హర్ష మందర్ నేరస్తుడా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 – సంగిరెడ్డి హనుమంతరెడ్డి

”భక్తిశ్రద్ధల శిక్కు తల్లిదండ్రులకు జన్మించినా భౌతికవాదిని, మానవ వాదిని. దేవుని నమ్మను. మతం ఆచరించను. సంఘీభావం, సమానత్వం, కరుణ, శాంతి, న్యాయాలను ప్రోత్సహించే మత విశ్వాసాలను గౌరవిస్తాను” హర్ష మందర్‌.

హర్ష మందర్‌ పేరులో సింఫ్‌ు తీసేసి కులగుర్తింపు వదిలేశారు. కుమార్తెకు సురూర్‌ అన్న అరబిక్‌ పేరు పెట్టారు. మందర్‌ కుటుంబం రావల్పిండి నుంచి షిల్లాంగ్‌ వలసవచ్చింది. హర్ష తండ్రి హర్‌ మందర్‌ సింఫ్‌ు నెహ్రూ ఫ్రాంటియర్‌ అడ్మినిస్ట్రెటివ్‌ సర్వీస్‌లో పనిచేశారు. తండ్రి బదిలీలతో హర్ష పలు ప్రాంతాల్లో చదివారు. ప్రగతిశీల భావాలు, ఆదర్శాలు అబ్బాయి. 64ఏండ్ల హర్షమందర్‌ మాజీ ఐఎయస్‌ అధికారి. రచయిత, పాత్రికేయుడు, పరిశోధకుడు, బోధకుడు, సామాజిక కార్యకర్త. సామూహిక బాధితులు, కూడు గూడు లేనివారు, వీధి పిల్లల కోసం పనిచేస్తున్నారు. దిల్లీ ‘సమానత్వ అధ్యయనాల కేంద్రం’ నిర్దేశకుడు. ఆహార హక్కు ప్రచారంలో సుప్రీంకోర్టు స్పెషల్‌ కమిషనర్‌గా, జాతీయ సలహా మండలి సభ్యునిగా సేవలందించారు. గిరిజన ప్రధాన రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో 20ఏండ్లు పనిచేశారు. 22ఏండ్లలో 17 బదిలీలకు గురయ్యారు. హర్ష కూతురు 8వ తరగతికే 11 స్కూళ్ళు మారింది. ఒక్క బదిలీ కూడా నియమబద్దం కాదు. 1984లో ఇందిర హత్య జరిగినప్పుడు మందర్‌ ఇందోర్‌ అడిషనల్‌ కలెక్టర్‌. సైన్యం సాయంతో 6గంటల్లో అల్లర్లు నియంత్రించారు. ముఖ్యమంత్రి అర్జున్‌ సింఫ్‌ు బదిలీచేశారు. ఒక జిల్లా పాలకుని 2,200 ఎకరాల భూమిని చట్టప్రకారం పేదలకు పంచారు. మరో జిల్లా కరువు పనుల్లో అవినీతి అరికట్టారు. నర్మదా నిరసనకారులపై చర్య తీసుకోలేదు. మరోచోట మత ఘర్షణల మూకలను అరెస్ట్‌ చేశారు. గుజరాత్‌ మారణహౌమం చూసి రాజీనామాచేసి సామాజిక క్రియాశీలిగా మారారు. ‘సమాచార హక్కుప్రచారం’ వ్యవస్థాపక సభ్యుడు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సంస్థలు వెట్టిచాకిరీ, మానసికరోగ ఆస్పత్రుల, సామాజిక రక్షణ, దారిద్య్ర రేఖ దిగువ జనాభా జాతీయ కమిటీల్లో సభ్యుడు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘యాక్షన్‌ ఎయిడ్‌ ఇండియా’ నిర్దేశకుడుగా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌ ఆరోగ్య వనరుల కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు. మానసిక వికలాంగుల సాధికార సంస్థ ఇన్సెన్స్‌ అధ్యక్షుడు. అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇన్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌, ఢిల్లీ స్టీఫెన్శ్‌ కళాశాలల్లో, ముస్సోరినేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌, జామియా మిలియా ఇస్లామియా, కాలిఫోర్నియా సంస్థ, జేఎన్‌యూ, ఇంగ్లాండ్‌ ససెక్స్‌ వర్సిటీ, నల్సార్‌, బోస్టన్‌ ఎంఐటి, లాస్‌ ఏంజెల్స్‌ కాలిఫోర్నియా వర్సిటీ, వాషింగ్టన్‌ స్టాన్ఫోర్డ్‌, ఆస్టిన్‌ విద్యాలయాల్లో బోధించారు. 25 పుస్తకాలు రచించారు. పత్రికలకు వ్యాసాలు రాస్తారు. విజ్ఞాన పత్రాలు సమర్పిస్తారు. ఆయన కథలను సినిమాలు తీశారు. అనేక బహుమతులు లభించాయి. 2017లో మితిమీరిన చిత్రవధలకు చలించి, బాధిత కుటుంబాల సహాయ కార్యక్రమం ‘ప్రేమ వాహనం’ మొదలు పెట్టారు.

కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, బీజేపీ మాజీ శాసనసభ్యులు కపిల్‌ మిశ్రా, పర్వేశ్‌ వర్మ, అభరు వర్మల ద్వేషపూరిత ఉపన్యాసాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయమని మందర్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. బెంచ్‌ జడ్జ్‌ గవాయి హర్ష మందర్‌ జామియా మిలియా వర్సిటీలో డిసెంబర్‌ 16 ఉపన్యాసం ప్రస్తావించి మందర్‌ను కొట్టటానికి సొలిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేతికి కర్ర అందించారు. మార్చి4న సుప్రీంకోర్టులో మందర్‌ ఉపన్యాసంలో ఎన్నుకున్న భాగాలు మెహతా ఉదహరించారు. ”భారత భవిష్యత్తు వీధుల్లో నిర్ణయించమని రెచ్చగొట్టారు. నాకు సుప్రీం కోర్టుపై నమ్మకం లేదన్నారు” అని ద్వేషపూరిత ఉపన్యాస అభియోగం మోపారు. ”మందర్‌పై అభియోగాలు తీవ్రమైనవి. ఆయనపై అభియోగాల సమస్య సరిదిద్దే వరకు కోర్టు ఆయన అభ్యర్థన వినదు. మందర్‌ను ఏం చేయాలో జడ్జీలు నిర్ణయించాలి” అని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే అన్నారు. కోర్టు పక్కదారి పట్టినట్టు అనిపించింది. ఆడియోల మాటలు, వీడియోల బొమ్మలు మార్చటంలో సంఘీయుల నైపుణ్యం విశ్వవిఖ్యాతం. ఆరోపణ నిర్ధారించకుండానే న్యాయమూర్తి ఒక అభిప్రాయానికి రావచ్చా? పిటిషనర్‌ను అనుమానించవచ్చా? మందర్‌ శిక్షార్హుడన్న సంకేతం ఇవ్వచ్చా? న్యాయం చేయటమే కాదు చేసినట్టు కనిపించాలన్న సూత్రానికి తిలోదకాలిచ్చినట్టు కాదా? ఢిల్లీ పోలీసులను పొగిడి అల్లర్ల విలన్లను వదలమని షా లోక్‌సభలో ప్రకటించారు. ఆయన విలన్లు మందర్‌ లా! మందర్‌ పై కేసుపెట్టిన పోలీసులు షా మాటలతో రెచ్చిపోరా? మెహతా ప్రస్తావించిన మందర్‌ ఉపన్యాస భాగాన్ని చూద్దాం.

”రాజ్యాంగ రక్షణకు మనం వీధుల్లోకి వచ్చాం. వీధుల ఆక్రమణ కొనసాగిస్తాం. లౌకికులమని చాటుకున్న రాజకీయ పార్టీలు నైతికబలాన్ని కోల్పోయాయి. మన పోరాటం పార్లమెంటులో నెగ్గదు. ఎన్‌ఆర్‌సీ అయోధ్య వివాదం, కాశ్మీర్‌ 370 రద్దు తీర్పుల్లో మానవత్వం, సమానత్వం, లౌకికత్వాల రక్షణలో సుప్రీంకోర్టు వైఫ్యల్యాన్ని గమనించాం. మన పోరాటం సుప్రీంకోర్టులో నెగ్గదు. అయినా అది మన సుప్రీంకోర్టు. అక్కడ ఎంత గట్టిగా పోరాడాలో అంత గట్టిగా పోరాడుదాం. అయితే పార్లమెంటు, సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వవు. ఒక విధంగా నిర్ణయం వీధుల్లో జరుగుతుంది. మనం వీధుల్లో ఉన్నాం. నిర్ణయం తీసుకోగల మరో స్థానం వీధుల కంటే పెద్దది – మన హృదయాలలో- మన పోరాటాలకు పరిష్కారం దొరుకుతుంది. వాళ్లు హింసను ప్రేరేపిస్తారు. హింసకు రెచ్చగొడతారు. హింసకు పాల్పడటం. మిమ్ములను హింసకు రెచ్చగొట్టడం వాళ్ళ ఎత్తుగడ అని అర్థంచేసుకోండి. మనం 2శాతం హింసతో స్పందించినా వాళ్ళు 100శాతం కంటే ఎక్కువ హింసతో ప్రతిస్పందిస్తారు. హింస, న్యాయం గురించి గాంధీ ఏమి బోధించారో మనకు తెలుసు.” ఇది విద్వేష సంభాషణ కాదు. రాజ్యాంగ కర్తవ్య స్ఫురణ.

సుప్రీం తీర్పులను సుప్రీంకోర్టు పూర్వ శాశ్వత న్యాయమూర్తి మార్కండేయ కట్జు యే తప్పుబట్టారు. మందర్‌ను మెచ్చకపోయినా నిందించరాదు. దేశద్రోహులు దేశభక్తులుగా మారిన భారత్‌లో ఇది అసాధ్యం. విద్వేష ఉపన్యాస అభియోగంపై స్పందన తెలపమని సుప్రీం కోర్టు హర్ష మందర్‌ను మార్చి 6న ఆదేశించింది. ఈ వాదన ఏప్రిల్‌ 15న వింటానంది. నేరస్తులను వదిలి వార్తాహరున్ని శిక్షించినట్టు ఉందని మందర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే, నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే ఫిర్యాదుదారుపై కేసు పెడుతున్నారని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజాహక్కుల రక్షణ కోర్టుల బాధ్యత. రాజ్యాధికారంతో విర్రవీగుతున్నవారిని, జీవితాలను ప్రజలకు అంకితం చేసినవారిని ఒకే గాట కట్టరాదు. ఉన్న కేసు కాదని కొత్త నిందను విచారించడం సబబా? ఆలస్యన్యాయంతో దొంగ వీధుల్లో సమాజకాపరి జైల్లో ఉంటారు. నేరస్తులు నేరాలు కొనసాగిస్తారు. ప్రజావేగులు ప్రజా సేవకు భయపడతారు.

దశాబ్దాల దాడులకు మన రాజ్యాంగం నిలబడింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దాన్ని నరికేసింది. సంజీవ్‌ భట్‌ లాంటి పోలీసు అధికారులు, కణ్ణన్‌ గోపీనాథన్‌, శశికాంత్‌ సెంథిల్‌ వంటి ఐఎఎస్‌ అధికారులు ప్రజాస్వామ్యం, న్యాయం, రాజ్యాంగం కోసం పదవులు త్యజించి పోరాడారు. వేధింపులకు గురయ్యారు. సౌజన్య పక్షపాత రాజ్యంలో పదవులు వదిలి పోరాడటం అసాధారణం. ప్రజలు, ప్రజావేగులు, మానవవాదులను ప్రభుత్వం లెక్కచేయదు. బహుళజాతి సంస్థల పక్షపాతిగా అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహమై రాజ్యమేలుతోంది. మేధావివర్గ ఉద్యమకారుల రక్షణ ప్రజా ఉద్యమాల బాధ్యత. సీఏఏతో సంభవించే రాజ్యరహితం నాజీ జర్మనీ భయంకర దుశ్చర్యలను, యూదేతరుల నిశ్శబ్దాన్ని గుర్తుతెస్తోంది. మన భావితరాలు మీరు ఎందుకు నిశ్శబ్దం వహించారని ప్రశ్నించగలరు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates