అధికారం నీదా.. నాదా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • సీఎం నేనా.. రమేశ్‌కుమారా
  • ప్రజలు ఓట్లేసి మాకు 151 సీట్లిచ్చారు
  • నాకే అధికారం లేదంటే ఎన్నికలెందుకు?
  • ఎస్‌ఈసీయే పాలించొచ్చు కదా!
  • ఇంటి స్థలాలు పంపిణీ చేయొద్దంటారా?
  • సీఎం కంటే ఆయనకు ఎక్కువ అధికారాలా?
  • వైసీపీ స్వీప్‌ చేస్తుందని భయం
  • గవర్నర్‌కు కంప్లయింట్‌ చేశాం
  • ఎస్‌ఈసీ మారతారని ఆశిస్తున్నాం
  • లేదంటే పైవారికి ఫిర్యాదు చేస్తా
  • ఎన్నికల కమిషనర్‌పై జగన్‌ ఆగ్రహం

అమరావతి : ‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే 151 స్థానాల్లో ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తేనే నేను సీఎం స్థానంలో కూర్చుకున్నాను. సీఎంగా నాదా అధికారం.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌దా’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎ్‌సఈసీ)ది ఒకే సామాజిక వర్గమని.. చంద్రబాబే ఆయన్ను నియమించుకున్నారని ఆరోపించారు. ప్రజలు అధికారమిచ్చిన జగన్‌కు ఎలాం టి అధికారమూ లేదంటే.. ఇంకా ఈ ఎన్నికల ప్రక్రియ ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఆయన.. ఆదివారం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అప్రతిహతంగా దూసుకుపోతోందని.. ఇది చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌కు మింగుడుపడలేదని.. అందుకే కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని ఆరోపించారు. వైరస్‌ నిరోధానికి అవసరమైన చర్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈ సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తూనే.. మరోవైపు కలెక్టర్‌, ఎస్పీ, సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వు ఇచ్చారని తప్పుబట్టారు. ‘విచక్షణాధికారం అని ఎన్నికల కమిషనర్‌ అంటున్నారు. ఈ మధ్య ప్రతివాడూ విచక్షణాధికారం అంటున్నారు. ప్రజల చేత ఎన్నికైన సీఎం కంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఎక్కువ అధికారాలు ఉంటాయా? రాష్ట్రాన్ని కూడా ఆయనే పరిపాలించొచ్చుగా’ అని మండిపడ్డారు. కరోనా వైరస్‌ సాకుతో.. ఎన్నికలు వాయిదా వేయడం సరికాదని.. వారం రోజుల్లో కొంపలేమీ మునిగిపోవని చెప్పారు. ఎన్నికల కమిషనర్‌కు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఒక్కటి కూడా రమేశ్‌కుమార్‌కు లేదన్నారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన కమిషనర్‌ విచక్షణ కోల్పోయారన్నారు.

5,000 కోట్లు రాష్ట్రానికి రావు..
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వకపోతే.. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5000 కోట్లు రాష్ట్రానికి రాకుండా పోతాయని జగన్‌ అన్నారు. వచ్చేఏడాది కూడా ఎన్నికలు జరక్కపోతే అప్పుడూ నిధులు రావన్నారు. ఎన్నికలు వాయిదా వేశాక.. పేదవారికి ఇంటి స్థలాలు పంపిణీ చేయవద్దని ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గవర్నర్‌కు కంప్లయింట్‌ చేశామని.. పిలిచి మాట్లాడాలని కోరామని.. ఆయన మారతారని ఆశిస్తున్నామని చెప్పా రు. లేదంటే పైవారికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

వాయిదా విషయం కార్యదర్శికీ తెలియదు
విచక్షణాధికారం పేరిట ఇష్టారీతిన వ్యవహరించే అధికారం కమిషనర్‌కు ఎవరిచ్చారని జగన్‌ ప్రశ్నించారు. ఎన్నికల వాయిదాపడిన విషయం ఎన్నికల కమిషన్‌ కార్యదర్శికి కూడా తెలియదన్నారు. ‘అంటే.. ఈ ఆదేశాలను ఎవరో రాశారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ చదివారు’ అని ఆరోపించారు. కరోనా వైరస్‌ నిరోధక కార్యకలాపాలు ఇప్పట్లో ఆగవని తెలిపారు. కొన్నాళ్లు పోతే విదేశాల్లో ఉన్న మనవారిని ఆరోగ్య సమస్యల కారణంగా ఆయా దేశాలు వెనక్కి పంపించడం మొదలవుతుందని చెప్పా రు. అదే జరిగితే వచ్చేవారికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాల్సి ఉంటుందని.. ఇది రెండు మూడు వారాల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని.. కనీసం ఏడాది పట్టవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియ మరో పది రోజుల్లో అయిపోయేదానికి వాయిదా వేశారని ఆక్షేపించారు. వాయిదా వేసే ముందు ఎవరినైనా కమిషనర్‌ ఎవరినైనా సంప్రదించారా అని ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ సీనియర్‌ అధికారులను సంప్రదించామని.. పోలింగ్‌ రోజు అధిక సంఖ్యలో జనం గుమికూడితే ఇబ్బందని చెప్పడంతో ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నామని కమిషనర్‌ అన్నారని.. రాష్ట్రంలో హెల్త్‌ సెక్రటరీ కంటే సీనియర్‌ అధికారి ఎవరుంటారని జగన్‌ నిలదీశారు. కనీసం ఆయన్ను సంప్రదించకుండా.. చీఫ్‌ సెక్రటరీతో మాట్లాడకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2000కి పైగా ఎంపీటీసీలను వైసీపీ స్వీప్‌ చేయడం సహించలేక, జీర్ణించుకోలేక రమేశ్‌కుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికలు వాయిదా వేశాక.. అధికారులను బదిలీ చేసే అధికారం ఆయనకు ఎక్కడిదని నిలదీశారు. ఇలాగైతే ఇక సీఎం ఎందుకు.. ఎన్నికల కమిషనరే సీఎంగా ఉండొచ్చుగా అని వ్యాఖ్యానించారు.

చెదురుమదురు ఘటనలు తక్కువే!
రాష్ట్రంలో 10,243 చోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే 43 చోట్లే చెదురుమదురు ఘటనలు జరిగాయని సీఎం అన్నారు. 2,794 వార్డుల్లో 15,185 నామినేషన్లు దాఖలైతే వాటిలో 14 చోట్లే చెదురుమదురు ఘటనలు జరిగాయని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఇంతకుముందెప్పుడైనా ఇంతకంటే తక్కువగా జరిగాయా అని సీఎం ప్రశ్నించారు. పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రశంసించారు.

ఎన్నికల సంఘాన్ని నియంత్రించండి.. గవర్నర్‌కు జగన్‌ వినతి
స్థానిక ఎన్నికల్లో వైసీపీ స్వీప్‌ చేస్తున్న తరుణంలో కరోనా వైరస్‌ సాకుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఈ ప్రక్రియను వాయిదా వేయడంపై సీఎం జగన్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆదివారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కరోనా వైర్‌సపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో.. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసినట్టు సీఎంవో అధికారులు ఆయనకు చేరవేశారు. దీంతో కరోనా వైర్‌సపై వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికను వెంటబెట్టుకుని ఆయన హుటాహుటిన రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో గంటసేపు సమావేశమయ్యారు. రాష్ట్రంపై కరోనా వైరస్‌ ప్రభావం లేదన్నారు. దాని సాకుతో ఎన్నికలు వాయిదావేశారని ఫిర్యాదు చేశారు. ఈ ఆదేశాలను పునఃసమీక్షించి.. ఎన్నికల ప్రక్రియను ఈ నెలాఖరులోగా యథాతథంగా పూర్తి చేసేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates