కార్మికమంత్రీ..సంక్షేమమేదీ?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– భవన నిర్మాణ సెస్సు వసూళ్లల్లో తీవ్రజాప్యం
– హైదరాబాద్‌లో మూడేండ్లలో 40 వేల నిర్మాణాలు
– సెస్సు విధించింది 83 మందికే
– కార్మికులకు వర్తించని సంక్షేమ పథకాలు
– నేడు కార్మిక శాఖ సంక్షేమభవన్‌ ముట్టడి

‘మా శాఖ ధనిక శాఖ మా దగ్గర మస్తు పైసలున్నరు’ అని కార్మిక మంత్రి మల్లారెడ్డే గొప్పగ చెప్పారు. మరి గసోంటి శాఖలో ఆరేండ్ల నుంచి భవన నిర్మాణ సెస్సు కూడా వసూలు చేయడంలేదు. కార్మిక సంక్షేమ గురించే పట్టించుకోవడం లేదు. కార్మికులుగా నమోదు చేయించుకునేలా ప్రోత్సహించడంలోనూ తాత్సారం ప్రదర్శిస్తున్నది. రాష్ట్ర సర్కారు, కార్మిక శాఖ తీరు వల్ల కార్మికుల సంక్షేమం అటకెక్కింది. భవన నిర్మాణ సెస్సు ద్వారా తమకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలంగాణ బిల్డింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కార్మిక సంక్షేమ భవన్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులు మంగళవారం ధర్నా చేపట్టనున్నారు.

కార్మిక శాఖ భవన, ఇతర నిర్మాణాలు చేపట్టే సమయంలో రూ.10 లక్షలకు పైగా విలువైన నిర్మాణాలపై నూటికి రూపాయి చొప్పున సెస్సు వసూలు చేయాలి. కానీ, రాష్ట్రంలో ఆరేండ్ల నుంచి కార్మిక శాఖ సరిగ్గా సెస్సు వసూలు చేయడం లేదు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే మూడేండ్లలో అధికారుల అనుమతితో చేపట్టిన నిర్మాణాలే 40 వేలకుపైగా ఉన్నాయి. అనధికారికంగా అంతకు మించే ఉండే అవకాశం ఉన్నది. కానీ, ఇప్పటిదాకా కేవలం 83 మంది వద్దనే భవన నిర్మాణ సెస్సు వసూలు చేసింది. వరంగల్‌, కరీంనగర్‌, ఇతర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. దీని వల్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం దక్కాల్సిన రూ.2 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. మిషన్‌ భగీరథ పథకం నుంచి రావాల్సిన రూ.366 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మెట్రోరైల్‌ వాళ్లు సెస్సు కట్టబోమని కోర్టులో కేసులో వేస్తే కార్మిక శాఖ మాత్రం గమ్ముగా ఉంది. దీంతో మెట్రో నుంచి దక్కాల్సిన రూ. 360 కోట్లు ఆగిపోయాయి. మరోవైపు ఇప్పటిదాకా ఉన్న రూ.2150 కోట్ల సంక్షేమ ఫండ్‌లో కార్మికుల వెచ్చించింది కేవలం రూ.375 కోట్లు మాత్రమే. అందులోనూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరిట రూ.32 కోట్ల దాకా ఖర్చుపెట్టారు. మరో 83 లక్షల రూపాయలను అడ్డా ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు వెచ్చించామని చూపెట్టారు. అడ్డా ప్రాంతాల్లో ఎక్కడ తాగునీటి సౌకర్యాలు కల్పించారో అధికారులే ఎరుగాలి. ఆ ఖర్చులో ఎక్కువ దుర్వినియోగం అయినట్టు ఆరోపణలున్నాయి. స్వతహాగా పనికెళ్లి నేర్చుకోవడం తప్ప ప్రత్యేక శిక్షణ పొంది భవన నిర్మాణ రంగంలోకి కూలీలుగా పనిచేయడానికి వచ్చేవారు అరుదు. సెస్సు నిధుల్లో నుంచి 95 శాతం కార్మికుల సంక్షేమం కోసం, ఐదు శాతం ఆఫీసుల నిర్వహణ కోసం వాడుకోవచ్చనే నిబంధన ఉంది. కానీ, అందులో 30 నుంచి 50 శాతం దాకా ఆఫీసుల అవసరాల కోసం వాడుతున్నారనే విమర్శా కార్మికుల సంఘాల నుంచి వస్తున్నది.

భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపేది?
రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలకుపైగా భవన నిర్మాణ కార్మికులున్నారు. అందులో వలస కార్మికులే ఎక్కువ. ఇప్పటిదాకా కార్మిక శాఖ వద్ద రిజిష్ట్రర్‌ చేయించుకున్న కార్మికులు 12, 99, 316 మంది మాత్రమే. అందులోనూ ఆరు లక్షల మంది కార్మికుల సభ్యత్వాలు రెన్యూవల్‌ కాలేదు. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం దృష్టిలో ఏడు లక్షల మంది కార్మికులే ఉన్నట్టు. భవన నిర్మాణ కార్మికుల దగ్గరకు వెళ్లి సభ్యత్వం నమోదు చేయించుకోవడం ద్వారా దక్కే ప్రయోజనాలను కార్మిక శాఖ వివరించాలి. కానీ, రాష్ట్రంలో ఆ పరిస్థితే లేదు. అదీ ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉండటంతో చాలా మంది భవన నిర్మాణ కార్మికులు తమ సభ్యత్వాలను నమోదు చేయించుకోలేకపోతున్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్క భవన నిర్మాణ కార్మికుడు కూడా లేడు. అసిఫాబాద్‌ కొమురం భీం జిల్లాలో కేవలం 5,991 మంది భవన నిర్మాణ కార్మికులే ఉన్నారు. మెదక్‌లో 13వేలు, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాలో 11వేలు చొప్పున కార్మికులున్నారు. కార్మికులు సభ్యత్వం చేయించుకునేలా చేయడంలో కార్మికశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది.

సంక్షేమమేదీ?
60 ఏండ్లకుపైబడిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్‌ ఇవ్వాలనే నిబంధన ఉంది. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెన్షన్‌ విధానం అమలవుతున్నది. మన దగ్గర పైసలున్నా రాష్ట్ర సర్కారు దయతలచడం లేదు. కేరళలో ‘నాఇల్లు’ అనే పేరుతో భవన నిర్మాణ కార్మికులకు అక్కడి వామపక్ష ప్రభుత్వం ఇండ్లను కట్టించి ఇస్తున్నది. హర్యానా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6లక్షలను ఇండ్లను కట్టుకునేందుకు ఇస్తున్నది. మన రాష్ట్రంలోనేమో రెక్కలను ముక్కలు చేసుకుని అందాల అద్దాల మేడలను కట్టే భవన నిర్మాణ కార్మికులు గుడిసెల్లో మగ్గుతున్నారు. పంజాబ్‌ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారి పిల్లలు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ చదువులు చదివితే రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకు స్కాలర్‌షిప్పు ఇస్తున్నది. మన దగ్గరేమో భవన నిర్మాణ కార్మికుల పిల్లలు వారి వెంటనే తట్టలు మోస్తున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అడ్డా ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని కార్మిక శాఖ లెక్కల్లో చూపెడుతున్నా ఏ అడ్డా ప్రాంతాలోనూ షెడ్డు కనిపించదు. మహిళా కూలీలకు కనీస సౌకర్యాలుండవు. కనీసం, తాగేందుకు నీరు కూడా లభించదు. పనిప్రదేశాల్లో చనిపోతే ఇక అంతే. పలు ప్రమాదాల్లో చనిపోయి, గాయపడి సహాయం కోసం అర్జిపెట్టుకున్నవారికి కార్మిక శాఖ చేస్తున్న మేలు అంతంతే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష పైళ్లు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఒక్క మేడ్చల్‌ జిల్లాలోనే 15 వేల పెండింగ్‌ కేసులు మూలుగుతున్నాయి. దీంతో చనిపోయిన, గాయపడ్డ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చేయూత అందట్లేదు.

Courteys Nava Telangana

RELATED ARTICLES

Latest Updates