ఎన్నార్సీపై బీజేపీ దొంగాట

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 కొండూరి వీరయ్య

– కొండూరి వీరయ్య

ఎన్నార్సీపై కేంద్ర ప్రభుత్వం ఇంకా దేశాన్ని మోసం చేయాలనే ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 4న పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు జాతీయ పౌర జాబితా విషయంలో కేంద్రం ఇప్పటి వరకు ఓ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. జాతీయ జనాభా పట్టిక విషయంలో సైతం అనుమానితులుగా గుర్తించిన వ్యక్తుల పౌరసత్వాన్ని నిరూపించుకోవటానికి ఏ కాగితాలూ చూపించనవసరం లేదనీ సెలవిచ్చారు. సాధారణంగా పార్లమెంట్‌లో ప్రభుత్వం తరపున ఎవరేమి చెప్పినా అదే ఆఖరి మాట అవుతుంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం. అయితే ఇక్కడ తలెత్తే కొన్ని ప్రశ్నలు ప్రభుత్వ విశ్వసనీయతను సవాలు చేస్తున్నాయి.
2019 ఎన్నికల తర్వాత జూన్‌ 20న తొలిసారి సమావేశమైన లోక్‌సభనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రపతి ”ఎన్నార్సీ అమలు చేయటం ప్రాధాన్యత కలిగిన కర్తవ్యం. చొరబాటుదారులు దేశ ఆంతరంగిక భద్రతకు సవాలుగా మారారు. అనేక ప్రాంతాల్లో జనాభా పొందిక మారిపోతోంది” అని ప్రకటించారు. అక్టోబరు 14, 2019న ఇండియా టుడేకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హౌం మంత్రి అమిత్‌షా ”దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేయబోతున్నాం. అయితే వివరాలు ఇప్పుడే వెల్లడించలేను. అసోం అనుభవాల ఆధారంగా ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలుచేయనున్నాం” అని ప్రకటించారు. డిసెంబరు మొదటివారంలో జరిగిన కాబినెట్‌ సమావేశంలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం ఇవ్వటం, తదుపరివారంలో లోక్‌సభ, రాజ్యసభల్లో ఆగమేఘాల మీద ఈ బిల్లు చట్టంగా మారటం మనం చూశాం. ఈ సందర్భంగా హౌంమంత్రి ఇదే లోక్‌సభ, రాజ్యసభల్లో ముందు జనగణన సమయంలో జాతీయ జనాభా పట్టిక రూపొందించి అందులో గుర్తించిన చొరబాటుదారులను ఎన్నార్సీ ద్వారా దేశం నుంచి ఏరివేస్తామని, ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ముస్లిమేతర మతాలకు పౌరసత్వం కల్పిస్తామని స్పష్టంగా వివరించారు.

దీంతో దేశం అగ్గిమీద గుగ్గిలమైంది. ఒక్కసారిగా దేశవ్యాప్త ఆందోళనలు ఉప్పొంగాయి. దీంతో ఏమి చేయాలో తోచని ప్రధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించటానికి ఉద్దేశించి రాంలీల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక 2014 నుంచీ నేటి వరకు ఎన్నార్సీ గురించి మంత్రివర్గం చర్చించనే లేదని, ప్రతిపక్షాలు అనవసరంగా భయాందోళనలు సృష్టిస్తున్నాయనీ మాట్లాడారు. మరునాడే పత్రికలు మోడీ మాటలు మాయమాటలేనని రుజువు చేసేందుకు ప్రభుత్వ రికార్డులు, పార్లమెంట్‌ ప్రశ్నోత్తరాల నుంచి కావల్సినంత సమాచారాన్ని ప్రజల ముందుంచాయి. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలనుద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోడీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నార్సీపై వెనకంజ వేసేది లేదని ప్రకటించారు. అంతే కాదు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీల గురించి వివరించేందుకు వందలాదిమంది బీజేపీ నాయకులు సభలు, సమావేశాలు ఏర్పాటు చేయటమే కాక ఏకంగా కాల్‌ సెంటర్‌నే ఏర్పాటు చేశారు. కానీ ఫిబ్రవరి నారిటికి ఎన్నార్సీ గురించి మంత్రివర్గం చర్చించనే లేదని చెప్పటానికి ప్రభుత్వం ఏ మాత్రం సంకోచించటం లేదు. ఇందులో ప్రజలు ఎవరు చెప్పేది నమ్మాలి? రాష్ట్రపతి చెప్పిందా, ప్రధాని చెప్పిందా, హౌంమంత్రి చెప్పిందా, హౌంశాఖ సహాయ మంత్రి చెప్పిందా? దేన్ని నమ్మాలి? వీరిలో ఎవరో ఒక్కరే నిజం చెప్తున్నట్టు, మిగిలిన వాళ్లు అబద్ధం చెప్తున్నట్టు. పార్లమెంట్‌ వేదికగా దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నట్టు. పార్లమెంట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చి దేశం కండ్లు కప్పటానికి ప్రయత్నం చేస్తే సభా హక్కుల ఉల్లంఘన కింద సదరు మంత్రులకు, ఎంపీలకు నోటీసు ఇచ్చి దర్యాప్తు చేయించవచ్చు. మరి ప్రభుత్వం అందుకు సిద్ధపడుతుందా?

ఈ మొత్తం ప్రక్రియలో తలెత్తుతున్న సవాళ్లు రెండు. మొదటిది తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద పార్లమెంట్‌ మెట్లకు మొక్కిన ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి సభ్యులే పార్లమెంట్‌ వేదికగా అసత్యాలు, అర్థ సత్యాలు విచ్చలవిడిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక్క విషయంలో మాత్రం హౌంశాఖ సహాయ మంత్రి, హౌం మంత్రి మాట్లాడేదాంట్లో సారూప్యత ఉంది. లిఖిత పూర్వక సమాధానంలో నిత్యానంద రారు ప్రజలు కాగితాలు చూపనక్కర్లేదని, అంతమాత్రాన పౌరసత్వం కోల్పోతామన్న భయాందోళనలకు లోనుకానవసరం లేదని కూడా చెప్పారు. ఇంచుమించు ఇదే అర్థంలో అమిత్‌షా, ఇతర బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ప్రజలకు గొప్పగా రాయితీ ఇచ్చినట్టు ఫోజు పెడుతున్నారు. ప్రజలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేనప్పుడు జనగణనతో పాటు అటువంటి ప్రశ్నలకు సమాధానాలు తీసుకొమ్మని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఆదేశాలు జారీ చేసింది? రాష్ట్ర ప్రభుత్వాలు గజెట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు విడుదల చేశాయి? లోక్‌సభలో కేంద్ర హౌంశాఖ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో సవరించిన గజెట్‌ జారీ చేయాల్సిన అవసరం ఉంది. అలా కానిపక్షంలో అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రజలను మోసం చేయటంలో కూడబలుక్కుని వ్యవహరిస్తున్నట్టు ప్రజలు అర్థం చేసుకోవాలి.

ఎన్నార్సీ విషయంలో ప్రభుత్వం ఆడుతున్న దోబూచులాట మరింత విస్తృతమైనది. ఇప్పటి వరకు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయటానికి కావల్సిన విధి విధానాలు రూపొందించలేదు. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీయార్‌) ద్వారా సేకరించే వివరాలను ఏ విధంగా మదింపు చేయనున్నారో విధి విధానాలు రూపొందించలేదు. వాటిని బహిరంగ పర్చలేదు. 130కోట్ల భవిష్యత్తుకు సంబంధించిన ఈ నిర్ణయాలు అమలు చేసేందుకు మార్గదర్శకాలుగా ఉండాల్సిన విధి విధానాలు, నియమ నిబంధనలను రూపొందించకుండానే ఎన్పీయార్‌ ప్రక్రియ ఏప్రిల్‌ నుంచి మొదలు పెట్టాలని ఎందుకు చెప్తోంది? ఇందులో దాగి ఉన్న కుట్ర కోణం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే అసలు ఎన్పీయార్‌ గురించి కూడా కాస్త తెలుసుకోవాలి. ఎన్నార్సీకి పునాది ఎన్పీయార్‌లో సేకరించే సమాచారమే అన్నది తెలిసిందే.

మంత్రివర్యులు సెలవిచ్చిన దాని ప్రకారం ఎన్పీయార్‌కు సంబంధించిన ప్రశ్నల్లో కూడా ప్రజలు ఇష్టం ఉంటే సమాధానం ఇవ్వవచ్చు లేదంటే వదిలేయవచ్చు. అలాంటప్పడు అసలు ఈ ప్రశ్నలు ఎందుకు రూపొందించారు అన్నది కీలకమైన విషయం. ఆధార్‌ కార్డులు, పాన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు ఈ ప్రశ్నల్లో ఉన్నాయి. ఈ విషయంలో గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పును గుర్తు చేసుకోవాలి. ఆధార్‌కార్డులు ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అన్నిరకాల అవసరాలు, సదుపాయాలు, ప్రయోజనాలను అనుసంధానం చేసేందుకు ఆధార్‌ కార్డు ఒక్కటే మార్గమని ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదించింది. చివరికి సుప్రీం కోర్టు ఆధార్‌కార్డుతో లింకు లేకుండా కొన్ని సేవలు అందించవచ్చనీ సెలవిచ్చిందే తప్ప ఈ విధంగా ఆధార్‌ కార్డు పేరుతో సేకరించే వివరాలు వ్యక్తిగత సమాచారం మార్కెట్‌ శక్తులకు లీక్‌ చేయటం చట్ట విరుద్ధమని స్పష్టం చేయలేదు. సుప్రీం కోర్టు తీర్పును తుంగలో తొక్కి ప్రభుత్వం ఆధార్‌కార్డును అన్నింటికీ ఆధారంగా మారుస్తోంది. ఎన్పీయార్‌లో అదనంగా చేర్చిన ప్రశ్నావళి దీనికి సంబంధించిన విషయాలే ఉండటాన్ని గమనించాలి.

ఎన్పీయార్‌ వివరాలు సేకరించటం పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విషయమని, ఈ వివరాలు ప్రజలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆన్‌లైన్‌ ద్వారా కూడా సేకరించవచ్చని హౌం మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం బేఫికర్‌ అందంటే అక్కడేదో మతలబున్నట్టే అన్నది మన అనుభవం. ఆందోళన వద్దంటూనే ప్రభుత్వాధినేతలు మడత నాలికతో మాట్లాడుతున్నారంటే మూలంలో ముసలం ఉన్నట్టే. జనగణన వివరాలను, ఆధార్‌ వివరాలతో పోల్చి తనికీ చేసేందుకు ప్రభుత్వం వద్ద కావల్సినంత యంత్రాంగం ఉంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లు, వాటిలో నుంచి వచ్చే ఓటింగ్‌ స్లిప్‌లపై ప్రభుత్వానికి, హౌం శాఖకు పూర్తి అధికారం ఎలా ఉందో ఆధార్‌ కార్డు వివరాల మీద కూడా అలాంటి అధికారమే ఉంది. ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రభుత్వంలో ఉన్న కొందరి పెద్దల ప్రయోజనాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తే తన చేతిలో ఉన్న వివరాలను మటుమాయం చేయటం మనం ఇండ్లల్లో లైటు వెలిగించటానికి మీట నొక్కినంత సేపు కూడా పట్టదు ప్రభుత్వానికి. దాదాపు 375 లోక్‌సభ నియోజవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కవేసిన ఓట్లకు, మిషిన్‌ నుంచి బయటకొచ్చిన ఓటింగ్‌ స్లిప్పులకు మధ్య తేడా ఉందన్న విషయంలో సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి నోటీసు ఇచ్చింది. ఎన్నికలైన మరుసటి నెల్లోనే ఈ రకమైన తేడాను తెలియచేసే సమాచారం ఎన్నికలసంఘం వెబ్‌సైట్‌ నుంచి మాయమైంది. ఏడాది పాటు భద్రంగా ఉండాల్సిన ఓటింగ్‌ స్లిప్పులు ఆర్నెల్లకే మాయం అయ్యాయట. సాక్ష్యాలు మటు మాయం చేయటంలో ఈ ప్రభుత్వానిది అందె వేసిన చేయి. సీబీఐ కోర్టు న్యాయమూర్తి లోయా మరణానికి సంబంధించిన సాక్ష్యాల మొదలు గుజరాత్‌ నరమేథం సాక్ష్యాల వరకు పాలకులు అనుసరిస్తున్న టెక్నిక్‌ ఇదే.

సంక్షేమ పథకాల్లో జరుగుతున్న దుర్వినియోగం, పన్ను ఎగవేతలు వంటి వాటిని అరికట్టేందుకు మాత్రమే అన్న సాకుతో మొదలైన ఆధార్‌ ఈ రోజు సగటు భారతీయుడి కదలికలన్నీ ప్రభుత్వం వద్ద పోగుచేసే ఆధారంగా మారింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశంలోని 135కోట్ల జనాభాకు గాను 125కోట్ల మందికి ఆధార్‌ కార్డులున్నాయి. అందులో 119కోట్లమంది వివరాలు ఎన్పీయార్‌ జాబితాలో ఇప్పటికే చేరిపోయాయి. ఎన్పీయార్‌ ప్రకారం సాధారణ పౌరులు అంటే పౌరసత్వం ఉన్నా లేకపోయినా ఈ దేశంలో ఆర్నెల్లుగా నివశిస్తున్న వ్యక్తులు అని అర్థం. 2003, 2004లో వివిధ సందర్భాల్లో పౌరసత్వ చట్టంలో చేసిన సవరణలతో నేడు ఎవరి అనుమతి లేకుండానే కేంద్రం పౌరుల ఆధార్‌ వివరాలను, ఎన్పీయార్‌, జనగణన వివరాలను ఆఫీసులో కూర్చుని మాచ్‌ చేసుకునే అధికారాన్ని కలిగి ఉంది. 2014 తర్వాత ఈ రకంగా పౌరుల వివరాలను ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా నిక్షిప్తం చేసే పని మరింత వేగంగా సాగింది. జన్‌ధన్‌ యోజన, ఆధార్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ (జామ్‌) పేదలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందించే త్రయం అని నాడు అరుణ్‌ జైట్లీ 2016 బడ్జెట్‌లో గొప్పగా చెప్పినా ఈ లింకేజి ద్వారా దేశంలోని 120 కోట్లమంది పౌరుల పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గర చేరిపోయాయి.

ఆధార్‌కార్డు వివరాలతో ఉన్న డేటా బేస్‌ను ఇతర వివరాలు పొందుపర్చిన డేటా బేస్‌తో జోడించటం ద్వారా ఇష్టం వచ్చిన వివరాలు ఉంచవచ్చు. ఇష్టం లేనివి తొలగించవచ్చు. లేదా కొన్ని సేవలు కొందరికి అందకుండా ఓ మీట నొక్కి అడ్డుపడొచ్చు. ఈ మొత్తం ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం, హౌం శాఖ కనుసన్నల్లోకి చేరిపోయింది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేయటానికి కావల్సిన వివరాలు ఎన్పీయార్‌ రూపంలో సేకరించబోము అని ప్రభుత్వం ప్రకటించినా ఎన్నార్సీ అమలుకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ప్రభుత్వ వ్యూహానికి వచ్చిన ఆటంకాలేమీ లేవు. ఈ మాత్రం గ్యారంటీ ఉన్నందునే ఏకంగా ఎన్నార్సీ అమలు ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఏ మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదని లోక్‌సభకు తెలిపారు. అసోంలో మాత్రమే ఎన్నార్సీ అమలు కోసం సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలు రూపొందించింది. దేశవ్యాప్తంగా ఎన్నార్సీకి సంబంధించిన ఎటువంటి మార్గదర్శక సూత్రాలు ఏమీ లేవు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వద్ద వివిధ రూపాల్లో పోగుపడ్డ పౌరుల వివరాలు పిచ్చివాని చేతిలో రాయిగా మారనున్నాయి.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates