బీజేపీ చేసిన ఈ పొరపాటే.. కేజ్రీవాల్‌కు వరమైంది..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అసామాన్య విజయం!
ఆప్‌ గెలుపునకు మూడు సూత్రాలు..
ఉచిత పథకాలతో పెరిగిన క్రేజ్‌
నిరుపేదలను మెప్పించిన విద్య, వైద్యం
భద్రత కల్పించడంతో మహిళల ఓటు
బీజేపీ జాతీయ ఉచ్చులో పడని కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : సంక్షేమం.. సంరక్షణ.. సంస్కారం! ‘మినీ భారత్‌’లో సామాన్యుడి అసాధారణ విజయానికి కారణాలివే! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయనకు ఓట్లు రాల్చాయి! మహిళలు, ఢిల్లీ ప్రజల సంరక్షణకు ఆయన తీసుకున్న నిర్ణయాలు మరోసారి విజయాన్ని అందించాయి! ముఖ్యమంత్రిగానే కాదు.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చూపిన సంస్కారం విజయ తీరాలకు చేర్చింది. వెరసి, కేజ్రీవాల్‌ మేజిక్‌ మరోసారి పనిచేసింది. బీజేపీ విభజన రాజకీయాల ఉచ్చులో పడకపోవడం.. జాతీయత విషయంలో రాజీ లేదని స్పష్టం చేయడం.. ఐదేళ్లు అధికారంలో కొనసాగినా అవినీతి మరక పడకపోవడం.. ఉచిత పథకాలు ఆప్‌ గెలుపు ను నల్లేరుపై బండి నడక చేసేశాయి. దీనికితోడు, ముస్లిములంతా ఏకం కావడంతో ఢిల్లీని ఆప్‌ ఊడ్చేసింది.

‘ఉచిత క్రేజీ’వాల్‌
ఢిల్లీ అంటేనే మినీ ఇండియా. అక్కడ అన్ని రకాల ప్రజలూ ఉంటారు. అన్ని రకాల సమస్యలూ సాధారణమే. కేజ్రీవాల్‌ వాటిపైనే దృష్టిసారించారు. దేశ రాజధానిలో ఒకప్పుడు విద్యుత్తు కోతలు దారుణం. మంచినీటి సరఫరా అస్తవ్యస్తం. కేజ్రీవాల్‌ ఆ సమస్యలను పరిష్కరించడమే కాదు.. ప్రజలకు ఉచిత విద్యుత్తు, మంచినీరు అందిస్తున్నారు. 2013లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే వీటిని ప్రకటించినా.. నీటి బిల్లులు సగానికి తగ్గించారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు. 400 యూనిట్లలోపు వాడే వాళ్లకు 50ు రాయితీ ఇస్తున్నారు. ఈ పథకాలు ఇప్పటికీ ఆయనకు ఓట్లు రాలుస్తూనే ఉన్నాయి. ఢిల్లీవ్యాప్తంగా కేజ్రీవాల్‌ ఏర్పాటు చేసిన 400 మొహల్లా క్లీనిక్‌లు నిరుపేదలకు వరంగా మారాయి. ఇక, ప్రభుత్వ విద్యకు కేజ్రీవాల్‌ పెద్దపీట వేశారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. మూడున్నరేళ్లుగా బడ్జెట్లో 25ు నిధులను ఈ రంగానికే ఖర్చు చేశారు. దాంతో, ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది.

అంతేనా, ఢిల్లీలోని 200కుపైగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచకుండా గత ఐదేళ్లుగా కేజ్రీవాల్‌ సర్కారు నిలువరించింది. భవిష్యత్తులోనూ స్కూలు ఫీజులను నియంత్రిస్తామని కేజ్రీవాల్‌ చెప్పారు. ఎక్కువగా వసూలు చేసిన స్కూళ్ల నుంచి తిరిగి ఇప్పించారు. పాఠశాలల్లో 17 వేల తరగతి గదులు కట్టించారు.  ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారంటే కేజ్రీవాల్‌ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. నిరుపేదలు ఆప్‌వైపు మొగ్గు చూపడానికి ఇవన్నీ కారణమయ్యాయి. ఇక, ఎన్నికల ముందు మహిళా ఓట్లపై కేజ్రీవాల్‌ కన్నేశారు. బస్సులు, మెట్రో రైళ్లలో మహిళలు, విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పించారు. దీనితో ఉద్యోగినులకు నెలకు రూ.1800 వరకూ లబ్ధి చేకూరింది. దాంతో, మహిళలు పెద్దఎత్తున చీపురుకు జైకొట్టారు. ఆప్‌కు 53ు పురుషులు ఓటు వేస్తే.. 59ు మహిళలు ఆదరించారు. అలాగే, ఢిల్లీలో 14ు ముస్లిములు ఉంటే.. బీజేపీకి వ్యతిరేకంగా గుండుగుత్తగా ఆప్‌కు ఓటేశారు.

సామాన్యుడి భద్రతకు భరోసా
కాలుష్యం, మహిళల భద్రత.. ఢిల్లీ ప్రజలను ఆందోళనపరిచిన అంశాలు. వీటి పరిష్కారానికి కేజ్రీవాల్‌ కొంత వరకూ చర్యలు తీసుకున్నారు. బస్సుల్లో మహిళలకు రక్షణ కల్పించడానికి 13 వేల మంది మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో 3 లక్షల సీసీటీవీ కెమెరాలు; 2 లక్షల వీధిలైట్లు ఏర్పాటు చేశారు. మహిళల పట్ల హుందాగా వ్యవహరిస్తామని స్కూళ్లలో విద్యార్థులతో ప్రార్థనలు చేయించారు. ఈ నిర్ణయాలు మహిళలపై సానుకూల ప్రభావం చూపాయి.

బీజేపీ ఉచ్చులో పడని చిచ్చరపిడుగు
ఎన్నికల ప్రచారంలో హుందాగా వ్యవహరించడం, ఎక్కడా సంయమనం కోల్పోకపోవడం కేజ్రీవాల్‌కు కలిసివచ్చిన అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచారాన్ని తాను, తన సంక్షేమ పథకాల చుట్టూనే కేజ్రీవాల్‌ తిప్పారు. కానీ, బీజేపీ మాత్రం ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేసింది. ప్రకాశ్‌ జావడేకర్‌ వంటివారు ఆయనను ఉగ్రవాదిగా అభివర్ణించారు. దమ్ముంటే షాహీన్‌బాగ్‌కు వెళ్లాలని సవాల్‌ విసిరారు. సీఏఏ ఆందోళనలపై కేజ్రీవాల్‌ దృష్టిమళ్లించేలా పావులు కదిపారు. కానీ, ఎక్కడా ఆయన సంయమనం కోల్పోలేదు. వాటి ప్రస్తావన లేకుండా తన పథకాల ప్రచారంపైనే దృష్టిసారించారు. షాహీన్‌బాగ్‌కు వెళ్లలేదు. పరిధికి మించి బీజేపీ చేసిన నెగెటివ్‌ ప్రచారం ఆ పార్టీకే ఎదురు తన్నింది. ఇక, మోదీని ఓడించడానికి ఆప్‌ను గెలిపించాలని పాక్‌ మంత్రి ఒకరు ట్వీటారు. దానికి కేజ్రీవాల్‌ అత్యంత హుందాగా స్పందించారు. ‘మోదీ మా ప్రధానమంత్రి’ అంటూ తన జాతీయవాదాన్ని చాటుకున్నారు. మరో అంశం ‘హనుమాన్‌ చాలీసా’. ఓ చానల్‌ యాంకర్‌ కోరిక మేరకు కేజ్రీవాల్‌ హనుమాన్‌ చాలీసా పఠించారు. ఇది హిందూ ఓట్లను ఆకర్షించడానికి కారణమైంది. ఒకప్పుడు మోదీ-షాలపై పరుషమైన ట్వీట్లు చేసిన కేజ్రీవాల్‌.. ఆ తర్వాత వైఖరి మార్చుకోవడమూ కలిసి వచ్చింది. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఆప్‌కు వరమైంది.

హనుమంతుడు దీవించాడు!
కేజ్రీవాల్‌కు ఆంజనేయుడి ఆశీసులు లభించాయి! హనుమాన్‌ చాలీసా చదివి భక్తిని చాటుకున్న కేజ్రీ తిరుగులేని విజయం సాధించారు! ఢిల్లీ ఎన్నికల్లో గెలిచాక మారుతికి ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ‘‘ఈరోజు మంగళవారం హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. ఢిల్లీ ప్రజలను హనుమాన్‌జీ ఆశీర్వదించారు. వచ్చే ఐదేళ్లూ ప్రజలకు సేవ చేయడానికి సరైన దారి చూపాలని ప్రార్థిస్తున్నాను’’ అని కేజ్రీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన ఒక టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. హనుమంతుడిపై భక్తి ఉందా అని అడగ్గా మెండుగా ఉందని బదులిచ్చారు. అంతే కాదు.. హనుమాన్‌ చాలీసా చదివి అభినందనలూ అందుకొన్నారు.

ఐ లవ్‌ యూ! ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు
న్యూఢిల్లీ : అద్భుత విజయం అందుకొన్న కేజ్రీవాల్‌… ఆప్‌ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు ‘భారత్‌మాతాకీ జై’, ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’, ‘వందేమాతరం’ అని నినదించారు. ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించిన, 24 గంటలూ చౌకగా విద్యుత్‌ ఇచ్చిన పార్టీకి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 14… కేజ్రీకి స్పెషల్‌
మళ్లీ ప్రేమికుల రోజే ప్రమాణ స్వీకారం
?
న్యూఢిల్లీ : ప్రేమికుల రోజు- ఫిబ్రవరి 14తో కేజ్రీవాల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 2012 నవంబరులో ‘ఆప్‌’ని స్థాపించారు. ఆప్‌ తొలిసారిగా 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడడంతో కాంగ్రె్‌సతో ఆప్‌ చేతులు కలిపి అధికారంలోకి వచ్చింది. కొన్నాళ్లకే ఇరు పార్టీలు కత్తులు దూసుకోవడం మొదలుపెట్టాయి. ఫలితంగా 2014 ఫిబ్రవరి 14న సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు. 2015 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆప్‌ 67 స్థానాలు గెలిచింది. ఫిబ్రవరి 14న రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది తర్వాత సరిగ్గా అదే రోజు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘‘గత ఏడాది ఇదే రోజు ఢిల్లీ ఆప్‌తో ప్రేమలో పడింది. ఈ బంధం దృఢమైనది. చిరకాలం నిలిచేది’’ అని రాశారు. ఇప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14వ తేదీనే కేజ్రీవాల్‌ ఎంచుకోనున్నారని సమాచారం.
ట్విటర్‌లో ఆప్‌ పోస్టు చేసిన ‘మినీ మఫ్లర్‌మేన్‌’ ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది. కేజ్రీవాల్‌లా నెహ్రూ టోపీ, మెరూన్‌ స్వెటర్‌, మఫ్లర్‌, మీసకట్టుతో ఉన్న బాలుడి ఫొటోను ఆప్‌ పోస్టు చేయగా లైక్‌లు వెల్లువెత్తాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates