సీఏఏ వద్దు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఎన్పీఆర్‌, ఎన్నార్సీలనూ పునస్సమీక్షించండి
  • బదులుగా నేషనల్‌ ఐడెంటిటీ కార్డు ఇవ్వండి
  • కొత్త ఫార్మాట్‌లో వస్తే మేం మద్దతు ఇస్తాం
  • వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహి అంటారా?
  • మంత్రులు దారుణంగా మాట్లాడారు
  • గోలీమార్‌ సాలోంకో’ అంటారా!?
  • ఇది హిందూ, ముస్లిముల సమస్య కాదు
  • యావత్‌ దేశంలోని ప్రతి ఒక్కరి సమస్య
  • ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేయండి
  • శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • సీఏఏ వద్దంటూ అసెంబ్లీ తీర్మానం

హైదరాబాద్‌ : ఎన్పీఆర్‌, ఎన్నార్సీ వంటి ప్రక్రియల నుంచి తెలంగాణ ప్రజలను సంరక్షించడానికి కావాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ కోరింది. పెద్ద ఎత్తున ప్రజల వెలికి దారితీసే ఎన్పీఆర్‌, ఎన్నార్సీ అమలుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) సవరించాలని, విదేశాలు, మతాలకు సంబంధించి అందులో ఉన్న అన్ని ప్రస్తావనలను తొలగించాలని డిమాండ్‌ చేసింది. సీఏఏపై పునః సమీక్ష చేయాలని కోరింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. సీఏఏను సవరించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని సభ తీర్మానించిందన్నారు. ‘‘సీఏఏకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. దేశంలో చాలా పరిణామాలు సంభవించాయి. లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు దీన్ని నిరసిస్తున్నారు. దీనిపై ఇప్పుడు తెలంగాణ స్పందించాల్సి ఉంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఇప్పటికే సీఏఏను వ్యతిరేకించాం. కేబినెట్‌లో తీర్మానం చేశాం. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేశాయి. 8వ రాష్ట్రం తెలంగాణ’’ అని తెలిపారు. దేశ జీడీపీకి ఎక్కువగా కాంట్రిబ్యూట్‌ చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, అందుకే, దేశ సామాజిక భద్రత, భవిష్యత్‌లో బాధ్యత కూడా ఉంటుందని చెప్పారు.

గుడ్డిగా వ్యతిరేకించడం లేదు
‘‘మేం స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఢిల్లీకి వచ్చినప్పుడు 50 మంది చనిపోయారు. ఆ సమయంలో ఢిల్లీలో కొంతమంది ఎంపీలు, మంత్రుల నోట చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు విన్నాం. ‘గోలీ మార్‌ సాలోంకో’ అని వ్యాఖ్యానించారు. ఇదేం బాధ్యత? ఎవరి మంచిని ఆశించి.. ఎవరి శ్రేయస్సును ఆశించి.. ఎవరి భవిష్యత్తును ఆశించి చేశారు. భారత్‌ వంటి నాగరిక సమాజంలో ఇటువంటి న్యూసెన్స్‌ వాంఛనీయం కాదు. దేశంలో అనేక సమస్యలున్నాయి. దీన్ని తీసుకొచ్చి కల్లోలం రేపారు.  అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠ ఏమవుతుంది? ఇది హిందువులు, ముస్లింల సమస్యల కాదు. యావత్‌ భారత ప్రజల సమస్య’’ అని వ్యాఖ్యానించారు.

నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు
ఒక స్థాయి ఉన్న కుటుంబంలో పుట్టిన తనకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదని, కోట్లాదిమంది పరిస్థితి తనలాగే ఉందని సీఎం అన్నారు. మరి, సామాన్యులు, దళితులు, గిరిజనులు, నిరక్షరాస్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ‘‘సిటిజన్‌షి్‌పకు.. భారతీయుడివా కాదా? అని రుజువు చేసుకోవడానికి ఓటర్‌ ఐడీ కార్డు పనిజేయదంటారు? డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు పని చేయవని అంటే ఎలా!? ఏ ఓటరు కార్డుతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో.. ఆ ఓటరు ఐడీ కార్డు పనిజేయదంటే మరి మీ గవర్నమెంట్‌ ఉన్నదనుకోవాలా? లేదనుకోవాలా? ఢిల్లీలో షాహీన్‌బాగ్‌ ధర్నాలు జరుగుతున్నాయి. దేశ ప్రతిష్ఠను ఇది గంగలో కలిపింది. ఈ పరిస్థితుల్లో నారో థింకింగ్‌ పాలిటిక్స్‌ దేశానికి అవసరమా? ఈ విభజన రాజకీయాలు అవసరమా?’’ అని నిలదీశారు. దేశంలోకి చొరబాటుదారులను అనుమతించాలని ఎవరూ చెప్పరని వ్యాఖ్యానించారు. ఈ చట్టం ఇల్లీగల్‌ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ లోకూర్‌ చెప్పారని, ఆయన కూడా దేశద్రోహినేనా, పాకిస్థాన్‌ ఏజెంటేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానం చేస్తే తెలంగాణ ప్రభుత్వమే దేశద్రోహినా? అని ప్రశ్నించారు. ‘ఈ దేశం ఇటువంటి విధానాలను అంగీకరించదు. మాకు భేషజాలు లేవు. చచ్చినా, బతికినా సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీ టీఆర్‌ఎస్‌. అందుకే, పార్లమెంట్‌లో ఢంకా బజాయించి చెప్పాం. సీఏఏకు సంబంధించి వాజపేయి హయాంలోనే ఆడ్వాణీ నేతృత్వంలో కమిటీ వేశారు. అనంతరం, దేశంలో అందరికీ మల్టీపర్పస్‌ నేషనల్‌ ఐడెంటిటీ కార్డు (ఎంఎన్‌ఐసీ) ఇవ్వాలని నిర్ణయించారు. మెదక్‌తోపాటు ఢిల్లీ, గోవా, గుజరాత్‌, జమ్ముకశ్మీర్‌, పాండిచ్చేరి, రాజస్థాన్‌, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద 12 లక్షల మందికే కార్డులిచ్చారు. ఇలా కార్డులివ్వడం సాధ్యం కాదని కేంద్రం బంద్‌ పెట్టింది. విఫలమైన ప్రయోగాన్ని ఇప్పుడెలా తీసుకొస్తారు? దేశ విభజన సందర్భంగా కొంతమంది పాకిస్థాన్‌ వెళ్లారు. మరికొంతమంది భారత్‌ వచ్చారు. వారంతా ఎక్కడి నుంచి గుర్తింపు కార్డులు తేవాలి!? మన రాష్ట్రంలోని కాగజ్‌నగర్‌లో కాందిశీకులు పెద్దసంఖ్యలో ఉన్నారు. వారిని భారతీయులు కాదంటామా?  అందుకే, సీఏఏను అమలు చేయాలంటే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడాలి. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై నిపుణులతో చర్చించాలి’’ అని కేంద్రానికి సీఎం కేసీఆర్‌ సూచించారు.

సీఏఏపై పునః సమీక్ష చేయండి
సీఏఏ,  ఎన్పీఆర్‌, ఎన్నార్సీపై పునఃసమీక్ష చేయాలని కోరుతూ శాసనసభ తీర్మానం చేసింది. సోమవారం సభ ప్రారంభం కాగానే ఈ తీర్మానాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. రెండున్నర గంటలకు పైగా చర్చ అనంతరం ఆమోదించారు. కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్రం నిర్ణయం దేశానికి మంచిది కాదని అన్నారు. ‘‘మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సమీక్ష చేయాలి. కావాలంటే జాతీయ గుర్తింపు కార్డు తెండి మద్దతు ఇస్తాం. మా దేశ ప్రభుత్వం మా కోసం పనిచేస్తుందని ప్రజలు అనుకోవాలి’’ అని సూచించారు. దయచేసి చట్టాన్ని సమీక్ష చేయాలని కోరుతూ తీర్మానం చేస్తున్నామని వివరించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ నిరసనల మధ్య ఈ తీర్మానాన్ని ఆమోదించాలని కేసీఆర్‌ కోరగా… దాన్ని సభ ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

కేంద్రం చెప్పేదొకటి చేసేదొకటి
ఎన్పీఆర్‌ను అమలు చేసేది లేదని.. ఎన్నార్సీని తీసుకు వచ్చేది లేదని కేంద్రం చెబుతోందని, చివరికి, ప్రభుత్వ చర్యలన్నీ ఎన్నార్సీకే దారి తీస్తున్నాయని, అందుకే, ప్రజలు కేంద్రం చెబుతున్న విషయాలను నమ్మడం లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘కేంద్రం ఏదైనా చేయదలచుకుంటే బాజాప్తా చేయాలి. బేజాప్తా ఎందుకు? పార్లమెంట్‌కు ఒకటిచ్చి.. బైట మరొకటి ఎందుకు మాట్లాడతారు? చట్టంలో దారుణమైన తప్పులు ఉన్నాయి. మనది లౌకిక రాజ్యమని రాజ్యాంగం పేర్కొంది. కానీ, ముస్లింలను మినహాయించి చట్టం చేశారు. ఇది ఎలా సమ్మతం? దీనిని రాజ్యాంగం అనుమతించదు’’ అని స్పష్టం చేశారు. మజ్లిస్‌ తమకు మిత్రపక్షమని, అయినా కొన్ని విషయాల్లో విభేదిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆర్టికల్‌ 370 విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates