రామ మందిర ట్రస్టులో బాబ్రీ నిందితులకే అందలం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

చైర్మెన్‌, ప్రధాన కార్యదర్శి వంటి కీలక పదవుల్లో వీహెచ్‌పీ నేతలు
సీబీఐ చార్జిషీటులో పేర్లున్న వైనం

న్యూఢిల్లీ : దేశంలో దశాబ్ధాలుగా నెలకొన్న అయోధ్య వివాదాస్పద స్థలంపై పరిష్కారం పేరుతో గతేడాది నవంబర్‌ నెలలో సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుమతి ఇస్తూ, అందుకు ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ముస్లింలకు సంబంధించి మసీదు నిర్మాణానికి వేరే చోట భూమి ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో 1992 డిసెంబర్‌ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పుపై పలువురు విశ్లేషకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతను చట్టవిరుద్ధమంటూనే పేర్కొంటూ ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్న చట్టవిరుద్ధ వ్యక్తులకే బహుమతినిచ్చేలా సర్వోన్నత న్యాయస్థానం తీర్పువుందని పేర్కొన్నారు. ఇదే విషయం రామమందిర నిర్మాణానికి సంబంధించి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ తాజాగా ఏర్పాటు చేసిన ‘రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు’లో నిజమైందని వారు పేర్కొంటున్నారు.

కీలక పదవుల్లో నిందితులు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల లోక్‌సభలో ప్రకటించారు. ఈ ట్రస్టు అయోధ్యలో జరిగే మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది. ఇందుకుగానూ కేంద్రం మసీదు కూల్చివేతలో ప్రధాన పాత్ర పోషించిన విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) నేతలకు చోటుకల్పించింది. వీహెచ్‌పీ నేతలైన నృత్య గోపాల్‌ దాస్‌, చంపత్‌ రారులను కీలకమైన ట్రస్టు చైర్మెన్‌, ప్రధాన కార్యదర్శులుగా నియమించింది. వీరిద్దరూ కూడా బాబ్రీ విధ్వంసంలో నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ 1993లో దాఖలు చేసిన చార్జిషీటులో కూడా వీరి పేర్లు ఉన్నాయి. ఈ సమయంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారికే అక్కడ మందిరాన్ని నిర్మించే బాధ్యతలను అప్పగించారన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది.

మొదట ప్రకటించకుండా..
కొన్ని వారాల క్రితం మోడీ సర్కార్‌ ఈ ట్రస్టును ఏర్పాటు చేసింది. అయితే ఈ ఇద్దరి నేతలను మొదటిగా ట్రస్టు సభ్యుల జాబితాలో చేర్చలేదు. మిగతా సభ్యులను నియమించి కీలకమైన చైర్మెన్‌, ప్రధాన కార్యదర్శి పదవులను ఖాళీగా ఉంచారు. దీంతో కేంద్రం తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బాబ్రీ ఘటనకు సంబంధం ఉన్నవారు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీహెచ్‌పీకి చెందిన రామజన్మభూమి న్యాస్‌కు చెందిన సీనియర్‌ సభ్యుడు ఒక మాడియా సంస్థతో మాట్లాడుతూ ‘ ట్రస్టు సభ్యులకు సంబంధించి ఈనెల 5న తొలి జాబితాను ప్రకటించారు. ఆ లిస్టులో గోపాల్‌ దాస్‌, చంపత్‌ రారుల పేర్లు చేర్చలేదని మాకు తెలిసింది. దీన్ని తాము కేంద్రం దృష్టికి తీసుకువెళ్తే.. వారి పేర్లు చివరి స్టేజీలో చేర్చబడతాయని మాకు హోం మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది’ అని పేర్కొన్నారు.

బాబ్రీ కేసులో ప్రమేయం ఉన్న దాస్‌, రారులను డైరెక్టుగా నియమిస్తే న్యాయ పరమైన సమస్యలు వస్తాయన్న ఆలోచనలతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని హోంశాఖ తనకు చెప్పిందని తెలిపారు. ఇలా నిందితులను ట్రస్టులో నియమిస్తే విమర్శలు వస్తాయని తెలిసినా కూడా సొంత ప్రయోజనాల కోసం ముందుకు పోవడం బీజేపీ సర్కార్‌కే చెల్లిందనే విమర్శలు వస్తున్నాయి.

ఆనాటి సభలో ప్రసంగికులుగా
బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందు ఆ ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఒక సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరసేవకులను ఉద్దేశించి మాట్లాడిన వారిలో దాస్‌, రారులు కూడా ఉన్నారు. ఈ కేసులో 1993, అక్టోబర్‌ 5న సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. దాస్‌, రారులతో పాటు 48 మందిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. 1997, సెప్టెంబర్‌లో సీబీఐ సాక్ష్యాధారాలను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. 2001, మే 4న 21 మందిపై విచారణను న్యాయస్థానం ఉపసంహరించుకుంది. వీరిలో దాస్‌, రారులు కూడా ఉన్నారు. బాబ్రీ కూల్చివేత నిందితులను కోర్టు ఈ సందర్భంగా రెండుగా విభజించింది.

డైరెక్టుగా కూల్చివేతలో పాల్గొన్న కరసేవకులుగా, ఘటనకు ప్రేరేపించిన వ్యక్తుల గ్రూపుగా నిర్ణయించింది. దీన్ని యూపీ హైకోర్టు సమర్పించిన అనంతరం ఈ అంశం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీతో సహా ఇతర ప్రముఖ నేతలపై ఐపీసీ సెక్షన్‌ 120-బీ(నేరపూరిత కుట్ర) కింద అదనపు అభియోగాలు మోపాలని 2017, ఏప్రిల్‌ 19న సెషన్స్‌ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ జాబితాలో నృత్య గోపాల్‌ దాస్‌, చంపత్‌ రారులు కూడా ఉన్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates