తాగడానికే లేవు.. చేతులెలా శుభ్రం చేసుకోవడం?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– అధికారులను ప్రశ్నిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
– ఢిల్లీ మురికివాడల్లో నీటి కష్టాలు

న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీ సమీపంలోని మహిపాల్‌పూర్‌ మురికివాడలో కరోనా వైరస్‌ ప్రజలకు నీటి కష్టాలను తెచ్చిపెట్టింది. ఇక్కడి ప్రజలు సమీపంలోని ప్రయివేటు యాజమాన్యంలో ఉన్న బోర్‌ వద్దకు వెళ్ళి ప్రతి రోజూ నీటిని తెచ్చుకుంటారు. కాని కరోనా ఆంక్షల నేపథ్యంలో పొలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న క్రమంలో ఆ కొద్ది దూరం వెళ్ళి నీటిని తెచ్చుకోవడం సాధ్యంకావడం లేదు. చేతులు శుభ్రంగా కడుక్కోండి అంటూ ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను వారు ప్రశ్నిస్తున్నారు. తాగడానికే సరైన నీరు లేదు… ఇక చేతులెలా కడుక్కోవాలని ప్రశ్నిస్తున్నారు. మహిపాల్‌పూర్‌లోని వ్యర్థాలను సేకరించే పని చేసుకుని జీవిస్తున్న దాదాపు 100 కుటుంబాలు ఇక్కడి జుగ్గిజోప్రి క్లస్టర్‌లో నివసిస్తున్నాయి. తమకు ఒక్క చుక్క నీరు కూడా అందుబాటులోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి నీటిని తెచ్చుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతనిపై లాఠీని ఝుళిపించారు. ఇంటికి వెళ్ళాలని హెచ్చరించారు.

ఇక్కడి కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి బోర్‌వెల్‌ను కూడా మూసివేశారని, ఇది తమకు అనూహ్య పరిణామమని వారు చెబుతున్నారు. అధికారులు నీటి సరఫరాకు అంతరాయం కలిగించబోరని తాము భావించామన్నారు. వంటకు, తాగేందుకు, స్నానం చేసేందుకు ఉపయోగించే నీరు అందకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా రాకుండా నివారించాలంటే చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు పదే పదే చెబుతున్నారు కాని, నీరు లేకుండా అది ఎలా సాధ్యం? అంటూ అక్కడి కుటుంబాలకు చెందిన వారు ప్రశ్నిస్తున్నారు. దీని కారణంగా తాము పనులకు వెళ్ళలేక పోతున్నామన్నారు.

దాదాపు నాలుగు నెలలుగా ఢిల్లీ జిల్‌ బోర్డు నుండి వారికి నీరు అందడం లేదు. ప్రైవేటు యాజమాన్యంలోని బోర్‌వెల్‌ మాత్రమే వీరికి ఆధారంగా ఉంది. 50 లీటర్ల సాధారణ నీటికి రూ.70లు, 15 లీటర్ల తాగునీటికి రూ.20లు వసూలు చేస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలకు నీటి కష్టాలతో పాటు వారి పనికి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్నది. అక్కడి కొన్ని కార్యాలయాల నుండి వ్యర్ధాలు తీసుకు వెళ్ళే వీరిపై సమీప కాలనీ వాసులు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో వీరికి పని కూడా లేకుండా పోయింది. ఇప్పటికే అక్కడ పోగుపడుతున్న వ్యర్ధాలను తీసుకెళ్ళేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే అదనుగా స్ధానిక జనరల్‌స్టోర్స్‌లో నిత్యావసరాల ధరలు పెంచారు. ఈశాన్య ఢిల్లీలోని భల్‌స్వాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates