రియల్‌ ‘సహకారం’

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రంగారెడ్డి జిల్లాలో 68 సొసైటీల్లో సగంమంది రియల్టర్లే!
చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ పోస్టులకు తీవ్ర పోటీ
ఓటుకు రూ.10 వేలు, మద్యం పంపిణీకి సిద్ధం
150 బీరువా’లకు ఆర్డరిచ్చిన ఆ గుర్తు అభ్యర్థి
చైర్మన్‌ పదవికి 50 లక్షల నుంచి కోటి వ్యయం
విహార యాత్రలకు ఓటర్లు, డైరెక్టర్లు
పార్టీ రహిత ఎన్నికలైనా.. పార్టీల మధ్య పొత్తులు

హైదరాబాద్‌: ఏదో ఒక పదవి చేతిలో ఉండాలి. అది వార్డు సభ్యుడైనా, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పోస్టయినా సరే..! ఒకటి తగిలితే.. ఆ డాబూ దర్పమే వేరు..’ ఇదీ రాష్ట్రంలో ప్రస్తుతం రియల్టర్ల ఆలోచనా ధోరణి. దీంతో వారి చూపు సహకార ఎన్నికలపై పడింది. పూర్తిగా వ్యవసాయ సంబంధితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికల బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొన్నిచోట్ల రూ.లక్షలకు లక్షలు, అవసరమైతే రూ.కోటి వరకు కుమ్మరిస్తున్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. రంగారెడ్డి ఉమ్మడి  జిల్లాలో 68 సొసైటీలుంటే.. పోటీదారుల్లో దాదాపు 50 శాతం మంది రియల్టర్లే.

భూముల ధరలు భారీగా ఉండే ప్రాంతాలు కావడంతో ఇక్కడ రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. యాదగిరిగుట్ట సొసైటీలో ‘రియల్టర్‌ అభ్యర్థులు’ ఓటుకు రూ.7వేల వరకు పంచేశారు. భువనగిరి, చౌటుప్పల్‌ వంటి చోట్ల రూ.10వేలు ఇవ్వడానికీ సిద్ధమయ్యారు. విహార యాత్రలకు తీసుకెళ్తూ ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. రియల్టర్ల ధోరణి ఇలా ఉంటే.. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లోనూ పార్టీలు సత్తా చాటే యత్నాలు చేస్తున్నాయి. అవసరాన్ని బట్టి ప్రత్యర్థి పార్టీలతో జట్టు కడుతున్నాయి.

డబ్బు కుమ్మరింత
డైరెక్టర్‌ ఎన్నికలకు రెండు రోజులే మిగిలి ఉండటంతో ఓటర్లకు రియల్టర్లు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచుతున్నారు. భువనగిరి, చౌటుప్పల్‌ వంటి చోట్ల డైరెక్టర్‌ స్థానాల బరిలో ఉన్న రియల్టర్లు ఓటుకు రూ.10 వేల వరకు చెల్లించడానికి సిద్ధమవుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజల్‌, నర్కుడలతో పాటు మరికొన్ని సహకార సంఘాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నందిగామ మండలంలో బీరువా గుర్తు వచ్చిన అభ్యర్థి.. ఓటర్లకు పంపిణీ చేయడానికి 150 బీరువాలకు ఆర్డరిచ్చారు.

యాదగిరిగుట్టలోని 13 డైరెక్టర్‌ పోస్టుల్లో 7 ఏకగ్రీవమయ్యాయి. ఇందులో నలుగురు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలవగా, ముగ్గురు కాంగ్రెస్‌ బలపర్చినవారున్నారు. మిగతా ఆరింటికి పోటాపోటీ నెలకొంది. దీంతో డైరెక్టర్‌ అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు వేలం వేస్తున్నారు. రూ.2 వేల నుంచి ఈ వేలం మొదలవుతోంది. కొందరు రూ.7 వేల చొప్పున పంపిణీ చేశారు.

రంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడ సొసైటీ పరిధి కర్ణంగూడలో 90 మంది ఓటర్లున్నారు. వీరిలో 30 మందిని ఓ అభ్యర్థి విహార యాత్రకు తీసుకెళ్లాడు. పోలింగ్‌ రోజే వారిని తిరిగి రప్పించనున్నారు.

రంగారెడ్డి జిల్లా ఎంపీ పటేల్‌గూడలోని 13 మంది డైరెక్టర్లలో ముగ్గురు ఏకగ్రీవమయ్యారు. ఇక్కడ ఓటుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇదే జిల్లాలోని పోల్కంపల్లి సొసైటీలో టీఆర్‌ఎ్‌సను ఓడించడానికి బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం కూటమి కట్టాయి. మంచాలలో టీఆర్‌ఎస్‌, సీపీఐ ఒప్పందం చేసుకోగా.. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి.

నిజామాబాద్‌లో మొత్తం 1147 డైరెక్టర్‌ పోస్టులుండగా.. 736 ఏకగ్రీవమయ్యాయి. 411 డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఓట్లేయించుకోవడానికి ఏకగ్రీవమైనవాళ్లను సైతం విహారయాత్రలకు తీసుకెళ్తున్నారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి సొసైటీ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న అభ్యర్థి… డైరెక్టర్‌ అభ్యర్థులను గోవా తీసుకెళ్లాడు. జైనా పరిధిలోని డైరెక్టర్లను చైర్మన్‌ పదవి ఆశిస్తున్న వ్యక్తి షిర్డీ తీసుకెళ్లాడు. కొన్నిచోట్ల ఓటుకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఇస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఏకగ్రీవమైన 138 డైరెక్టర్లను క్యాంపులకు తరలించారు.

సంగారెడ్డి జిల్లా పాటి గ్రామంలో కొన్ని డైరెక్టర్‌ స్థానాల్లో ఓటుకు రూ.10వేల వరకు ఇస్తున్నారు. నారాయణఖేడ్‌, అందోలు, జహీరాబాద్‌, సంగారెడ్డి ప్రాంతాల్లోని సొసైటీల్లో ఓటర్లకు మద్యంతో పాటు రూ.వెయ్యి నుంచి రూ.2వేలు పంచుతున్నారు.

 ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో, మెదక్‌ జిల్లా చేగుంట, మెదక్‌ మండలాల్లో రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తున్నారు.

5,387 డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవం
సహకార ఎన్నికల్లో మొత్తం 5,387 డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవాలు తేలాయి. రాష్ట్రంలోని మొత్తం 905 పీఏసీఎ్‌సలకు గాను 904 సొసైటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 11,654 డైరెక్టర్‌ పదవులుండగా 19,840 మంది పోటీకి దిగారు. డైరెక్టర్‌ పదవుల్లో 5,387 ప్రాదేశిక నియోజకవర్గాలు ఏకగ్రీవం కావడంతో 6,267 డైరెక్టర్‌ పదవులకు 14,529 మంది బరిలో ఉన్నారు. 15న పోలింగ్‌ జరిపి, మధ్యా హ్నం ఫలితాలు ప్రకటించనున్నారు. ఒక్కో సొసైటీలో 13 మంది డైరెక్టర్లు ఉంటారు. డైరెక్టర్ల ఎన్నిక పూర్తి కాగానే 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలుంటాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates