ఈఎంఐల వాయిదా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 – 3 నెలల పాటు తాత్కాలిక ఉపశమనం
– గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై మారటోరియం
– బ్యాంకులకు అనుమతిస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు
– ఆర్థికవ్యవస్థలో మునుపెన్నడూ లేనంత అస్థిరత : శక్తికాంతదాస్‌
– వాయిదా మాత్రమే.. రద్దు కాదు : ఆర్థిక నిపుణులు

ముంబయి : కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)తో దేశ ఆర్థిక వ్యవస్థలో మునుపెన్నడూ లేనంత అస్థిరతకు దారితీసిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ శుక్రవారం ఆర్‌బీఐ పలు కీలక నిర్ణయాలు వెల్లడిం చింది. కాలపరిమితి(టర్మ్‌)తో కూడిన అన్ని రకాల రుణాలపై మూడు నెలలపాటు మారటోరియం విధించింది. దీనివల్ల రుణాలు తీసుకున్నవారి క్రెడిట్‌ స్కోర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆర్‌బీఐ హామీ ఇచ్చింది. అలాగే రెపో రేట్‌ను 75బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. రివర్స్‌ రెపో రేటును 90 పాయింట్లకు కుదించింది. దాంతో ప్రస్తుతం రెపోరేటు 4.4శాతం, రివర్స్‌ రెపోరేటు 4శాతానికి చేరింది. అలాగే నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని సైతం 100 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దాంతో ప్రస్తుతం సీఆర్‌ఆర్‌ 3శాతానికి చేరుకుంది. వ్యాపార వర్గాలకు కూడా ఊరట కల్పించే వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్లపై వడ్డీని మూడు నెలల పాటు వాయిదా వేయాలని బ్యాంకులకు సూచించింది. దాం తో వడ్డీ భారం తగ్గి నష్టాల తీవ్రత నుంచి వ్యాపారులకు ఉప శమనం లభించనుందని తెలుస్తోంది. మార్చి 24-26మధ్య జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాల్లో తాజా పరిస్థితులను పూర్తిగా సమీక్షించి ఈ నిర్ణయాలు తీసుకున్నా మని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తెలిపారు. ఈమేరకు ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే…

ఖాతాదార్ల సొమ్ము భద్రం…
తాజా చర్యలతో రూ.3.74లక్షల కోట్లు మార్కెట్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రస్తుతం పటిష్టంగా ఉందన్నారు. ప్రయివేటు బ్యాంకుల్లోనూ ఖాతాదా రుల సొమ్ము భద్రంగా ఉందని హామీ ఇచ్చారు. ప్రజల నగదు ఉపసంహరణ(విత్‌డ్రా) విషయంలో ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన విధాన సమీక్ష తర్వాత మార్కెట్లోకి దాదాపు రూ.2.7లక్షల కోట్లు విడుదల చేశామని చెప్పారు.

ఆర్థిక స్థిరత్వం కోసమే ఈ చర్యలు
కరోనా వైరస్‌ విజృంభణ ఇలాగే కొనసాగితే దేశానికి ఎంతో ప్రమాదకరమని శక్తికాంతదాస్‌ అన్నారు. ప్రస్తుతం పరిస్థితులను నిశితంగా పరిశీలి స్తున్నామని, ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడిం చారు. వైరస్‌వ్యాప్తి, దాని తీవ్రతఎంతకాలం కొనసా గనుందన్న అంశాలపైనే భవిష్యత్తు వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలు ఉంటాయని స్పష్టం చేశారు.

వృద్ధి 4.7 శాతమే
కరోనా సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొనే బాటలో వడ్డీ రేట్లలో కోతల నిర్ణయాలను తీసుకున్నట్లు శక్తికాంత పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కావొచ్చన్నారు. ప్రస్తుత మార్చి త్రైమాసికంలో 4.7 శాతానికి పడిపోవచ్చన్నారు. భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రస్తుతం పటిష్ఠంగా ఉందన్నారు.

బ్యాంకులు అంగీకరించకపోతే చెల్లించాల్సిందే
కాలపరిమితితో కూడిన రుణ వాయిదాల చెల్లింపులపై ఆర్‌బీఐ మూడునెలలపాటు మారిటోరి యానికి అనుమతి ఇచ్చింది. మార్చి 1, 2020 నుంచి మూడు నెలల వరకు ఇది వర్తిస్తుంది. జాతీయ, ప్రాంతీయ, గ్రామీణ, సహకార బ్యాంకులు, గృహ రుణాలు అందజేసే సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు దాని పరిధిలోకి వస్తాయి. కాగా, ఈ ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ చేయాలా? లేదా? అన్నది నిర్ణయించేది బ్యాంకులే. ఆర్‌బీఐ నిర్ణయాల నేపథ్యంలో గృహ, వాహణ, వ్యక్తిగత…రుణాలు తీసుకున్నవారిలో పలు సందేహాలు ఏర్పడ్డాయి.

వాటికి ఆర్థిక నిపుణులు ఇస్తున్న సమాధానాలు ఇలా ఉన్నాయి…
మారిటోరియం అమలు చేసేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతించింది. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది బ్యాంకులే. వారు అంగీక రించకపోతే రుణ వాయిదా చెల్లించాల్సిందే. ఆర్‌ బీఐ మార్గదర్శకాలు విడుదలయ్యాకే.. ఈఎంఐ వాయిదా వేశారో లేదో తెలుస్తుంది. బ్యాంకులన్నీ కలిసి మారిటోరియంపై చర్చిస్తాయి. బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకుంటాయి. మారిటోరియం ఆమోదిస్తే ఆ విషయాన్ని వినియోగదారులకు తెలియజేస్తాయి.

  • బ్యాంకులు మారటోరియం ఆమోదిస్తే చెల్లించాల్సిన రుణం వాయిదా పడుతుంది..తప్ప, రద్దు కాదు. అసలు, వడ్డీ రెండింటిపై మారటోరియం ఉంటుంది.

  • కాలపరిమితి(టర్మ్‌)తో కూడిన రుణాలన్నీ మారటోరియం కిందకు వస్తాయని ఆర్‌బీఐ తెలిపింది. ఇందులో గృహ, వ్యక్తిగత, విద్య, వాహన ఇతర రుణాలు ఉంటాయి. టీవీ, మొబైల్‌, ఫ్రిడ్జ్‌…వంటి గృహోపకరణ వస్తువులపై తీసుకున్న రుణాలకూ వర్తిస్తుంది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates