సరిహద్దుల్లో ఉద్రిక్తత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 – చెక్‌పోస్టుల వద్ద నిలిచిన వాహనాలు
– మహారాష్ట్ర నుంచి యువకుల కాలినడక
– అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు నుంచి వెనక్కు పంపివేత
– పోలీసుల జోక్యంతో పరీక్షించి చేతిపై ముద్రలు

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల వద్ద పరిస్థితి ఉద్రిక్తతను తలపిస్తున్నది. చెక్‌పోస్టుల వద్ద భారీ సంఖ్యలో లారీలు, వాహనాలు నిలిచిపోవడం, ఉపాధి కోసం వెళ్లిన యువకులను కంపెనీల నుంచి వెళ్లగొట్టడంతో సొంతూళ్ల రాలేక అవస్థలు పడుతున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు యత్నించినా పోలీసులు రంగంలోకి దిగి వారిని నిలువరిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ సాలూర అంతరాష్ట్ర్ర చెక్‌పోస్టుల నుంచి అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఉపాధి కోసం మహారాష్ట్రకు వెళ్లిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ యువకులను కంపెనీలు మూసేసి, వారిని తిప్పి పంపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహా రాష్ట్రలోని పర్బనీ నుంచి 61 మంది యువకులు సొంతూర్లకు వెళ్లేందుకు కాలినడకన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని సాలూర వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుకు శుక్రవారం చేరుకున్నారు. ప్రస్తుతం నిబంధనల మేర రాష్ట్రంలోకి అనుమతించేది లేదని అధికారులు, పోలీసులు వారికి తేల్చిచెప్పారు. అధికారులు వచ్చి వారి వివరాలు సేకరించారు.

వైద్యసిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి వారి చేతిపై ముద్రలు వేశారు. అనంతరం గ్రామస్తులు మానవతా దృక్పథంతో స్పందించి వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో గోపీరాం మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణాలోకి అనుమతించే ప్రసక్తే లేదన్నారు.
నడుచుకుంటూ వస్తున్నం : దుర్గా ప్రసాద్‌, గుంటూరు

మహారాష్ట్రలో మేం పనిచేస్తున్న కంపెనీ మూసేయడంతో మమ్మల్ని వెళ్లగొట్టారు. ఎలాగైనా సొంతూరికి వెళ్లాలని బిలోలి నుంచి నడుచుకుంటూ వచ్చినం. ఇప్పుడు కనీసం తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం దయచూపి మా సొంతూరు గుంటూరుకు పంపించాలి.
ఎవరూ దయచూపడం లేదు : చందు, ప్రకాశం జిల్లా

ఉపాధి కోసం మహారాష్ట్రకు పోయాం. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ఎక్కువ కావడం వల్ల కంపెనీలు మూసి సొంతూర్లకు వెళ్లిపోమ్మంది. ఇక్కడ అధికారులు మాకు రానీయకుండా ఆంక్షలు పెట్టారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరూ మామీద కనికరం చూపట్లేదు. దయచేసి మా ఊరికి పంపితే రుణపడి ఉంటాం.

వాంకిడిలో వందలాది లారీలు
వాంకిడి : కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండల సమీపంలోని మహారాష్ట్ర -తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం వందలాది లారీలు నిలిచిపోయాయి. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువ ఉందనే కారణంతో అక్కడ్నుంచి తెలంగాణవైపు వస్తున్న లారీలను సరిహద్దుల్లోనే నిలిపేస్తున్నారు. నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్టు తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. బయటి వాహనాలను ఎట్టి పరిస్థితు ల్లోనూ అనుమతించరాదని సిబ్బందికి సూచించారు. రోడ్లపై ఉండిపోయిన డ్రైవర్లకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

ములుగు : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను ఎదుర్కోవాలంటే మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని వైద్యులు చెబుతున్నారు. కానీ గిరిపుత్రులకు వాటిని అందించండంలో వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం చేసింది. దీంతో ములుగు జిల్లా ఎజెన్సీ గిరిజనులకు మాస్క్‌లు దొరక్క ప్రకృతి ప్రసాదించిన తునికాకులనే మాస్కులుగా మలుచుకొని రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates