ఒక్క రోజులో 26 కొత్త కేసులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • దేశంలో 110కి చేరిన కరోనా బాధితులు
  • హైదరాబాద్‌లో మరొకరికి పాజిటివ్‌
  • మహారాష్ట్రలో అత్యధికంగా 32 మందికి వైరస్‌..
  • ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌కు మోదీ ఫోన్‌
  • ముంబైలో బృంద పర్యటనలపై 144 సెక్షన్‌..
  • కొచ్చి ఎయిర్‌పోర్టులో హైడ్రామా
  • వైరస్‌ సోకిన యూకే వ్యక్తిని దించేసి ఆస్పత్రికి తరలించిన అధికారులు
  • అతడి భార్యను.. మరో 17 మందిని కూడా!..
  • స్వచ్ఛందంగా ఆగిపోయిన మరొకరు
  • కర్తార్‌పూర్‌ యాత్ర నిలిపివేత..
  • సార్క్‌ దేశాధినేతలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌
  • కరోనా నిర్ధారణకు తొలి రెండు పరీక్షలూ ఉచితం..
  • కేంద్ర ప్రభుత్వం ప్రకటన

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగి 110కి చేరింది. ఒక్కరోజులోనే 26 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. తెలంగాణలో కొత్తగా మరో కేసు నమోదైంది. నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన హైదరాబాద్‌వాసికి వైరస్‌ సోకినట్లుగా పరీక్షలో తేలింది.

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ : దేశంలో కరోనా కేసుల సంఖ్య 110కి చేరింది. మహారాష్ట్రలో.. దేశంలోనే అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. ఔరంగాబాద్‌లో 59 ఏళ్ల మహిళకు, పుణె జిల్లాలోని పింప్రి-చించ్‌వాడ్‌లో ఐదుగురికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. మహారాష్ట్రలో వైరస్‌ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌లో మాట్లాడారు. వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి ప్రధానికి ఠాక్రే వివరించారు. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ముంబైలోని రైల్వే అధికారులు.. లోకల్‌ రైళ్ల డిస్‌ఇన్‌ఫెక్షన్‌ చర్యలు చేపట్టారు. కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో క్వారంటైన్‌లో ఉంటూ చనిపోయిన మహారాష్ట్రవాసికి వైరస్‌ నెగెటివ్‌ అని తేలింది. కాగా.. కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లాల్సిన విమానం ఉదయం 9.20కి ప్రయాణానికి సిద్ధమైంది. యూకేకు చెందిన 19 మంది బృందం అందులో ఎక్కారు. కానీ.. ఆఖరు క్షణంలో ప్రయాణాన్ని ఆపేశారు.

విమానం టేకాఫ్‌ తీసుకునే సమయానికి అధికారులు దాన్ని ఆపేశారు. విమానంలోని యూకే బృందాన్ని కిందకు దింపారు. వారంతా కేరళలో పర్యాటక ప్రదేశాలను చూడ్డానికి వచ్చిన టూరిస్టులు. మున్నార్‌లోని ఒక రిసార్టులో బస చేసి పర్యటించారు. వారిలో ఒకరికి కొవిడ్‌-19 సోకినట్టు అనుమానం రావడంతో మార్చి 11 నుంచి వైద్యులు అతణ్ని పరిశీలనలో ఉంచారు. అతడి నమూనాలను వైద్యపరీక్షలకు పంపారు. ఫలితాలు వచ్చేలోపే వారందరూ దేశం దాటి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతలోనే.. వైద్యపరీక్షల్లో అతడికి పాజిటివ్‌ రావడంతో అధికారులు పరుగులు పెట్టారు. అతడు కొచ్చి ఎయిర్‌పోర్టులో ఉన్న విషయం తెలుసుకుని అతణ్ని, అతడి భార్యను సమీప ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అతడితోపాటు కేరళలో పర్యటనకు వచ్చిన బృందంలోని 17 మందినీ దగ్గర్లోని ఒక హోటల్‌గదిలో క్వారంటైన్‌లో ఉంచారు. ఆ విమానంలో వెళ్లాల్సిన మరో ప్రయాణికుడు (యూకే బృందంతో సంబంధం లేని వ్యక్తి).. స్వచ్ఛందంగా ప్రయాణాన్ని మానుకుని హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఉదయం 9.20కి బయల్దేరాల్సిన విమానం మధ్యాహ్నం 12.47కు బయల్దేరింది. కొత్తగా పాజిటివ్‌గా నమోదైన యూకే వ్యక్తితో కలిపి.. కేరళలో కొవిడ్‌ కేసుల సంఖ్య 20కి చేరింది. 300 మంది దాకా అనుమానితులు ఆ రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నారు. ఢిల్లీలో ఈ వైరస్‌ ఇప్పటివరకూ ఏడుగురికి సోకగా.. అందులో ఒకరు శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. మిగతావారిలో ఇద్దరు కోలుకున్నారు.

హరియాణాలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 14. కానీ.. బాధితులంతా విదేశీయులే. కేరళలో ఇంతవరకూ 22 మందికి వైరస్‌ సోకింది. వారిలో ముగ్గురు.. దేశంలోనే తొలి కరోనా బాధితులు. ఆ ముగ్గురికీ పూర్తిగా నయమై ప్రస్తుతం వారి వారి ఇళ్లల్లోనే ఉంటున్నారు. రాజస్థాన్‌లో నలుగురికి వైరస్‌ పాజిటివ్‌ రాగా.. అందులో ఇద్దరు భారతీయులు, ఇద్దరు ఇటాలియన్లు. మరో ముగ్గురు బాధితులకు చికిత్సతో పూర్తిగా నయమైందని వైద్యులు తెలిపారు. యూపీలో వైరస్‌ సోకిన 12 మందిలో ఒకరు విదేశీయుడు కాగా.. మిగతా 11 మందీ భారతీయులు. పంజాబ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌  రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. లద్దాఖ్‌లో 3, జమ్ముకశ్మీర్‌లో 2, కర్ణాటకలో ఆరు కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని కలబుర్గిలో.. విదేశాల నుంచి వచ్చిన 16 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు ఆ రాష్ట్ర మంత్రి శ్రీరాములు తెలిపారు. ఇప్పటివరకూ కరోనా కేసులు లేని పశ్చిమబెంగాల్‌లో.. విదేశాల నుంచి వచ్చిన 10 మంది అనుమానిత లక్షణాలతో కోల్‌కతాలో ఆస్పత్రిలో చేరారు.

రద్దులు.. సెలవులు..
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 29 దాకా అన్ని తరగతులనూ రద్దు చేస్తున్నట్టు ఐఐటీ బాంబే ప్రకటించింది. విద్యార్థులందరినీ హాస్టళ్లు వదిలి ఇళ్లకు వెళ్లాలని సూచించింది. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు మాత్రం ఉండొచ్చని సూచించింది. మార్చి 31 దాకా కేజీ, ప్రైమరీ స్కూళ్ల మూసివేతకు తమిళనాడు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. పుదుచ్చేరి సర్కారు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించగా.. ఉత్తరాఖండ్‌ సర్కారు మొత్తం అన్ని స్కూళ్లనూ మార్చి 31 దాకా మూసేయాలని ఆదేశించింది. అసోం సర్కారు కూడా మార్చి 29 దాకా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జిమ్‌లు, సినిమాహాళ్లు, ఈతకొలనుల మూసివేతకు ఆదేశించింది. ముంబైలో మార్చి 31దాకా టూర్‌ ఆపరేటర్లు ఎలాంటి బృంద పర్యటనలూ నిర్వహించకుండా పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.

పారిపోతే కఠినచర్యలు
కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై వ్యాప్తి నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి. మాస్కుల కొరత రాకుండా చూసేందుకు 80,50,000 ఎన్‌-95 మాస్కుల అదనపు తయారీకి ఆర్డర్‌ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌కు నడిచే పాసింజర్‌ రైలు సర్వీసులను తూర్పు రైల్వే రద్దు చేసింది. పాకిస్థాన్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా యాత్రను, ఆ యాత్రకు రిజిస్ట్రేషన్లను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇక.. శనివారం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ సివిల్‌ హాస్పిటల్‌ నుంచి పారిపోయిన ముగ్గురు కొవిడ్‌ అనుమానితులు, నాగపూర్‌లోని మయో హాస్పిటల్‌ నుంచి పారిపోయిన నలుగురు అనుమానితుల్లో ముగ్గురు ఆదివారం తిరిగొచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇలా పారిపోయేవారిపై, వైద్యాధికారులకు సహకరించనివారిపై కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర మంత్రి రాజేశ్‌ తోపే అన్నారు.

సార్క్‌’ అత్యవసర నిధి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్‌) దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వైర్‌సను ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహంతో కదలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం సార్క్‌ అత్యవసర నిధి ఏర్పాటుకు ఆయన ప్రతిపాదించారు. భారత్‌ వంతుగా దాదాపు రూ.74 కోట్లు (10 మిలియన్‌ డాలర్లు) ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పరిశోధనలను సమన్వయం చేసుకుంటూ నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఈ సంయుక్త వేదిక ఉపయోగపడుతుందన్నారు. భారత వైద్య పరిశోధన మండలి తోడ్పాటు అందిస్తుందని వివరించారు. ఆదివారం సార్క్‌ సభ్య దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని ప్రసంగించారు. సరిహద్దుల మూసివేతతో ఆహారం, ఔషధాలు, నిత్యావసరాలకు ఇబ్బంది తలెత్తుందని అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ప్రస్తావించారు. కాగా, కరోనా వ్యాప్తిపై.. దేశాధినేతలంతా ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌  మాత్రం అప్రస్తుతంగా కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించి తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. కరోనా కేసులు నమోదైనందున కశ్మీర్‌లో అన్ని రకాల ఆంక్షలు ఎత్తివేయాలని పాక్‌  ఆరోగ్య మంత్రి జాఫర్‌ మీర్జా అన్నారు.

ఇరాన్‌, ఇటలీ నుంచి 452 మంది భారత్‌కు!
ఇటలీలో చిక్కుకుపోయిన భారతీయుల్లో 218 మందిని దేశానికి తీసుకొచ్చినట్టు విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. అక్కడున్న మిగతావారినీ తీసుకొస్తామన్నారు. ఇరాన్‌ నుంచి 234 మందిని ఢిల్లీకి తీసుకొచ్చినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు.ఇరాన్‌లో చిక్కుకుపోయిన మిగతా భారతీయులను రవాణా చార్జీలు లేకుండా భారత్‌కు చేరవేసేందుకు సిద్ధమంటూ ఇరాన్‌కు చెందిన ప్రైవేటు విమానయాన సంస్థ మహాన్‌ ఎయిర్‌ ప్రధాని మోదీకి లేఖ రాసింది.

ప్రవాసుల రక్షణకు ప్రత్యేక విభాగం : కరోనా ముప్పు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. విదేశాల్లో ఉన్న భారతీయుల సంరక్షణకు కేంద్రం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి కొవిడ్‌-19 సమస్యలకు సంబంధించి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఈ పనిలో ఆయనకు మరో నలుగురు అధికారులు సహకరిస్తారు. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సహకారంతో ఈ విభాగం పనిచేస్తుంది.

తొలి రెండు పరీక్షలూ ఉచితం
కొవిడ్‌-19 సోకిందీ లేనిదీ తెలుసుకోవడానికి చేసే పరీక్షను మొదటి రెండుసార్లూ ఉచితంగా చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్‌ ఈ విషయాన్ని తెలిపారు. కరోనా పరీక్షలకు అవసరమైనన్ని కిట్లు ఉన్నాయని.. ఉన్నవాటిలో 10 శాతాన్నే వినియోగించుకున్నారని వివరించారు. ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చి.. అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నవారు 011-23978046కు ఫోన్‌ చేసి వివరాలు తెలిపితే ప్రభుత్వం అనుమతించిన ల్యాబ్‌లో ఈ ఉచిత పరీక్ష నిర్వహిస్తామన్నారు.

రాజకీయానికి బ్రేక్‌

  • రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటితోనే ముగింపు
  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
  • సాదాసీదాగా బండి సంజయ్‌ ఆహ్వాన కార్యక్రమం
  • వీహెచ్‌ ధర్నాకు అనుమతి నిరాకరణ
  • వాయిదా పడుతున్న సభలు, సమావేశాలు

ఆలయాల్లో తగ్గిన భక్తులు 

  • యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి వెలవెల
  • సీతారామ కల్యాణంలో భక్తుల సంఖ్యపై ఆంక్షలు?
  • బాసరలో అక్షరశ్రీకారానికి రెండంకెలు దాటని పిల్లలు
  • తిరుమలలోనూ తగ్గిన భక్తుల రద్దీ
  • శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు రద్దు

పెళ్లి సందడి కరువు

  • కొన్ని ఫంక్షన్లు రద్దు.. మరికొన్ని వాయిదా
  • పెళ్లిళ్లలో వధూవరులకు మాస్క్‌లు
  • తగ్గుతున్న అతిథుల హాజరు
  • భారీగా మిగిలిపోతున్న వంటలు
  • శానిటైజర్లు వెంట తెచ్చుకుంటున్న జనం

విద్యార్థులు ఇంటిబాట

  • బడులు, కాలేజీలు, యూనివర్సిటీలూ అన్నీ మూసివేత
  • యూనివర్సిటీ హాస్టళ్లలో మెస్‌లూ బంద్‌
  • పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కష్టాలు
  • రైస్‌ కుక్కర్లు కొని వండుకుతినేందుకు ఏర్పాట్లు
  • అత్యధికులు సొంత ఊళ్లకు పయనం

పడకేసిన పర్యాటకం

  • లుంబినీ, సంజీవయ్య, ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ మూసివేత
  • లక్నవరం, బొగత జలపాతాల సందర్శన నిలుపుదల
  • జనాల్లేక నెక్లెస్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌ పరిసరాలు వెలవెల
  • నాగార్జునసాగర్‌ అతిథి గృహంలోని 36గదులు ఖాళీ
  • రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు నిర్మానుష్యం

సినిమాకు విశ్రాంతి

  • రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల గేట్లకు తాళం
  • థియేటర్ల అడ్డా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సందడి కరువు
  • పలు హాళ్లలో మరమ్మతులు, నవీకరణ పనులు
  • సిబ్బందికి జీతాలిస్తామంటున్న కొన్ని యాజమాన్యాలు
  • నిర్మల్‌లో మాత్రం నడిచిన థియేటర్లు

మందు లేదు.. చిందూ లేదు

  • రాష్ట్రంలో వీకెండ్‌ పార్టీలకు కరోనా దెబ్బ
  • పలుచోట్ల పబ్బులు, బార్లు బంద్‌
  • కొన్ని చోట్ల పర్మిట్‌రూంలు కూడా
  • యాజమాన్యాలకు లక్షల్లో నష్టం

టెర్రరెస్టు

  • కరోనా జోరుకు ఐసిస్‌ హైరానా
  • ఉగ్రవాదులెవరూ యూరప్‌ వెళ్లొద్దు
  • అక్కడివారు అక్కడే ఉండాలని సలహా
  • తుమ్ములు, ఆవులింతల సమయాల్లో జాగ్రత్త
  • మాస్క్‌లు తప్పక ధరించాలని సూచన

అలసి సొలసి..
కరోనా వైరస్‌ బాధితులకు సేవలు అందించి అలసిసొలసిపోయిన నర్సు ఈమె! ఇటలీలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 1441కి చేరింది. నిర్విరామ సేవలు అందించడంతో పని చేస్తున్న చోటే ఆమె అలసటతో ఇలా  నిద్రించింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలైంది. ‘ఓ వైపు నా బలహీనతను చూస్తే బాధేస్తోంది. మరో వైపు నా కథ విన్నవారు పంపుతున్న మెసేజ్‌లు చూస్తుంటే ఆనందమేస్తోంది’ అని ఆ నర్సు వ్యాఖ్యానించింది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates