రాష్ట్రానికి కేంద్ర నిధుల్లో కోత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం
మొత్తంగా తగ్గిన రూ.48 వేల కోట్లు
పాత సంక్షేమ పథకాలపై ప్రభావం?
కొత్త వాటికి నిధుల కేటాయింపు డౌటే
సమీపిస్తున్న బడ్జెట్‌

ఒకవైపు కేంద్ర నిధుల్లో కోత.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ రాబడుల్లో తగ్గుదల.. వెరసి ఖజానా పరిస్థితి ఆందోళన కరంగా మారింది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో పద్దును రూపొందిం చటం ఆర్థికశాఖకు కొంత ఇబ్బందిరకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమలవుతున్న ఆసరా పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, కేసీఆర్‌ కిట్‌, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ తదితర పథకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే సమయంలో రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతికి ఈసారి బడ్జెట్‌లో కూడా ఎలాంటి కేటాయింపులూ ఉండకపోవచ్చని సమాచారం. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌ షిప్పులు, మెస్‌ బిల్లులు, వివిధ రంగాలకు సబ్సిడీల అమలు ఇప్పటికే నామ్‌కే వాస్తేగా తయారైంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే బడ్జెట్‌ లో కూడా వీటిపై సర్కారు శీతకన్నేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 -20)లో రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.19,718 కోట్ల నిధులు రావాల్సి ఉంది. గత బడ్జెట్‌లో ఈ మేరకు కేంద్రం ప్రకటన కూడా చేసింది. ఆ తర్వాత సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు మోడీ సర్కార్‌ కుదించింది. దీంతో రాష్ట్రానికి రూ.3,731 కోట్ల మేర నిధులు తగ్గాయి. ఫలితంగా కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు కచ్చితంగా విడుదలవుతాయంటూ భావించిన టీఆర్‌ఎస్‌ సర్కారు అంచనాలు తప్పాయి. ఇదే ఇప్పుడు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం చూపబోతున్నదని సమాచారం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ఓ సమీక్షా సమావేశంలో ప్రస్తావించటం గమనార్హం.

మరోవైపు రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ప్రభుత్వం వేసుకున్న లెక్కలు కూడా తారుమారవుతున్నాయి. సర్కారుకున్న అన్ని ఆదాయ వనరుల ద్వారా గత డిసెంబరు చివరి నాటికి రూ.1,37,226 కోట్లు సమకూరుతాయని బడ్జెట్‌లో అంచనా వేసుకోగా… అందుకు భిన్నంగా రూ.92,947 కోట్లు మాత్రమే ఖజానాకు చేరాయి. ఇది సర్కారు వేసుకున్న అంచనాల కంటే రూ.44,279 కోట్ల తక్కువ. ప్రస్తుతం మనం ఫిబ్రవరి రెండో వారంలో ఉన్నాం. జనవరి ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఆ గణాంకాలు తేలినా.. ఒకే ఒక్క నెలలో రూ.44,279 కోట్ల ఆదాయం ఖజానాకు చేరుకుంటుందా..? అంటే డౌటే అంటున్నారు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు. ఈ లెక్కన కేంద్రం నిధుల్లో తగ్గినవి, రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు తలకిందులైనవి కలిపి రూ.48,010 కోట్లకు చేరాయి. ప్రభుత్వ అంచనాలకు, వాస్తవాలకు ఇంత అంతరముంటుందని తాము భావించలేదని ఓ అధికారి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

గత డిసెంబరు చివరి నాటికి రాష్ట్ర ఖజానా పరిస్థితి… (రూ.కోట్లలో)
అంశం ప్రభుత్వ అంచనాలు వాస్తవాలు
1) వస్తు సేవల పన్ను 31,186 20,348
2) స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్స్‌ 6,146 4,865
3) ల్యాండ్‌ రెవెన్యూ 5.39 0.74
4) అమ్మకపు పన్ను 21,972 14,005
5) ఎక్సైజ్‌ సుంకాలు 10,901 9,032
6) కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 14,348 8,449
7)ఇతర సుంకాలు, పన్నులు 4,487 3,559
8) పన్నేతర ఆదాయం 15,875 2,983
9) గ్రాంట్లు, ఇతర ఆర్థిక సాయాలు 8,177 7,942

తగ్గించిన పన్నుల వాటా..
– కేంద్ర పన్నుల్లోంచి తెలంగాణ వాటాగా రావాల్సిన నిధుల్లో రూ.2,381 కోట్లు తగ్గనున్నాయి. రాష్ట్రాలకు చెల్లించే పన్నుల వాటాను 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గిస్తూ పదిహేనో ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను మోడీ సర్కారు ఆమోదించటమే దీనికి కారణం.
– జీఎస్టీ రూపంలో మన రాష్ట్రానికి విడుదల చేయాల్సిన రూ.1,137 కోట్లపై బడ్జెట్‌లో కేంద్రం స్పష్టతనివ్వలేదు. అంటే ఈ డబ్బును ఇస్తారో, ఇవ్వరో తెలియని పరిస్థితి.
– మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలంటూ నిటి అయోగ్‌ కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ దీన్ని ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పట్టించుకోలేదు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates