సరుకుల్లో బెరుకు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 – కొసరి కొసరి అంగన్‌వాడీల్లో పంపిణీ
– తక్కువ సంఖ్య ఉన్నచోట ఒకే నూనె ప్యాకెట్‌
– పాల ప్యాకెట్లూ పంచివ్వాలని అధికారుల సూచన
– కొలిచి అందించలేక టీచర్ల అయోమయం
– ఆరు రోజులకైనా పావుకిలో రాని పప్పు

అంగన్‌వాడీల మూసివేత కారణంగా లబ్దిదారులకు ఇంటికే పంపిణీ చేసిన సరుకులు కొసరి కొసరి వచ్చాయి. గర్భిణులు, బాలింతలకు పప్పు, బియ్యం, నూనె, పాలు అందించినా వాటిని పంపిణీ చేసే క్రమంలో టీచర్లు అయోమయానికి గురయ్యారు. తక్కువ సంఖ్య ఉన్న కేంద్రాలకు ఒకే నూనె ప్యాకెట్‌ అందించి, అందులోంచే కొలిచి ఇవ్వాలని అధికారులు సూచించారు. పాల ప్యాకెట్లలోనూ అదే పరిస్థితి తలెత్తడంతో వాటిని ఎలా పంపిణీ చేయాలంటూ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించగానే అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. సరుకులు నేరుగా లబ్దిదారులకు అందజేస్తామని ప్రకటించగానే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్‌ నగరంలో మంగళవారం నుంచి మొదటి విడతగా ఆరు రోజుల పాటు అందించాలని అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు చేరవేశారు. ఇక్కడే టీచర్లకు అసలు తంటా వచ్చింది. కేంద్రాలకు బియ్యం, పప్పు, పాలు, గుడ్లు, నూనె అందించినా వాటిని పంపిణీ చేసే సమయంలో టీచర్లకు తీవ్ర ఇబ్బందులొస్తున్నాయి. ఆరు రోజులకు ఒక బాలింతకు కనీసం పావుకిలో పప్పు కూడా రాలేదు. కిలో కంటే 100 గ్రాముల తక్కువ బియ్యమే వచ్చాయి. హిమాయత్‌నగర్‌ లోని ఒక అంగన్‌వాడీ కేంద్రంలో  పరిశీలించగా..

ఆ కేంద్రంలో 12 గర్భిణీ బాలింతలు, 12 మంది చిన్నారులున్నారు. అందరికీ కలిపి 20 కిలోలన్నర బియ్యం, మూడున్నర కిలో పప్పు, 30 పాల ప్యాకెట్లు, ఒక నూనె ప్యాకెట్‌ అందించారు. ఒక్కో బాలింతకు 150 గ్రాముల చొప్పున ఆరు రోజులకు 900 గ్రాములు బియ్యం, 30 గ్రాముల చొప్పున పప్పు 180 గ్రాములు, మూడు గుడ్లు అందించారు. ఒక చిన్నారికి రోజుకు 75 గ్రాముల చొప్పున బియ్యం 450 గ్రాములు, 15 గ్రాముల చొప్పున పప్పు 90 గ్రాములు అందించారు. ఆ కేంద్రానికి మొత్తం 30 పాల ప్యాకెట్లు (200 ఎంఎల్‌ చొప్పున) చేరితే 12 మంది బాలింతలకు 2 చొప్పున మొత్తం 24 ప్యాకెట్లు అందించారు. మిగిలిన ఆరు ప్యాకెట్లు సగం సగం పంపిణీ చేయలేక వాటిని తెరవకుండా అలాగే ఉంచేశారు. ఒకే నూనె ప్యాకెట్‌ రాగా, అందులో ఒక్కో బాలింతకు రోజుకు 16 గ్రాములు, చిన్నారులకు 5 గ్రాముల చొప్పున ఆరు రోజులకు అందించాలి. కానీ ప్యాకెట్‌ తెరిచి ఆయిల్‌ ఎలా కొలవాలని నూనె అందించలేకపోయారు. పైగా ఒక లీటర్‌ నూనె ప్యాకెట్‌లో కిలో నూనె కూడా ఉండదు. ఒక్కో గర్భిణీ బాలింతకు రోజుకు 16 గ్రాముల చొప్పున ఆరు రోజులకు 96 గ్రాముల నూనె ఇవ్వాలి. ఈ లెక్కన మొత్తం 12 మందికి 6 రోజులకుగాను కిలో 152 గ్రాములు అవసరమవుతుంది. చిన్నారులకు రోజుకు 5 గ్రాముల చొప్పున 12 మందికి 60 గ్రాముల నూనె ఇవ్వాలి. ఆరురోజులకు 360 గ్రాముల నూనె అవసరం. ఈ లెక్కన చూసినా సుమారు కిలోన్నరకుపైగా ఆ అంగన్‌వాడీ కేంద్రానికి నూనె చేరాలి. కానీ లీటర్‌ ప్యాకెట్‌ అందజేయడంతో టీచర్లు వాటిని పంచకుండా మిగతా సరుకులు అందజేశారు. తక్కువ లబ్దిదారులున్న అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది.

లబ్దిదారుల్లో అసంతృప్తి
గర్భిణీ బాలింతలకు అందించిన బియ్యం, పప్పు కనీసం ఆరు రోజులకైనా సరిపోదనే భావన వ్యక్తమవుతున్నది. 900 గ్రాముల బియ్యం ఆరు రోజులు కడుపు నింపుతుందా అని సరుకులు తీసుకున్న కొందరు మహిళలు ప్రశ్నించారు. ఇంతకుముందు ఒకపూట వండిన భోజనమైనా సరిపడా వచ్చేదనీ, కానీ సరుకులు ఇచ్చినా అవి ఎటూ నిండవనీ వాపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత తక్కువగా సరుకులు పంపిణీ చేయడం పట్ల అటు లబ్దిదారులతో పాటు ఇటు ప్రజాసంఘాల నాయకుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం అందజేసే పౌష్టికాహారం ఇదేనా అంటూ విమర్శలొస్తున్నాయి.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates