నీట్ వాయిదా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– దేశంలో 763 పాజిటివ్‌ కేసులు.. 17 మరణాలు
– గవర్నర్లు, ఎల్‌జీలతో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌
– రెండున్నర గంటల్లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు
– ‘ఆపరేషన్‌ నమస్తే’తో ఆర్మీ యుద్ధం!
– పాత్రికేయులపై దాడులు తగదు: ఎడిటర్స్‌ గిల్డ్‌
– ప్రపంచవ్యాప్తంగా 25 వేల మరణాలు, 6 లక్షల పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌) వాయిదా పడింది. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకారం మే 3న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే శుక్రవారం అడ్మిట్‌ కార్డులను జారీ చేయాల్సి ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆ ప్రక్రియ కూడా వాయిదా పడింది. ఇదిలా వుండగా దేశంలో 763 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయనీ, వీరిలో 67 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 17 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ప్రస్తుతం 640 మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఒక్కరోజునే 39 కొత్త కేసుల నమోదుతో కేరళలో మొత్తంగా 164 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 130 పాజిటివ్‌ కేసులతో మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానంలో ఉంది. అలాగే, నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తున్నది. గుజరాత్‌లోనూ వైరస్‌ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకూ అక్కడ 43 కేసులు నమోదుకాగా ముగ్గురు మరణించారు. కర్నాటకలో 55 మందికి సోకగా, ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో 45, ఉత్తరప్రదేశ్‌లో 41, రాజస్థాన్‌లో 41 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఢిల్లీలో కరోనా సోకిన వారి సంఖ్య 39కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మందికి కోవిడ్‌-19 ప్రబలగా, వారిలో 25 వేల మంది చనిపోయారు. అత్యధికంగా అమెరికాలో 86 వేల మంది వైరస్‌ బారినపడగా.. 1,304 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు స్పెయిన్‌, ఇటలీలోనూ వైరస్‌ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. స్పెయిన్‌లో 5 వేలు, ఇటలీలో 8,300 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు.

విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా
విదేశాల నుంచి వచ్చిన వారిని మరింత నిఘాతో పర్యవేక్షించాలని కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా అన్ని రాష్ట్రాలకూ సూచించారు. ఈ విషయమై రాష్ట్రాలకు ఓ లేఖ రాసిన ఆయన.. విదేశాల నుంచి వచ్చిన వారందరూ ప్రస్తుతం నిఘాలో లేరన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇదే గనక నిజమైతే ఘోర ఆపద ముంచుకొచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిని పరిమితం చేసేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ వ్యత్యాసం విఘాతం కలిగించేలా ఉందని హెచ్చరించిన రాజీవ్‌ గౌబా.. వారిపై మరింతగా దృష్టి సారించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ నిర్బంధంలో ఉంచాల్సిందేనన్నారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారుల వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది ఉన్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు అందాయి.

ఏప్రిల్‌ 14 వరకూ అన్ని విమానాలు రద్దు : డీజీసీఏ
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే నెల 14 వరకూ అన్ని రకాల విమానాలు (దేశీయ, విదేశీ) రాకపోకలను నిషేధిస్తున్నట్టు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రకటించింది. వాణిజ్య విమానాల సర్వీసులు సైతం నిలిపివేయబడతాయని తెలిపింది. అయితే, ప్రత్యేక అనుమతులు తీసుకున్న తర్వాత కార్గో విమానాలకు రాకపోకలకు అనుమతి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది.

‘ఆపరేషన్‌ నమస్తే’ !
కరోనాపై పోరుకు భారత ఆర్మీ సైతం సిద్ధమైంది. కరోనాపై సర్కారు సాగిస్తున్న యుద్ధంలో ప్రభుత్వానికి తమ వంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే తెలిపారు. గతంలో ఆర్మీ చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామనీ, దీనిలోనూ తాము తప్పక విజయం సాధిస్తామన్నారు. తమ పరిధిలో ఇప్పటికే ఎనిమిది క్యారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సైనికుల కుటుంబీకులకు ఏదైనా సమస్య ఎదురైతే స్థానిక ఆర్మీ క్యాంపును సంప్రదించాలని సూచించారు.

కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అధికం !
ఇప్పటివరకూ మహారాష్ట్ర, కేరళ రెండు రాష్ట్రాల్లో అధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనుమానితుల సంఖ్య సైతం ఎక్కువగానే ఉంది. ఉంది దీంతో ఇరు రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలను మరింతగా విస్తృతం చేశాయి. లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం వివిధ జైళ్లలో ఉన్న ఉన్న 11వేల మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఏడేండ్లలోపు శిక్ష పడిన వారిని విడుదల చేయనున్నట్టు రాష్ట్ర హౌం శాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు.శుక్రవారం మరో 39 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెల్లడించారు. వీరిలో కాసర్‌గఢ్‌ జిల్లాకు చెందిన వారు 34 మంది, కన్నూర్‌ చెందిన వారు ఇద్దరు, త్రిస్సూర్‌, కోజికోడ్‌, కొల్లం జిల్లాల నుంచి ఒక్కొక్కరుగా ఉన్నట్టు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కు చేరిందన్నారు. మొత్తం 1,10,299 మంది పరిశీలనలో ఉండగా, వారిలో 1,09,683 మంది గృహ నిర్బంధంలో ఉన్నారు. 616 మంది ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా, 12 మంది కోలుకున్నారని పినరయి తెలిపారు. ఢిల్లీలోనూ కోవిడ్‌-19 చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 39 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయనీ, వీరిలో 29 మంది బయటి నుంచి వచ్చినవారేనని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ భవిష్యత్‌లో రోజుకు 100 పాజిటివ్‌ కేసులు నమోదైనప్పటికీ.. ఆ పరిస్థితులను ఎదుర్కోడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు.

రెండున్నర గంటల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు
కోవిడ్‌-19 రోగిని నిర్ధారించడానికి ప్రస్తుతం రెండు కంటే ఎక్కువ రోజుల సమయం పడుతుంది. అయితే, తాము అభివృద్ధి చేసిన కొత్త కరోనా టెస్ట్‌ కిట్‌ ద్వారా కేవలం రెండున్నర గంటల్లోనే కోవిడ్‌ నిర్ధారించవచ్చునని ఓ జర్మన్‌ కంపెనీ వెల్లడించింది. కరోనా నిరోధక పోరులో తమ కంపెనీ తయారు చేసిన కరోనా టెస్టింగ్‌ కిట్‌ సహాయపడుతుందని రాబర్ట్‌ బాష్‌ జీఎంబీహెచ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వోల్క్‌మర్‌ డెన్నార్‌ అన్నారు. వచ్చే నెల నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లోకి విక్రయాలకు తీసుకువస్తామని చెప్పారు.

మీడియా పనిని చేసుకోన్విండి: ఎడిటర్స్‌ గిల్డ్‌
విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు దాడులు చేయడాన్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఖండించింది. మీడియాను తన పని తాను చేసుకోనివ్వాలనీ, ప్రస్తుత సమయంలో కమ్యూనికేషన్‌ ఉండేలా మంత్రి స్థాయిలో రెగ్యులర్‌ మీడియా బ్రీఫింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కరోనా మహమ్మారిని గురించి ప్రజలకు తెలియజేయకుండా అడ్డుకోవద్దని పేర్కొంది.

సవాళ్లను ఎదుర్కోడానికి సిద్ధం కావాలి : రాష్ట్రపతి కోవింద్‌
దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. గవర్నర్లు, ఎల్‌జీలతో వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. కరోనా వ్యాప్తి కట్టడికి, ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద, మత సంస్థలను ఉపయోగించుకోవాని సూచించారు. కరోనా నిరోధానికి పూర్తి స్థాయిలో కొత్త మార్గాలను అన్వేషించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సమాజంలోని అట్టడుగు, బలహీన వర్గాలు, అసంఘటిత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. త్వరలోనే ఇవి తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం పాల్గొన్నారు. సహాయ కార్యక్రమాలకు మద్దతుగా తన ఒక నెల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates