చదివేదెలా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– 40శాతం పాఠశాలలకు విద్యుత్‌లేదు.. ఆటస్థలాల్లేవు..
– పార్లమెంటరీ ప్యానెల్‌ వెల్లడి
– నిధుల కేటాయింపూ అంతంతే
– బేటీనే కాదు.. బేటా చదువూ నిర్లక్ష్యం

న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ అధికారం చేపట్టాక బేటీ బచావో.. బేటీ పడావో నినాదంతో ఊదరగొట్టింది. బేటీ బచావో నిధులు ప్రచారానికే ఉపయోగించిందని తేలిపోయింది. అలాగే బేటీలను కాపాడటంలో విఫలమయ్యిందని పెరుగుతున్న నేరాలు రుజువుచేశాయి. కాగా, బేటీ.. బేటా (బాలికలకే కాదు బాలురు) చదువులను కూడా మోడీ సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తున్నదని స్పష్టమవుతున్నది. బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతలు పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనను నిర్లక్ష్యం చేస్తున్నది. 100శాతం విద్యుత్‌ను సాధించామని కేంద్రం ఓ పక్క గర్వంగా చెప్పుకుంటుంటే.. 40శాతం సర్కారు బడులకు కరెంటే లేదు. ఆటస్థలాలూ లేవు. పార్లమెంటరీ ప్యానెల్‌ నివేదికలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న డొల్లతనం.. గరీబోళ్లకు అక్షరబుద్ధులు నేర్పే సర్కారు బడుల దయ నీయస్థితులను చూసి పార్లమెంటరీ ప్యానెల్‌ విస్మయం చెందింది. విద్యపై బడ్జెట్‌ నిధుల కేటాయింపులు, వాటి వినియోగంలో లోపాలను గమనించింది. దేశవ్యాప్తంగా దాదాపు సగం ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్‌ సౌకర్యంలేదనీ, సరైన ఆట స్థలాల్లేవని తేలింది. వీటితో పాటు బడుల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు, మానవ వనరుల అభివృద్ధిపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 2020-21 విశ్లేషణ నివేదికను గత వారం రాజ్యసభకు సమర్పించింది. పాఠశాల విద్యా శాఖ చేసిన ప్రతిపాదనల నుంచి ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో 27శాతం కోత పడింది. రూ.82,570 కోట్ల రూపాయల ప్రతిపాదన చేయగా.. 59,845 కోట్లు మాత్రమే కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల్లోనూ నిర్లక్ష్యాన్ని గమనించింది. 56శాతం పాఠశాలలకు మాత్రమే విద్యుత్‌ సౌకర్యం ఉన్నది, మణిపూర్‌, మధ్యప్రదేశ్‌లలో పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నది. 20శాతం కంటే తక్కువ పాఠశాలలకు మాత్రమే విద్యుత్‌ సౌకర్యం ఉండగా, ఒడిషా, జమ్మూ కాశ్మీర్‌లలో 30శాతం కంటే తక్కువ పాఠశాలలకు మాత్రమే ఆట స్థలాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 57శాతం పాఠశాలలకు మాత్రమే ఆట స్థలాలున్నాయి. అలాగే 40శాతం పాఠశాలలకు ప్రహరీ గోడల్లేవు. ఇది విద్యార్థుల భద్రతకు ప్రమాదమేకాక, పాఠశాలల ఆస్తుల రక్షణకు కూడా విఘాతం కలిగిస్తుందని నివేదిక పేర్కొంది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) సహకారంతో సరి హద్దు గోడలను నిర్మించాలనీ, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖతో కలిసి పాఠశాలలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖకు ప్యానెల్‌ సిఫారసు చేసింది. అలాగే ప్రభుత్వ పాఠ శాలల్లో ఇతర మౌలిక సదుపాయాలైన తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాలలు కూడా సరిగాలేవని పేర్కొంది. వీటి కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపింది. ఉన్నత మాథ్య మిక పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని స్పష్టంచేసింది. 2019-20 సంవ త్సరానికిగాను మంజూరు చేసిన మొత్తం 2,613 ప్రాజెక్టులలో, కేవలం మూడు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో పూర్తయ్యాయని ప్యానెల్‌ పరిశీలన తేలింది. ఇలాంటి జాప్యాలు ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులను దూరం చేస్తాయని హెచ్చరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 1,021 అదనపు తరగతి గదులు మంజూరు చేసినప్పటికీ, ఈ కాలంలో ఒక్కటి కూడా కొత్తగా నిర్మించలేదని పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రయివేటు బడులను ప్రోత్సహించేలా మోడీ సర్కార్‌ బడ్జెట్‌ కేటాయింపులు ఉంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

డ్రాపౌట్స్‌
పాఠశాలలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో విద్యార్థుల డ్రాపౌట్స్‌ ఒకటి. డ్రాపౌట్ల వెనుక అనేక సామాజిక-ఆర్థిక కారణాలున్నాయి. నివేదిక ప్రకారం, ప్రాథమిక పాఠశాలలో (తరగతి 1-8) 4శాతం, ఉన్నత మాథ్యమిక పాఠశాలలో (తరగతి 11-12) 2శాతం, సెకండరీ స్థాయిలో (తరగతి 9-10) 17శాతంతో డ్రాపౌట్‌ రేటు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నదని తెలిపింది. ఆడపిల్లల్లో డ్రాపౌట్లకు.. ఇంటి పనుల్లో నిమగమై (30శాతం), విద్యపై ఆసక్తి లేక (15శాతం), వివాహం (13శాతం) ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates