ఢిల్లీ నగరం తగలబడుతుంటే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఢిల్లీ: ఓ పక్క రోమ్‌ నగరం కాలి బూడిదవుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకుంటూ కూచున్నాడని చరిత్ర చెబుతుంది. నీరో ఎలాంటి చక్రవర్తో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. దేశ రాజధాని ఢిల్లీ గత నాలుగు రోజులుగా రక్తపుటేరులు పారాయి. కానీ దేశ ప్రధాని మోడీ ట్రంప్‌ సేవలో తరించిపోయారు. ఢిల్లీలో హింసోన్మాదం కరాళనాట్యం చేస్తున్నా.. మోడీ లైట్‌గా తీసుకున్నారు. ఇప్పటికీ దేశ రాజధాని అగ్గిలా మండుతూనే ఉన్నది. హౌజ్‌పూర్‌ ప్రాంతం సహా దుకాణాలను దోచుకుని, నిప్పంటించి, వాహనాలను తగలబెట్టారు. సీసాలతో పెట్రోల్‌ తెచ్చి… ఇండ్లకు నిప్పుపెట్టారు. అమాయకుల ప్రాణాలను మరో వర్గం తోడేస్తున్నా… పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. కొన్నిచోట్ల ఖాకీలే ఉసిగొల్పటంతో… హస్తినలోని గల్లీలు రక్తంతో తడిశాయి.

యాసిడ్‌ బాటిల్స్‌, పెట్రోల్‌ బాంబులు, ఆయుధాలతో అల్లరిమూకలు ఇరుకైన ఆ వీధుల్లో దౌర్జన్యకాండకు దిగారు. దొరికిన వారి ప్రాణాలు తీశాయి. లూటీలకు పాల్పడ్డాయి.. దహనాలకు తెగబడ్డాయి. గామ్రీలో ఓ సూఫీ సాధువు మందిరాన్ని సోమవారం దహనం చేశారు. అశోక్‌నగర్‌లో ఒక ప్రార్థనా మందిరంపై దాడిచేసి తగులబెట్టారు. అక్కడ హనుమాన్‌ జెండాను ఎగురవేశారు. ఈశాన్య ప్రాంతంలోని దిగువ, మధ్యతరగతి, పేద కాలనీల్లో హింసాకాండ కొనసాగింది. 25 మందికిపైనే మృతిచెందారు. వందలాదిమంది క్షతగాత్రులయ్యారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. మరోవైపు ఆగని అల్లరిమూకలు ఓ వర్గానికి చెందిన మహిళలపై లైంగికదాడులకు తెగబడినట్టు కూడా వార్తలొస్తున్నాయి.
24 రాత్రి గోకుల్‌పురిలోని టైర్‌ మార్కెట్‌కు నిప్పంటించారు. సమీపంలోని జీటీబీ ఆస్పత్రిలో 200 మందికిపైగా తుపాకీ కాల్పులతో గాయాలై చికిత్స చేయించుకున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ బుల్లెట్ల వెనుక ఎవరున్నారన్నది బహిరంగ రహస్యమే.

అసలేం జరిగింది.. ఢిల్లీ హింస వెనుక ఎవరు..?
23, ఆదివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత నేతృత్వంలోని కొందరు తొలుత సీఏఏ వ్యతిరేక నిరసనకారులతో ఘర్షణను ప్రారంభించారు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులను రెచ్చగొట్టటంతో హింస ప్రారంభమైంది. బీజేపీ, దాని భాగస్వామ్యపక్షాల సాయుధ ముఠాలు, పోలీసుల వెరసి ఈ విస్ఫోటనానికి కారణం. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కపిల్‌ మిశ్రా ద్వేషపూరిత వ్యాఖ్యలతో హింస చెలరేగింది. ఇది నాణానికి ఒక కోణం. మరోవైపు 23న హింసాత్మక ఘటనలు జరగటానికి ముందే… రంగం సిద్ధమైంది.

మైనారిటీల ముట్టడి
గతేడాది జూన్‌లో పార్లమెంటులో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆరెస్సెస్‌ ఓ వర్గంపై వ్యతిరేక ఎజెండాతో బహిరంగంగా ముందుకొస్తున్నది. ఓ వర్గాన్ని అణచివేసేలా బీజేపీ అనేక చర్యలను చేపట్టింది. ఆర్టికల్‌ 370ని రద్దుచేయటం, ముస్లిం మెజార్టీ రాష్ట్రమైన జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఎన్నార్సీని సిద్ధం చేస్తున్నామనీ, ‘విదేశీయుల’ను దేశం నుంచి తరిమేస్తామని పదేపదే చెప్పటం. అయోధ్య వివాదాన్ని హిందు వులకు అనుకూలంగా పరిష్కరిం చుకున్నామనే వాదనను ముందుకు తేవటం, అలాగే వివక్షపూరితమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను పార్లమెంటులో ఆమోదింపచేస ుకోవటం వాటిల్లో ముఖ్యమైనవి. అంతేకాదు.. విద్వేషాన్ని నింపేలా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారాలు. విద్వేష వాప్తి గతంలోనూ జరిగింది. అయితే.. ఎన్నికల్లో గెలిచాక వారు బహిరంగంగా రెచ్చిపోతున్నారు.

ద్వేషాన్ని ప్రేరేపించటంలో …
బీజేపీ సీనియర్‌ నేతలు విద్వేషాన్ని ప్రేరేపించటంలో మునిగిపోయారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నుంచి మొదలు, హౌంమంత్రి అమిత్‌ షా, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, రాష్ట్రాల్లో పెద్ద నాయకుల నుంచి కింది స్థాయి నాయకుల వరకూ ‘విదేశీయులు’, ‘చొరబాటుదారులు’ పేరుతో రెచ్చగొడుతూనే ఉన్నారు.

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో..
ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సోషల్‌ మీడియా వేదికగా అబద్ధాలు.. అర్ధసత్యాలు, విషం వెదజల్లింది. దేశద్రోహులను కాల్చిపారేయాలంటూ బీజేపీ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించకపోతే… ”వారు” (ముస్లింలు) ఇండ్లలోకి ప్రవేశించి మీ కుమార్తెలపై లైంగికదాడులు చేస్తారనీ, చంపేస్తారని ప్రసంగించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే.. మళ్లీ మొఘల్‌ చక్రవర్తుల పాలన వస్తుందని హెచ్చరికలు చేశారు. బీజేపీ ఢిల్లీ నేత కపిల్‌ మిశ్రా… పోలీసులకే హెచ్చరికలు చేశారు.
ముసుగులు వేసుకొని జేఎన్‌యూలోని ప్రవేశించిన సంఫ్‌ు శక్తులు గూండాల్లో ఇనపరాడ్లను చేతపట్టుకొని విద్యార్థులు, ఉపాధ్యాయుల తలలు పగులగొట్టినా ప్రధానమంత్రి నోరుమెదపలేదు ‘మేమే చేశాం.. గళం విప్పితే.. ఎవరికైనా ఇదే జరుగుతుంది’ అంటూ హెచ్చరికలు చేసినా ఇంతవరకూ ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదు. లైబ్రరీల్లోకి చొరబడి పోలీసులు విచక్షణా రహితంగా విద్యార్థులపై తెగబడినా ఎలాంటి చర్యలూ ఉండవు. విద్యార్థులపై హిందూత్వశక్తులు తుపాకీ ఎక్కువపెట్టినా ప్రధాని మాట్లాడలేదు. ఇవన్నీ దేనికి సంకేతం? ఢిల్లీ ఓటమికి తమ పార్టీ నేతల విద్వేష వ్యాఖ్యలే కారణమని ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత చేతులు కాలాక… వ్యాఖ్యానించారు. విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారిని కట్టడి చేసే చర్యలు మాత్రం బూతద్దంపెట్టి వెతికినా కనిపించవు. వీటన్నిటి ఫలితమే.. ఢిల్లీలో పారుతున్న రక్తపాతం. లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణఖు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని ఢిల్లీ హింసాత్మక ఘటనలు మరోసారి బలంగా ఎత్తిచూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates