రాష్ట్రమే కేంద్రానికి 1.60 లక్షల కోట్లు ఇచ్చింది!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హైదరాబాద్‌ : విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, నీతి ఆయోగ్‌ సిఫారసులు కాకుండా కేంద్రం నుంచి న్యాయంగా, హక్కుగా రావాల్సిన నిధులు కూడా రాష్ట్రానికి రావటంలేవని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శాసనమండలిలో సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది? కేంద్రానికి రాష్ట్రం ఎంతిచ్చింది?’’ అనే అంశాలను వివరించారు. గడిచిన ఐదేళ్లలో వివిధ పన్నుల రూపంలో రూ. 2,72,926 కోట్లు తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిందన్నారు. కాని కేంద్రం రాష్ట్ర అభివృద్ధి పనులకు 1,12,854 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు. ఇంకా రూ.1,60,072 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి ఇచ్చిన విషయాన్ని బీజేపీ నేతలు గమనించాలని అన్నారు. 2019-20లో పన్నుల వాటా కింద రూ.20,583 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి, 15,968 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు తెలిపారు. ఇంకా 4,595 కోట్లు పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు 42 నుంచి 41 శాతానికి తగ్గటంతో రూ.2,384 కోట్లకు కోత పడిందని తెలిపారు. ఇవ్వాల్సిన నిధుల్లో రూ.723 కోట్లు పెండింగ్‌ ఉన్నట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధిశాఖకు 313 కోట్లు, పట్టాణాభివృద్ధికి 801 కోట్లు, జీఎస్టీ పరిహారం 933 కోట్లు, ఐజీఎ్‌సటీ నిధులు 2,812 కోట్లు, బీఆర్‌జీఎఫ్‌ నిధులు  450 కోట్లు ఈ ఏడాదికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సి ఉందని హరీశ్‌రావు వివరించారు.

ఎక్కడైనా 20 ఏళ్లల్లో కనిపించే గుణాత్మకమైన మార్పు… తెలంగాణలో ఐదేళ్లలో సాధ్యమైందని అన్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఆర్థిక మాంద్య ప్రభావం తెలంగాణలో లేదని అన్నారు. ఇక్కడ స్థిరమైన అభివృద్ధి సాధించటంతోనే సకాలంలో వేతనాలు, నిర్వహణ ఖర్చులు, అభివృద్ధి పనులు, సంక్షేమానికి నిధులు సర్దుబాటవుతున్నాయని అన్నారు. ప్రగతిశీల రాష్ట్రంగా ముందుకుపోతున్న తెలంగాణ వైపే అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ఆదాయం, జీఎ్‌సడీపీ, తలసరి ఆదాయం పెరిగాయని, దేశంలో రాష్ట్రం ప్రతిష్ఠ కూడా పెరిగిందని తెలిపారు. కాగ్‌ నివేదిక ప్రకారం.. 2014-15లో రూ. 62,306 కోట్లు ఖర్చు చేస్తే, 2018-19లో 1,35,328 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ వ్యయం 117 శాతంపెరిగిందని అన్నారు. వ్యవసాయ రంగంలో దేశ వృద్ధిరేటు 2.6 శాతం ఉంటే, తెలంగాణ 35.1ు వృద్ధి సాధించిందని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయంపై తెలంగాణలో రూ.8,581 కోట్లు ఖర్చు పెడితే, గడిచిన ఐదేళ్లల్లో 33,125 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. సాగునీటిరంగంపై కాంగ్రెస్‌ హయాంలో 54,021 కోట్లు వెచ్చిస్తే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,14,434 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. విద్యుత్‌ రంగంపై 49,575కోట్లు, పెన్షన్లపై 42,470 కోట్లు, పరిశ్రమలు, ఐటీ రంగంపై 4,389 కోట్లు వెచ్చించినట్లు హరీశ్‌రావు తెలిపారు.

ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం
సోమవారం సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై తొలుత మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత తీర్మానానికి సభ ఆమోదం లభించింది. తర్వాత సాయంత్రం 5.30 గంటలకు ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. రాత్రి 8.15 గంటల వరకు బిల్లుపై చర్చ జరిగిన అనంతరం సభ ఆమోదించింది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates