ఎక్కడి గొర్లు అక్కడ్నే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 -శివార్లు మూసివేయడంతో కాపరుల ఇబ్బందులు
– మేత లేక మూగజీవాల విలవిల

గొర్రెల, మేకల పెంపకందారుల కష్టాలు అంతాఇంతా కాదు. కరోనా వారిని కట్టడి చేసింది. లాక్‌డౌన్‌తో ఒక ఊరొళ్లు మరో ఊరు పొలిమెర్లు దాటడం లేదు. దీంతో మేత కోసం మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. మహబూబ్‌నగర్‌ వలసజీవులకు మరింత కష్టం ఎదురైంది. వేసవిలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లేవారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇక లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా ఉండడంతో దాణా సరఫరా చేయాలని గొర్రెల, మేకల పెంపకందారులు డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణ ప్రాంతంలో 10లక్షల గొర్రెలు, మేకల పెంపకందారులు ఉన్నారు. 7లక్షల 29వేల మంది పూర్తిగా గొర్రెలు, మేకల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారంతా వలసజీవులే కావడంతో ప్రతియేటా జనవరిలో తమ సొంతూళ్ల నుంచి బయలుదేరి తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాన్ని చుట్టుముడతారు. జూన్‌, జులై మాసాల్లో మళ్లీ సొంతూళ్లకు చేరుతారు. వరంగల్‌ ఉమ్మడిజిల్లాలో 48వేలా 126 కుటుంబాలున్నాయి. వారంతా ఒక ఊరు నుంచి మరో ఊరు, ఒక మండలం నుంచి మరో మండలం వెళ్లి గడ్డి ఉన్న చోట మేపుకొని వస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కావడంతో గ్రామాలకు కంచెలు వేశారు. ఒక ఊరు గొర్రెల్ని మరో ఊరికి రానివ్వడం లేదు. మహబూబ్‌నగర్‌కు చెందిన వారు ఇటీవల గుంటూరు ప్రాంతానికి గొర్రెల్ని తోలుకు పోగా.. గద్వాల, జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన గొర్రెలకా పరులను గుంటూరుప్రాంతంలో అడ్డుకున్నారు. గొర్రెల, మేకల పెంపకందారులు సంఘం రాష్ట్ర నాయకులకు తెలపడంతో వెంటనే ఆ జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారు లతో మాట్లాడారు. తాత్కాలికంగా సమస్య పరిష్కారం అయినప్పటికీ తిరిగి తెలంగాణ ప్రాంతంలోకే గొర్రెల్ని తిప్పి పంపారు. వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట ప్రాంతంలో ఒక గ్రామానికి చెందిన గొర్రెల మేకల పెంపకందారులు మరో గ్రామానికి వెళ్లితే గొడవ జరిగింది. రఘునాథపల్లి మండలం లోని ఖిలాషాపురం గ్రామానికి చెందిన గొల్లకుర్మలు పక్క గ్రామాలకు మేతకు వెళ్లగా తమ పొలిమేర్లకు రానివ్వలేదు.

దాణా సరఫరా చేయాలి
ఒక గ్రామానికి చెందిన వారు మరో గ్రామం వారిని రానివ్వడం లేదు. దీంతో మేత సమస్య తలెత్తినందున వెంటనే దాణా సరఫరా చేయాలి. అదేవిధంగా సంతలు నిర్వహించాలి. ప్రస్తుతం గొర్రెలు, మేకల్ని అమ్ముకోలేకపోతున్నారు. నిత్యావసర వస్తువులకు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
– ఉదుత రవీందర్‌, జీఎంపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి

కట్టుబాట్లపై చర్యలు తీసుకోవాలి
గ్రామ పొలిమేర్లు దాటొద్దు అనే కట్టుబాట్లపై చర్యలు తీసుకోవాలి. మూగ జీవాలను ఏ గ్రామానికైనా తొలుకొని వెళ్లేవాళ్లం. కరోనాతో పలు గ్రామాలవారు తమ పొలిమేరల్లోకి రావొద్దు అంటున్నారు. కనీసం బావుల వద్దకువెళ్లి నీరు తాగనివ్వడం లేదు. రోగం మనుషులకు వస్తే మూగజీవాలను రానివ్వకపోవడం విచారకరం. ఇలాంటివి జరగకుండా చూడాలి.
– పుప్పాల లక్ష్మయ్య, సిద్దెంకి, జనగామ

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates