కారు చీకట్లో కాంతిరేఖలు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఈ మధ్యకాలంలో రెండు హైకోర్టులు ఇచ్చిన తీర్పులు నిరసన తెలిపే ప్రాథమిక హక్కు ప్రతి పౌరుడికి ఉన్నదని దృవీకరించాయి. సీఏఏకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో నిరసనకు అనుమతి నిరాకరిస్తూ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును ముంబయి హైకోర్టుకు చెందిన ఓరంగాబాద్‌ బెంచ్‌ తప్పుపట్టి ప్రక్కకు పెట్టింది. బెంగుళూరు పోలీసులు సీఏఏ వ్యతిరేక నిరసనలను అడ్డుకోవడానికి 144 సెక్షన్‌ను ప్రయోగిస్తే కర్నాటక హైకోర్టు 144 సెక్షన్‌ విధించడం చట్టవిరుద్ధం అని ప్రకటించింది.
ఈ రెండు తీర్పులు చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవ్యవస్థకే తలమానికమైన సుప్రీం కోర్టే రాజ్యాంగంలో ఉన్న హక్కులను పరిరక్షించడంలో వెనుక పడుతున్న తరుణంలో హైకోర్టులు ఇచ్చిన ఈ తీర్పులు కారు చీకట్లో కాంతిరేఖలుగా ఉన్నాయి. ఓరంగాబాద్‌ బెంచ్‌ తరపున జస్టిస్‌ నలవాడే, సీవలేకర్‌ర్లు ఇచ్చిన తీర్పు పౌరులుతమ ప్రాథమిక హక్కుల ఆధారంగా శాంతియుతంగా చట్టపరిధిలో ఎలా నిరసన తెలుపవచ్చో తేటతెల్లం చేసిన ఈ తీర్పు ఒక పాఠంలా ఉన్నది. కోర్టు మొట్టమొదట ఒక విషయం స్పష్టం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వాళ్ళను వాళ్ళు ఒక చట్టాన్ని వ్యతిరేకించినంత మాత్రాన దేశద్రోహులని, జాతి వ్యతిరేకులని అనటానికి వీలులేదని కుండబద్దలు కొట్టింది.

రాజ్యాంగంలోని అంశాలను అర్థం చేసుకునే సందర్భంలో మనం రాజ్యాంగం, న్యాయవ్యవస్థ చరిత్ర పట్ల కూడా అవగాహన కలిగివుండాలని చెపుతూ, నిరసన తెలిపే స్వేచ్ఛకు ఉన్న చరిత్రక నేపథ్యాన్ని వివరించింది. భారతదేశానికి స్వాతంత్య్రం అహింసాయుత పద్ధతిలో జరిగిన ఆందోళనల ఫలితంగా వచ్చింది. అదే అహింసాయుత పద్ధతిని ఈనాటికీ మనదేశంలో ప్రజలు అనుసరిస్తున్నారు. దేశంలోని అత్యధిక మంది ఇప్పటికే అహింసాయుత పద్ధతినే అనుసరిస్తున్నందుకు మనం అదృష్టవంతులం. ప్రస్తుత నేపథ్యంలోకూడా పిటీషనర్స్‌ వారి సహచరులు శాంతియుతం గానే నిరనసన తెలియచేస్తామని కోరుకుంటున్నారు.

నిరంకుశాధికార వర్గం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పౌరులు స్వాతంత్ర పోరాటం ద్వారా తాము సాధించుకున్న ఏ ఒక్క హక్కుపై దాడి జరుగుతున్నదని భావించినా, రాజ్యాంగం ద్వారా తాము సముపార్జించుకున్న అంశాలకు భిన్నంగా జరుగుతున్నప్పుడు ప్రజలు తమ నిరసన తెలియచేసి, తమ హక్కులను కాపాడుకోవడం జరుగుతుంది. దానికి అవకాశం ఇవ్వకపోతే బలప్రయోగానికి పాల్పడే అవకాశం ఉన్నది. దానితో హింస, గందరగోళం, వ్యవస్థ చిన్నాభిన్నం అయి దేశ ఐక్యతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది.

బీడ్‌ నివాసి ఇఫతేకార్‌ షేక్‌ పెట్టిన పిటీషన్‌ను కోర్టు స్వీకరించింది. అందులో ఆయన అదనపు జిల్లా మెజిస్ట్రేట్‌ ఇచ్చిన అనుమతిని ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ నిరాకరించడాన్ని సవాలు చేశారు. ఈ తీర్పు అతి స్పష్టమైన వివరణ ద్వారా రాజ్యాంగంలో పౌరుల కోసం రాయబడ్డ ప్రాథమిక హక్కులను వివరించింది. అదే సందర్భంలో పార్లమెంటు చేసిన చట్టంపై పౌరులు నిరసన తెలిపే హక్కు ఉన్నదని కూడా తెలియచేసింది.

కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు విచక్షణారహితంగా 144 సెక్షన్‌ వినియోగించటం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై జరుగుతున్న శాంతియుత నిరసనలను జరగనీయకుండా 144 సెక్షన్‌ను దేశంలోని అనేక ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో నిరసలను అడ్డుకోవడానికి రాష్ట్రం మొత్తానికి 144 సెక్షన్‌ విధించారు.

డిసెంబర్‌ 18న బెంగుళూరులో 144 సెక్షన్‌ను విధించి నిషేధ ఆజ్ఞలను అమలు చేశారు. గతంలో డిసెంబర్‌ 19న నిరసన ప్రదర్శనలు జరుపుకోవడానికి ఇచ్చిన అన్ని అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. రామచంద్ర గుహ లాంటి ప్రఖ్యాత చరిత్రకారుడిని నిరసన తెలపడానికి వస్తే అరెస్టు చేసింది. కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ విధించిన 144 సెక్షన్‌ చట్టం విధించిన షరతులకు లోబడి లేదని కోర్టు ఎత్తిచూపింది. నిరసనలకు అనుమతిస్తే అవి అల్లరకు దారితీయవచ్చు అనే నిర్దిష్ట ఆధారాలను చూపకుండా ఒకే గాటన కట్టి చూపడాన్ని కోర్టు తప్పుపట్టింది. కోర్టులో బెంచ్‌కు నాయకత్వం వహిస్తున్న చీఫ్‌ జస్టిస్‌ రెండు విషయాలు లేవనెత్తారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం శాంతియుత నిరసన అనే శాంతికి భంగం కల్పిస్తుందని ఏ విధంగా నిర్ధారణకు వచ్చింది. రెండు, శాంతియుత నిరసనలకు ఇచ్చిన అనుమతులను రాత్రికి రాత్రి ఎలా రద్దు చేస్తారు.

ప్రభుత్వమే తన మాటలు నెగ్గించుకోవడానికి తప్పుడు ఆధారాలు చూపుతూ పౌరుల స్వేచ్ఛను హరించడానికి పూనుకుంటున్న కాలంలో ఈ రెండు తీర్పులు ఊపిరి సలపని వాతావరణంలో స్వచ్ఛమైన గాలి అందినట్టు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై, సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టినవారిపై కేసులు పెట్టని రోజంటూ లేదు. రాజద్రోహం సెక్షన్‌ 124 ఎ, ఐపీసీ, ఉపా, జాతీయ భద్రతాచట్టం లాంటివి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాల చేతిలో ఆయుధాలుగా మారినాయి. వాటిని ఉపయోగించి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై వెంటపడి కేసులు పెట్టిస్తున్నారు.
గత కొన్ని వారాల నుంచి వందలాది రాజద్రోహం కేసులు పెట్టె పరంపర కొనసాగుతోంది. అందులో ఆశ్చర్యం కలిగించే కేసు ఉంది. బీదర్‌ (కర్నాటక)లో ఒక స్కూలులో సీఏఏ వ్యతిరేకంగా నాటక ప్రదర్శన జరిపినందుకు ఒక ప్రధానో పాధ్యాయులు, తొమ్మిదేండ్ల పాప తల్లిపై పెట్టిన కేసు అది.

నిరసన తెలియచేసినందుకు అణచివేయడం అనేది రాజద్రోహం క్లాజులో చట్టవిరుద్ధం. సీపీఐ(ఎం) ఐపీసీలో 124ఎ సెక్షన్‌ను తొలగించాలని చాలా కాలం డిమాండ్‌ చేస్తున్నది. అది జరిగే లోపు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తన బెంచ్‌ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేలా చూడాలి. కేధరనాథ్‌ కేసులో నేరుగా హింసను ప్రోత్సహిస్తేనో లేక ప్రజల్లో శాంతికి ప్రమాదం ఉంటేనో ఈ క్లాజు వాడాలని కేదారనాథ్‌ కేసులో ఇచ్చిన తీర్పును కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలి.
– పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates