ఇదేం పద్ధతి…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-పీఆర్సీ ఇయ్యకపోగా జీతాల్లో 50 శాతం కోత
-సర్కారు తీరుపై ఉద్యోగుల్లో అసంతృప్తి
– పూర్తి జీతం చెల్లించాల్సిందే…
– ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌

కరోనా ప్రభావం ఉద్యోగుల జీతాలపైనా పడింది. ఇప్పటి వరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లను ఆందోళనకు గురిచేసింది. కరోనా పాజిటివ్‌ రాకపోయినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లంతా తీవ్రంగా బాధపడే పరిస్థితి దాపురించింది. కరోనా ఎంత పనిచేశావే…అని మనోవేదనకు గురవుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, పింఛనర్ల పింఛన్‌లో 50 శాతం కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించడమే ఇందుకు కారణంగా ఉన్నది. క్లిష్టపరిస్థితుల్లో సర్కారు ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. అయితే గతనెల 22 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నది. ఇప్పటి వరకు 11 రోజులు గడిచాయి. ప్రభుత్వానికి ఆదాయం రావాల్సిన ఆదాయం రాకపోతే కేంద్రంపై ఒత్తిడి పెంచి నిధులు రాబట్టాలి. ఉద్యోగుల జీతాల్లో కోత విధించకుండా ఆదుకోవాలి. అంతే తప్ప ఉద్యోగుల జీతాలను తగ్గించడం సమంజసం కాదని సంఘాలు వాపోతున్నాయి. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పూర్తి జీతాలు చెల్లించాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాయి. 2018, జులై ఒకటి నుంచి ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నది. ఇప్పటికే 21 నెలలు ఆలస్యమైంది. పీఆర్సీ ఎప్పుడు అమలవుతుందో స్పష్టత లేదు. కనీసం మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించలేదు. 2019లో రెండు డీఏలు అమలు చేయాల్సి ఉన్నది. ఇలా పీఆర్సీ, డీఏ కోసం ఎదురుచూస్తున్న సమయంలో జీతాల్లో కోత విధించడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోవడం లేదు. పీఆర్సీ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హామీలు నీటిమూటలయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 27ను ఉపసంహరించాలనీ, పూర్తి జీతాలు చెల్లించాలనీ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

27 జీవోను రద్దు చేయాలి : ఐక్యవేదిక
ఉద్యోగులు, పింఛనర్ల వేతనాల్లో 50 శాతం కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఐక్యవేదిక స్టీరింగ్‌ కమిటీ సభ్యులు మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెయిల్‌ ద్వారా పంపారు. జీవో నెంబర్‌ 27ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జీతాల్లో కోతను ఉపసంహరించాలని కోరారు. విపత్కర పరిస్థితులు వచ్చినపుడు కేంద్రం నుంచి అదనపు నిధులు కోరాలని సూచించారు. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సముచితమైన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

వేతన జీవులపై కోతలు తగదు
ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధించడం సరైంది కాదని టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి తెలిపారు. కరోనా పేరుతో వేతన జీవులపై కోతలు విధించడం తగదని ఎస్టీయూటీఎస్‌ అధ్యక్షులు జి సదానందంగౌడ్‌, ప్రధాన కార్యదర్శి ఎం పర్వతరెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల వేతనాల్లో 50 కోత విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సంపత్‌కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి బాలస్వామి వెల్లడించారు. ఉద్యోగులు, పింఛనర్లకు జీతాలు, పింఛన్‌ సగం చెల్లించాలని ప్రభుత్వం జీవోనెంబర్‌ 27 ఇవ్వడం అన్యాయమని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) అధ్యక్షులు నాగటి నారాయణ తెలిపారు. నెలకు రూ.60 వేల కంటే తక్కువ జీతం వస్తే ఉద్యోగుల కుటుంబాలు, రూ.40 వేల కంటే తక్కువ పింఛన్‌ వస్తే పింఛనర్ల కుటుంబాలు ఆర్థిక సమస్యల పాలవుతారని పేర్కొన్నారు. అవసరమైతే ఒకటి లేదా రెండు రోజుల వేతనం ఇవ్వడానికి సిద్ధమని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం చెన్నయ్య తెలిపారు. ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సరైంది కాదని డీటీఎఫ్‌ అధ్యక్షులు ఎం రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించడాన్ని అన్యమతంగానే సమర్థిస్తున్నామని స్పెషల్‌ ఎడ్యుకేటర్స్‌ ఫోరం జాతీయ కన్వీనర్‌ కల్పగిరి శ్రీను ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులకు ఆశనిపాతమని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు భూపాల్‌, ప్రధాన కార్యదర్శి యాదానాయక్‌ తెలిపారు. ధనిక రాష్ట్రమనీ, పది రోజుల లాక్‌డౌన్‌కే జీతాలు చెల్లించలేరా?అని టీఎస్‌పీటీఏ అధ్యక్షులు షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి ఎన్‌ చెన్నరాములు తెలిపారు. ఉద్యోగుల జీతాల్లో కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీపీటీఎఫ్‌ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు, టీపీయూఎస్‌ అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి సురేష్‌, టీఎస్టీయూ అధ్యక్షులు ఎండి అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పేర్కొన్నారు.

పూర్తి జీతాలివ్వాల్సిందే : ఉద్యోగ జేఏసీ
జీవోనెంబర్‌ 27ను పెండింగ్‌లో ఉంచాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ కారం రవీందర్‌రెడ్డి, సెక్రెటరీ జనరల్‌ వి మమత మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరంతర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందించాలని కోరారు. తక్కువ స్థాయిలో వేతనాలు, పింఛన్‌ పొందుతున్న వారికి, గతనెలలో ఉద్యోగ విరమణ పొందిన వారికి పూర్తి వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కర పరిస్థితిలో ఉద్యోగులు ప్రభుత్వానికి అందిస్తున్న సహకారంగా దీన్ని భావించాలని సీఎస్‌ సూచించారని తెలిపారు. ఉద్యోగులు ఆందోళన చెందొద్దనీ, లాక్‌డౌన్‌ పూర్తికాగానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన వివరించారని పేర్కొన్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates