చట్టసభల్లో బీసీల వాటా ఇవ్వాల్సిందే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హైదరాబాద్: వీరశైవ లింగాయత్‌ లింగబలిజ కులాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఓబీసీలో కలపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. త్వరలో చేయనున్న జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేయాలన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం రాష్ట్ర వీరశైవ లింగాయత్‌ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో జంతువులకు, పక్షులకు కూడా లెక్కలు ఉన్నాయని, కానీ బీసీ కులాల వారీగా లెక్కలు లేవని మండిపడ్డారు.

ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారని, బీసీలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. బీసీల్లో ఇప్పటివరకు కనీసం వార్డు మెంబర్‌ కాని కులాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని 18 జిల్లాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేడంటే బీసీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోందన్నారు. 72 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో ఇప్పటివరకు బీసీలు రాజకీయంలో 14 శాతం ప్రాతినిధ్యం దాటలేదని.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 9 శాతం, న్యాయవ్యవస్థలో 2 శాతం, ప్రైవేట్‌ ఉద్యోగాల్లో 2 శాతం కూడా మించలేదని కేంద్రం నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్‌లో 96 మంది బీసీ ఎంపీలు ఉన్నా బీసీ కులాల సమస్యలపై నోరు మెదపరని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో బీసీల వాటా కోసం అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

వీరశైవ లింగాయత్‌ లింగబలిజ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప, రాష్ట్ర అధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి 500 మందికి పైగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు, తమ న్యాయపరమైన డిమాండ్‌ సాధించుకునే వరకు ఉద్యమం ఆగదన్నారు. తమ డిమాండ్ల సాధనకు 18, 19న ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, సంఘం రాష్ట్ర ప్రధాన క్యాదర్శి జి.దినేష్‌ పాటిల్, గ్రేటర్‌ అధ్యక్షుడు రాచప్ప, రాష్ట్ర యువజన అధ్యక్షుడు శివశరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates