మరో ముగ్గురికి కరోనా లక్షణాలు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఎయిర్‌పోర్టు నుంచి  గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులకు తరలింపు
సర్కారు ఒక్కటే ఎదుర్కోలేదు.. ప్రజలూ చొరవ తీసుకోవాలి: ఈటల

రాష్ట్రంలో మరో ముగ్గురికి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించాయి. విదేశాల నుంచి వచ్చిన వీరిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులకు తరలించారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు చోట్ల వైరాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫీవర్‌ ఆస్పత్రిలో మరో ముగ్గురు అనుమానితులు చేరారు. శంషాబాద్‌ నుంచి 4 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. కరోనాను ప్రభుత్వం ఒక్కటే ఎదుర్కొనడం సాధ్యం కాదని, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేదన్నారు. బుధవారం జెడ్డా నుంచి వచ్చిన ఇద్దరు, దుబాయ్‌ నుంచి వచ్చిన మరొకరికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో నేరుగా గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులకు తరలించారు. శంషాబాద్‌ నుంచి కువైత్‌ వెళ్లాల్సిన రెండు విమానాలు, మస్కట్‌కు వెళ్లాల్సిన మరో విమాన సర్వీసుతో పాటు కువైత్‌ నుంచి శంషాబాద్‌ రావాల్సిన విమాన సర్వీసును రద్దు చేశారు. ఇటీవల సౌదీ అరేబియా వెళ్లొచ్చిన ఏపీకి చెందిన ఓ మహిళ(55), కరీనంగర్‌కు చెందిన వ్యక్తి(31), యువకుడు(27)లు ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా అనుమానిత కేసులుగా నమోదయ్యారు. వీరిని ఐసోలేషన్‌ వార్డులో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. గాంధీ ఆస్పత్రిలో బుధవారం 9 మంది అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు. 16 మంది అనుమానితుల నమూనాలు సేకరించగా 8 శాంపిల్స్‌ నెగెటివ్‌గా వచ్చాయి. ఇటలీ నుంచి వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పట్టణానికి చెందిన యువతికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో గాంధీ, ఉస్మానియాలతో పాటు ఫీవర్‌, ఐపీఎం, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో మరో 3 వైరాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి చోట రోజూ 100 శాంపిల్స్‌ను పరీక్షిస్తారు. పాత 9 జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో 10 పడకల చొప్పున ఐసోలేషన్‌, ఐసీయూలను ఏర్పాటు చేస్తున్నారు.

అత్యవసర మందులకు 28.43 కోట్లు
మంత్రి ఈటల బుధవారం ఉన్నతాధికారులతో కరోనాపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్‌ చేయొచ్చని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ట్రాక్‌ చేయడం కష్టమని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన యువకుడికి మంగళ, బుధ వారాల్లో నిర్వహించిన పరీక్షల్లో నెగెటివల్‌ వచ్చిందని తెలిపారు. అయినా, మరికొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి డిశ్చార్జి చేస్తామన్నారు. అత్యవసర మందులు, పరికరాల కొనుగోళ్లకు రూ.28.43 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఏపీలోనూ తొలి కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు విద్యార్థికి పాజిటివ్‌ వచ్చింది. తుది నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను పుణెలోని ల్యాబ్‌కు పంపించారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates