుకులు అమ్మి జీవితాలు గడిపేవారు, మెకానిక్కులువంటి సహస్ర వృత్తుల పట్టణ ప్రజానీకం మూడు వారాల పాటు తమ వృత్తులూ ఉపాధులూ లేకుండా జీవితావసరాలు ఎలా తీర్చుకోగలరని ప్రభుత్వం ఆలోచించనే లేదు.

ఈ మూడు వారాల లాక్‌డౌన్‌ నెల చివరిలో, నాలుగోవారంలో మొదలైంది. ఈ మూడువారాలు ఎలా గడుస్తాయనేది ఒక సమస్య అయితే, మొదటివారంలో జీతాలు అందకపోతే నెలవారీ జీతాలు అందుకునే ఉద్యోగుల గతి ఏమవుతుందనే ఆలోచనే ప్రభుత్వానికి రాలేదు. వారం రోజులు గడిచినాక క్షమించండి అని అడగడం కాదు, తాము నిర్వాహకులుగా ఉన్న దేశంలో, సమాజంలో ఏయే వృత్తుల, ఉపాధుల, ఉద్యోగాల మనుషులున్నారో, వారి అవసరాలు ఏమిటో, వారి నిత్య జీవిత పరిస్థితి ఏమిటో తెలిసిన ప్రభుత్వమే ఉన్నదా, అసలు తాను పాలిస్తున్న ప్రజలెవరో తెలిసిన ప్రభుత్వమే ఉన్నదా అని ప్రశ్నించుకోవలసిన సందర్భమిది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates