ఆమెకు శాల్యూట్‌!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఆర్మీలోనూ మహిళ కమాండ్‌ చేయగలదు
  • 3 నెలల్లోగా శాశ్వత కమిషన్‌ హోదా
  • లింగ వివక్షకు సుప్రీంకోర్టు చెక్‌
  • మహిళలు అన్నిటా రాణిస్తున్న కాలమిది..
  • మైండ్‌సెట్‌ మార్చుకోండని కోర్టు హితవు

న్యూఢిల్లీ : సైన్యంలో లింగవివక్షకు సుప్రీంకోర్టు తెరదించింది. ఇకపై ఆర్మీలో పురుషులతో సమానంగా మహిళలకు కూడా కమాండ్‌ పోస్టులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. స్పల్పకాలిక సర్వీసులో (ఎస్‌ఎ్‌ససీ) ఉన్న మహిళాధికారుల నియామకాలను పర్మనెంట్‌ కమిషన్‌ కింద (అంటే రిటైరయ్యే దాకా కొనసాగే వీలున్న అధికారిక పోస్టుల్లో) తీసుకోవాలని  సుప్రీంకోర్టు సోమవారంనాడు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. సర్వీసులో ఎన్నాళ్లున్నారన్న విషయంతో సంబంధం లేకుండా మహిళాధికారులందరికీ శాశ్వత కమిషన్‌ హోదా వర్తిస్తుందని పేర్కొంది. 3 నెలల్లోగా తమ తీర్పును- ఆర్మీలోని పది విభాగాల్లోనూ అమలు చేయాలని తేల్చిచెప్పింది. అయితే పోరాట దళాల్లో  మాత్రం గతంలో హైకోర్టు తీర్పు మేరకు సైన్యం విధివిధానాలను రూపొందించుకోవాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగితో కూడిన ధర్మాసనం సూచించింది. ఇంతవరకూ స్వల్పకాలిక సర్వీసు- అంటే పది లేక 14 సంవత్సరాల కాలానికి  మాత్రమే  మహిళలను తీసుకునేవారు. పదేళ్ల కాలం ముగియగానే సదరు మహిళా ఉద్యోగి పర్మనెంట్‌ కమిషన్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ అతి తక్కువ సంఖ్యలో, ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే ఆ అవకాశం దక్కేది. పూర్తికాలం సర్వీసుకు అనుమతించాలని 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ నాటి నుంచి ఏ స్టే లేకున్నా ఇన్నాళ్లూ దీన్ని అమలు చేయకపోవడం తప్పు అని కేంద్రాన్ని మందలించింది. కోర్టు తీర్పులంటే కనీస గౌరవం కూడా లేదా… అని మండిపడింది. సరళంగా చెప్పాలంటే… ఇక నుంచీ మహిళాధికారులు కల్నల్‌ ర్యాంకు, ఆ పైన కూడా వెళ్లవచ్చు. తమ ప్రతిభా పాటవాలను బట్టి పురుషులతో సమానంగా పోటీ పడి పదోన్నతి పొందొచ్చు. సాధారణంగా కల్నల్‌ ర్యాంకు అధికారి ఓ బెటాలియన్‌ను కమాండ్‌ చేస్తారు. ఒక కల్నల్‌ కింద 850 మంది జవాన్లుంటారు. ఈ కల్నల్‌ ర్యాంకులోనూ సఫలమైతే అంతకంటే పైస్థానాలకు సదరు మహిళాధికారి వెళ్లగలగవచ్చు. అయితే ప్రస్తుతానికి పదాతిదళం, శతఘ్ని దళం, సాయుధ బలగాల దళం  మొదలైన పోరాట దళాల్లోకి మహిళలను తీసుకోరు.

కేంద్రం చేసిన వాదన ఇదీ…!
2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ … కమాండింగ్‌ పదవుల్లోకి ఎందుకు మహిళలను తీసుకోరనేది సవివరంగా విన్నవించింది. ఇవి……  1) ఆయుధం చేతపట్టడం అనేది కేవలం ఒక విధి మాత్రమే కాదు.. జీవితంలో అంతర్భాగం కావాలి. ఇందుకు త్యాగనిరతి, అంకితభావం అవసరం. 2) మహిళలకు గర్భధారణ, రుతుక్రమం, తల్లి కావడం, పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యత… ఇలా ఎన్నో అడ్డంకులుంటాయి. ఇలాంటి వారు సైనికులుగా పనిచేయడం ఇబ్బంది. 3) శారీరక పరిమితుల వల్ల గర్భధారణ, తల్లికావడం.. వంటివాటిలో ఊహించని సవాళ్లకు దారితీయవచ్చు 4) ఓ సైనికుడికి దేహదారుఢ్యం ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. పురుషులకు ఇది సాధ్యం. మహిళలకు చాలా ఇబ్బంది. 5) సాధారణం గా జవాన్లు గ్రామీణ నేపథ్యం ఉన్నవారు. శారీరక దారుఢ్యం దృష్ట్యా అక్కడి వారు ఎక్కువ ఎంపికవుతారు. వారు ఓ మహిళ కింద పనిచేయడానికి, ఆమె కమాండ్‌లను అంగీకరించడానికి సులువుగా అంగీకరించరు.

మైండ్‌సెట్‌ మారాలి
కేంద్రం చేసిన వాదనలను స్టీరియోటైపు వాదనలని బెంచ్‌ కొట్టిపడేసింది.  ‘మొదట మారాల్సినది మీ మైండ్‌సెట్‌’ అని స్పష్టం చేసింది.  కమాండింగ్‌ పదవుల్లో మహిళలకు స్థానం నిరాకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణానికి- అంటే సమానత్వపు హక్కుకు విరుద్ధమని దర్మాసనం అభిప్రాయపడింది. ‘శారీరక ఇబ్బందులను సాకుగా చూపి మహిళలకు పురుషులతో సమానమైన స్థాయి నిరాకరించడం మౌలికంగా చెల్లదు. ఈ దేశంలో మహిళలు ఆర్మీతో సహా ఎన్నో పదవులకు వన్నె తెచ్చారు. వారిని మినహాయించడమంటే వారి గౌరవాన్ని, దేశ గౌరవాన్ని కించపరచడమే!’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ దుయ్యబట్టారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates