ఈరోజు ముఖ్యాంశాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి అలహాబాద్‌ హైకోర్టుకు షాక్ ఇచ్చింది. సీఏఏ నిరసనకారుల ఫొటోలతో ఏర్పాటు చేసిన హోర్డింగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

యూపీ సర్కారుకు ఎదురుదెబ్బ
లక్నో : ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి అలహాబాద్‌ హైకోర్టుకు షాక్ ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలకు పాల్పడిన వారి ఫోటోలు, చిరునామాలతో కూడిన షేమ్‌ హోర్డింగ్‌లను తొలగించాలని యోగి ఆదిత్యానాథ్‌ సర్కారును హైకోర్టు ఆదేశించింది. మార్చి 16లోగా హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌కు ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని జిల్లా మేజిస్ర్టేట్‌, పోలీస్‌ కమిషనర్‌లను కోర్టు ఆదేశించింది. సీఏఏకు వ్యతిరేకంగా డిసెంబర్ లో జరిగిన నిరసనల్లో హింసకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న వారి ఫోటోలు, చిరునామాలతో గత వారం లక్నోలోని పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడంపై హైకోర్టు తనను తానుగా స్పందించింది. హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడాన్ని వ్యక్తిగత స్వేచ్ఛను హరించే చర్యగా న్యాయస్థానం పేర్కొంది.

టీడీపీకి మాజీ మంత్రి గుడ్ బై
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ సోమవారం టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు కార్యకర్తలకు, అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. అమరావతి రైతుల జేఏసీ పేరుతో తనపై లేనిపోని ఆరోపణలు చేశారని వాపోయారు. తనపై టీడీపీ నేతలు చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు కేటాయించారని వెల్లడించారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధిష్టానం వైఖరి తనను కలచివేసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తాను ప్రయత్నం చేయలేదన్నారు.

మారుతీరావు పిరికివాడు కాదు: అమృత
మిర్యాలగూడ : తన తండ్రి మారుతీరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తనకు తెలియదని అమృతాప్రణయ్ అన్నారు. తన భర్తను హత్య చేయించిన కేసులో  చట్టపరంగా మారుతీరావుకు శిక్షపడాలి అనుకున్నా కానీ ఆత్మహత్య చేసుకోవాలని తాను కోరుకోలేదని స్పష్టం చేశారు. సోమవారం మారుతీరావు అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. మారుతీరావు పిరికివాడు కాదని చెప్పారు. తన బాబాయ్ శ్రవణ్‌ రెచ్చగొట్టడం వల్లే మారుతీరావు తప్పు చేశాడని, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలున్నాయని వెల్లడించారు. బాబాయ్ శ్రవణ్ నుంచి తన తల్లికి ప్రాణహానీ ఉంటుందని అమృత ఆరోపించారు. తన తల్లి తన దగ్గరకు వస్తానంటే అభ్యంతరం చెప్పబోనని, అత్తమామలను వదిలి తాను వెళ్లబోనని అమృత స్పష్టం చేశారు.

దిశ నిందితుడి తండ్రి మృతి
నారాయణపేట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి కురమయ్య సోమవారం మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన హైదరాబాద్‌లో కొన్నిరోజులపాటు చికిత్స పొందారు. తర్వాత ఆయనను కుటుంబ సభ్యులు స్వగ్రామం నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకువెళ్లారు. మెల్లగా కోలుకుంటున్న ఆయన తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. దిశ అత్యాచార కేసులో ఏ4గా ఉన్న చెన్నకేశవులు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  చెన్నకేశవులు ఆయన భార్య రేణుక రెండు రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కురమయ్య మరణంతో చెన్నకేశవులు కుటుంబం మగ దిక్కులేకుండా అయిపోయింది.

కుప్పకూలిన స్టాక్ మార్కెట్
ముంబై : స్టాక్‌మార్కెట్‌ సోమవారం కుప్పకూలింది. యస్ బ్యాంక్ సంక్షోభం, కరోనా వైరస్ వ్యాప్తి భయాలతో దేశీయ  మార్కెట్ భారీగా పతనమైంది. అమ్మకాల వెల్లువతో కీలక సూచీ సెన్సెక్స్  2,450 పాయింట్లు, నిఫ్టీ 6.15శాతం పడిపోయాయి. కరోనా వైరస్‌ రోజు రోజుకు విస్తరిస్తుండటం, కొత్త కేసుల నమోదు పెరుగుతుండటంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఓఎన్‌జీసీ, రిలయన్స్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.  ముడి చమురు ధరలు  29 ఏళ్ల కనిష్టానికి దిగిరావడంతో బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియన్ ఆయిల్ వాటాలు 13 శాతం పెరగడం విశేషం.

మూడేళ్ల చిన్నారికి కరోనా
న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్  ప్రపంచాన్ని వణికిస్తోంది. అన్ని దేశాలకు కోవిడ్-19 మహమ్మారి క్రమంగా వ్యాపిస్తోంది. దాని బారిన పడి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా మెల్లగా విస్తరిస్తోంది. భారత్ లో తాజాగా మరో నాలుగు కరోనా కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తోంది. కేరళలో మూడేళ్ల ఓ చిన్నారి కరోనా వైరస్ బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటలీ నుంచి కొచ్చి విమానాశ్రయానికి వచ్చిన కుటుంబానికి వైద్య పరీక్షలు నిర్వహించగా చిన్నారికి కరోనా వైరస్ సోకినట్టు తెలిసింది. జమ్మూకశ్మీర్ లోనూ కరోనా కేసు నమోదైనట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటివరకు ఆరుగురు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు 43 కరోనా కేసులు వెలుగు చూశాయి.

RELATED ARTICLES

Latest Updates