ఎన్పీఆర్‌కు వేళాయే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభం
దేశవ్యాప్తంగా మొదలైన కసరత్తు
రాష్ట్రంలో హౌజింగ్‌ సెన్సె్‌సతో షురూ
కలెక్టర్లకు సెన్సెస్‌ డైరెక్టర్‌ ఆదేశాలు
కేంద్రాల్లో 2 రోజుల శిక్షణకు నిర్దేశం
ఎన్యూమరేటర్ల నియామకంపై
వరంగల్‌ కలెక్టర్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌ : జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్‌)ను తాజాపరచడానికి రంగం సిద్ధమైంది. ఏప్రిల్‌ ఒకటో తేదీన దేశ రాజధానిలో ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన పేరును నమోదు చేయించుకుని దీనిని ప్రారంభించనున్నారు. అదే రోజు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్పీఆర్‌లో తమ పేర్లను నమోదు చేయించుకోనున్నారు. ఈ మేరకు ఎన్పీఆర్‌ను తాజాపరచడానికి దేశవ్యాప్తంగా కసరత్తు సాగుతోంది. హౌజింగ్‌ సెన్సె్‌సతోపాటే ఎన్పీఆర్‌ను తాజాపరిచే దిశగా తెలంగాణలోనూ అడుగులు పడుతున్నాయి.

జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి సెన్సె్‌సలో భాగస్వాములయ్యే అధికారులకు తెలంగాణ సెన్సెస్‌ డైరెక్టర్‌ (కేంద్ర ప్రభుత్వం) కె.ఇలంబరితి ఈనెల 13న లేఖ రాశారు. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు నెలాఖరులోగా హౌజింగ్‌ సెన్సెస్‌, ఎన్పీఆర్‌ అప్‌డేషన్‌ రాష్ట్రంలో జరగనుందని అందులో ప్రస్తావించారు. గత ఏడాది నవంబరు 9న తెలంగాణ ప్రభుత్వం జీవో 235 జారీ చేసిందని, జనాభా లెక్కల అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిందని, ప్రిన్సిపల్‌ సెన్సస్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో జనాభా లెక్కలు, ఎన్పీఆర్‌ సేకరణ వారి ప్రాథమిక బాధ్యత అని అందులో ఆయన పేర్కొన్నారు.

ఇందుకు జిల్లా, చార్జి ఆఫీసర్లకు పద్ధతి ప్రకారం శిక్షణ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో అన్ని జిల్లా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని వివరించారు. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారులు వ్యక్తిగతంగా చొరవ తీసుకుని, సెన్సస్‌ అధికారులంతా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని కోరారు కాగా, అదే రోజు తెలంగాణ విద్యా శాఖ ‘అర్జంట్‌’ పేరిట మెమో 990 జారీ చేసింది.

జనాభా లెక్కల సేకరణ, హౌజింగ్‌ సర్వే, ఎన్పీఆర్‌ అప్‌డేషన్‌ నేపథ్యంలో 2021 జనవరి 1 నుంచి మార్చి 15 వరకూ శిక్షణ, క్షేత్రస్థాయి కార్యక్రమాలు జరగనున్నాయని, ఆ మధ్యలో ఎటువంటి పరీక్షలూ నిర్వహించవద్దని కోరింది. కాగా, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకానికి సంబంధించి ఫిబ్రవరి 8నే వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌, ప్రిన్సిపల్‌ సెన్సస్‌ ఆఫీసర్‌ ఎం.హరిత ఉత్తర్వులు జారీ చేశారు. జనాభా లెక్కల సేకరణ 2దశల్లో జరగనుందని, ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో హౌజింగ్‌ సెన్స్‌సతోపాటు ఎన్పీఆర్‌ అప్‌డేషన్‌ జరుగుతుందని; వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ ఉంటుందని తెలిపారు. ఇందుకు భారత జనాభా లెక్కలవిభాగం నిర్ణీత ప్రొఫార్మాలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల వివరాలను సేకరిస్తోందని, వాటిని సేకరించి తనకు నివేదించాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ కోరారు.

అయితే, తెలంగాణ సెన్సస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ ఇలంబరితి లేఖలో ఎన్పీఆర్‌ ప్రస్తావన ఉన్నా.. ఈనెల 12న సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ జారీ చేసిన ఆదేశాల్లో కేవలం హౌజింగ్‌ సెన్సెస్‌ గురించి మాత్రమే ప్రస్తావించారు. నిజానికి, ఎన్పీఆర్‌ అప్‌డేషన్‌కు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 21న రీ నోటిఫై చేసింది.అయితే, సీఏఏ అంశం అప్పటికి తెరపైకి రాలేదు. తాజా పరిణామాల్లో సీఏఏను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్పీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది చర్చనీయాంశమైంది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates