ద్వేషపూరిత ప్రసంగాలపై చర్యలేవి?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– వారు మాట్లాడిన వీడియోలను ఇప్పటికీ చూడలేదా?
– పోలీసుల తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
– కపిల్‌ మిశ్రా, అనురాగ్‌ ఠాకూర్‌, పర్వేశ్‌ వర్మ సహా ఇతర బీజేపీ నాయకులపై
– ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయాలని ఆదేశం

న్యూఢిల్లీ : ఢిల్లీ హింసాత్మక అల్లర్ల విషయంలో పోలీసుల తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్నికి ఆజ్యం పోసేలా.. సీఏఏ నిరసనకారులపై విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టిన బీజేపీ నాయకులు కపిల్‌ మిశ్ర, అనురాగ్‌ ఠాకూర్‌, పర్వేశ్‌ వర్మతో పాటు ఇతర నాయకులపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయంలో పోలీసులకు సలహా అందించాలంటూ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సూచించింది. కాగా, ‘బీజేపీ నాయకుల విద్వేష ప్రసంగాలపై ఇప్పటికీ కేసులు ఎందుకు నమోదు చేయలేదు?’ అని కోర్టు ప్రశ్నించగా.. తాము వారి ప్రసంగాల వీడియోలను ఇప్పటి వరకూ చూడలేదని ఢిల్లీ పోలీసు అధికారి స్పందించారు. ఆ సమాధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన న్యాయమూర్తులు.. కపిల్‌ మిశ్ర, అనురాగ్‌, పర్వేశ్‌లు చేసిన విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలను కోర్టు హాలులోనే ప్రదర్శించారు. ఇప్పటి వరకూ వారు చేసిన ప్రసంగాల వీడియోలను చూసి.. కేసు నమోదు చేయడంలో ఆలస్యంపై గురువారం మధాహ్నం మూడు గంటలలోగా నివేదికను అందజేయాలని కోర్టు ఆదేశించింది. జాఫ్రాబాద్‌లో సీఏఏ వ్యతిరేకులు రోడ్లను ఖాళీ చేయాలనీ, పోలీసులకు అల్టీమేటం ఇస్తూ బీజేపీ వివాదాస్పద నాయకుడు గత ఆదివారం చేసిన వ్యాఖ్యలతో ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చెలరేగిన విషయం తెలిసిందే.

‘మరో 1984 లాంటి ఘటనను కానివ్వం’
దేశరాజధానిలో హింసాత్మక ఘటనలపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఇక్కడ(ఢిల్లీ) మరో 1984 నాటి ఘటనకు(సిక్కుల ఊచకోత లాంటి ఘటన) తావు ఇవ్వబోమని వ్యాఖ్యానించింది. పోలీసులు అల్లర్లను కట్టడి చేయలేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఢిల్లీ అల్లర్లపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం విచారించింది. బాధితులు, వారి కుటుంబాల్లో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఉన్నతాధికారులు వారిని వ్యక్తిగతంగా కలవాలని న్యాయమూర్తులు ఎస్‌ మురళళీధర్‌, ఎ.జె భంభనీలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ”నగరంలో 1984లో జరిగిన ఘటనలను పునరావృతం కానివ్వం. ఈశాన్య ఢిల్లీలోని అల్లర్లలో ఐబీ అధికారి దాడికి గురై మరణించినట్టు మా దృష్టికి వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం.హింసాత్మక దాడుల్లో మరణించిన వారి అంత్యక్రియలు సజావుగా జరిగేట్టు సంబంధిత అధికారులు భద్రతను కల్పించాలి” అని కోర్టు ఆదేశించింది. బాధితులకు పునరావాసం కోసం తగినన్ని వసతి గృహాలను కల్పించాలనీ ఢిల్లీ ప్రభుత్వానికి తెలిపింది. బాధితులకు దుప్పట్లు, పరిశుద్ధమైన నీరు, శానిటేషన్‌ అందేలా చూడాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే బాధితుల అవసరాల కోసం హెల్ప్‌డెస్క్‌లను తక్షణమే ఏర్పాటు చేయాలని తెలిపింది. బాధితులు ఆస్పత్రులకు క్షేమంగా చేరేలా అంబులెన్సులను కల్పించాలని చెప్పింది. తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి(శుక్రవారం) వాయిదా వేసింది. గాయాలపాలైన బాధితులను సురక్షితంగా ఆస్పత్రులకు తరలించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు అర్ధరాత్రి(బుధవారం ఉదయం 12.30 గంటలకు) అత్యవసర విచారణను చేపట్టింది. దీనిపై న్యాయమూర్తులు ఆర్‌. మురళీధర్‌, అనూప్‌ జైరాం భంభనీలతో కూడిన ధర్మాసనం అర్ధరాత్రి విచారణ జరిపింది.

షాహీన్‌బాగ్‌ విచారణ వాయిదా
షాహీన్‌బాగ్‌ నిరసనలపై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు మార్చి 23కు వాయిదా వేసింది. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన పరిస్థితులను అదుపు చేయలేకపోయిన పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసుల్లో వృత్తి నైపుణ్యం కొరవడిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కె.ఎం జోసెఫ్‌ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో సున్నితమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో పరిస్థితులన్నీ సద్దుమణిగన తర్వాత పిటిషన్ల విచారణను జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

డ్రైనేజీలో ఐబీ అధికారి మృతదేహం

జాఫ్రాబాద్‌లోని ఓ మురుగు కాలువలో ఐబీ అధికారి మృతదేహం బుధవారం లభ్య మైంది. మృతుడిని అంకిత్‌ శర్మగా గుర్తించారు. ఐబీలోని సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అంకిత్‌.. మంగళవారం చాంద్‌బాగ్‌ బ్రిడ్జిపై సీఏఏ అల్లర్లలో ఓ మూక జరిపిన దాడిలో మరణించారనీ, అనంతరం ఆయన మృతదేహాన్ని నిందితులు మురుగు కాలువలో పడేసి ఉంటారని పోలీసు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి అంకిత్‌ కోసం ఆయన కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. కాగా, అంకిత్‌ మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం తరలించారు. కాగా, అధికారి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమనీ, నిందితులెవరైనా విడిచిపెట్టబోమని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, ఈశాన్య ఢిల్లీలో రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ కుటుంబానికి ఆయన కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా
అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదాపడ్డాయి. పరీక్ష తేదీలను అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. కాగా, మిగతా ప్రాంతాల్లో పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా జరుగుతాయని అధికారులు తెలిపారు.

విద్యార్థులపై పోలీసుల వీరంగం…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటిని చుట్టుముట్టిన విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపించారు. జేఎన్‌యూ, జామియా మిలియా కో-ఆర్డినేషన్‌ కమిటీ (జేసీసీ) విద్యార్థులు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్ళగా.. నీటి ఫిరంగులు ప్రయోగించారు. దొరికిన వారిని దొరికినట్టు అరెస్టుచేసి సమీప సివిల్‌ లైన్‌ పోలీస్టేషన్‌కు తరలించారు.

జైలులో సీఏఏకు వ్యతిరేకంగా..
అఖిల్‌ గొగోరు 24 గంటల దీక్ష
గువహతి : రైతు నాయకుడు, ఆర్టీఐ కార్యకర్త అఖిల్‌ గొగోరు.. సీఏఏకు వ్యతిరేకంగా 24 గంటల పాటు జైలులో ధర్నాకు దిగనున్నారు. వివాదాస్పద చట్టాన్ని నిరసిస్తూ మార్చి 1న ఆయన ఈ ధర్నాను చేపట్టనున్నారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో భాగంగా యూఏపీఏ కింద అఖిల్‌ గొగోరు అరెస్టైన విషయం తెలిసిందే. కాగా, గొగోరు జ్యుడీషీయల్‌ రిమాండ్‌ను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మార్చి 7 వరకూ పొడిగించింది. ప్రస్తుతం ఆయన గువహతి కేంద్ర కారాగారంలో ఉన్నారు.

నన్ను తీవ్రవాది అంటున్నారు : కపిల్‌ మిశ్రా
వివాదాస్పద బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రా బుధవారం మరోసారి రెచ్చగొట్టే ట్వీట్‌ చేశారు. ‘బుర్హాన్‌ వాణి, అఫ్జల్‌గురులను తీవ్రవా దులుగా పరిగణించనివారు కపిల్‌ మిశ్రాను తీవ్రవాది అంటున్నారు. యాకూబ్‌ మీనన్‌, ఉమర్‌ఖలీద్‌, షార్జీల్‌ ఇమామ్‌లను కలవడానికి కోర్టులకు వెళ్తూ, వారిని విడుదల చేయాలంటున్నవారే నన్ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జై శ్రీరాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు ఆయనే.. ‘జాఫ్రాబాద్‌ ఖాళీ అయిపోయింది. ఢిల్లీలో మరో షాహీన్‌బాగ్‌ను ఏర్పాటుకానివ్వం’ అని ట్వీట్‌ చేశారు.

టెన్షన్‌ వద్దు
ధోవల్‌ ఢిల్లీ భగ్గుమన్న మూడో రోజు మోడీ, అమిత్‌షా పంపారంటూ జాతీయ భద్రతాసలహాదారు అజిత్‌ ధోవల్‌ అన్నారు. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి సమీక్షించేందుకు మౌజ్‌పూర్‌, జఫ్రాబాద్‌ ప్రాంతాల్లో ధోవల్‌ బుధవారం పర్యటించారు. భయాందోళనల్లో ఉన్న బాధితులతో మాట్లాడుతూ టెన్షన్‌ వద్దు.. ఇకపై ప్రశాంతపరిస్థితులు నెల కొంటాయన్నారు. అమిత్‌షా వల్లే తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని స్థానిక మహిళలు వివరించారు. కర్ఫ్యూ ఉన్నా మాపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. జఫ్రాబాద్‌లో ఓ విద్యార్థి ధోవల్‌ను నిలదీశారు.

శాంతియుతంగా, సోదరభావంతో మెలగాలి…
– ఢిల్లీలో హింసపై 48 గంటల తర్వాత నోరువిప్పిన ప్రధాని
న్యూఢిల్లీ : ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరిగిన 48 గంటల తర్వాత ఎట్టకేలకు దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నోరువిప్పారు. ఢిల్లీ ప్రజలు శాంతి యుతంగా, సోదరభావంతో మెలగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. పరిస్థితిని సమీక్షించాననీ, భద్రతా ఏజెన్సీలు పనిచేస్తున్నాయని తెలిపారు. పోలీసులు గుడ్లప్పగించి చూస్తూ ఉండి పోయారన్న విమర్శలు, కోర్టు అక్షింతలు వేసిన సంగతి బహుశా పట్టించుకున్నట్టు లేరు ప్రధానమంత్రి. శాంతి సామ రస్యాలను నెలకొల్పేందుకు క్షేత్రస్థాయిలో పోలీసులు, భద్రతా బలగాలు పనిచేస్తున్నాయంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తమ పార్టీకే చెందిన పలువురు నాయకులు హిందూత్వ గ్రూపులను రెచ్చగొట్టాయన్న ఆరోపణలనూ ఆయన లైట్‌ తీసుకున్నట్టున్నారు. శాంతి, సామ రస్యం మనలో భాగం. ఢిల్లీ సోదర సోదరీ మణులు అందరూ శాంతితో మెలగాలని కోరు కుంటున్నానని ప్రధాని తెలిపారు.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates