అదానీకి భారీ లబ్ది

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కాగ్‌ సూచనలు గాలికి..
గుజరాత్‌లోని బీజేపీ సర్కార్‌ను తూర్పార బట్టిన పీఏసీ నివేదిక

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అదానీ గ్రూప్‌నకు చెందిన ముంద్రా ఓడరేవు నిర్వహణ సంస్థ గుజరాత్‌ అదానీ పోర్టు లిమిటెడ్‌(జీఏపీఎల్‌)కు భారీ లబ్ది చేకూర్చినట్టుగా స్పష్టమైంది. గుజరాత్‌ అసెంబ్లీకి చెందిన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) నివేదికలో ఇది వెల్లడైంది. అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ ప్రధాని మోడీకి సన్నిహితుడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని అత్యంత ధనవంతుల్లో గౌతమ్‌ అదానీ రెండో వ్యక్తి అని అంచనా. అదానీ గ్రూప్‌ గుజరాత్‌తోపాటు కేరళ, తమిళనాడు, ఒడిషాలోనూ ఓడరేవుల్ని నిర్వహిస్తోంది. 2014 జులై 7న గుజరాత్‌ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక ఆధారంగా పీఏసీ పరిశీలన జరిపి ఈ నివేదికను రూపొందించింది. పీఏసీ తన నివేదికను గతేడాది డిసెంబర్‌ 9న సమర్పించాల్సి ఉండగా, అది జరగలేదు. ఈ నివేదికను న్యూస్‌క్లిక్‌ బహిర్గతం చేసింది. కాగ్‌ నివేదికను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసే అధికారం పీఏసీకుంటుంది. 2018-19లో పీఏసీకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పంజాభారువంశ్‌ చైర్మెన్‌గా వ్యవహరించారు. పీఏసీలో 8మంది బీజేపీ సభ్యులుండగా, ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులున్నారు. పీఏసీ నివేదికను సభ్యులంతా ఆమోదించడం గమనార్హం. దానిపై ఎవరూ అసమ్మతి నోట్‌ రాయలేదు. పీఏసీకి ప్రతిపక్ష ఎమ్మెల్యే చైర్‌పర్సన్‌గా వ్యవహరించడం ఆనవాయితీ. పీఏసీ సభ్యులు 2015 నుంచి 2018 వరకు 159సార్లు సమావేశమై ఈ నివేదికను రూపొందించారు.

2014 కాగ్‌ నివేదిక ప్రకారం అదానీ గ్రూప్‌నకు 2011 ఆగస్టు నుంచి 2013 మార్చి వరకు రూ.20.91 కోట్లమేర లబ్ధి చేకూరింది. ఓడ రేవు నిర్వహణలో భాగంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రాయల్టీని తక్కువగా నిర్ణయించడం ద్వారా గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఆమేరకు అదానీ గ్రూప్‌నకు లాభం చేకూర్చింది. అంటే ప్రభుత్వ ఖజానాకు ఆమేరకు నష్టం జరిగిందని అర్థం. దీన్ని వడ్డీతోసహా అదానీ గ్రూప్‌ నుంచి తిరిగి రాబట్టాలని కాగ్‌ సూచించింది. ఓడ రేవు నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపులోనూ గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అదానీ కంపెనీకి లబ్ధి చేకూర్చిందని కాగ్‌ తప్పు పట్టింది. తక్కువ ధరకు భూమి కేటాయించడాన్ని ఆక్షేపించింది. భూమి బదలాయింపునకు సంబంధించిన ఒప్పందాల్లో నిబంధనల ఉల్లంఘనను కాగ్‌ నివేదిక వెల్లడించింది.

2011లో గుజరాత్‌ అసెంబ్లీకి సమర్పించిన కాగ్‌ నివేదిక ప్రకారం అదానీ ఎనర్జీ లిమిటెడ్‌కు ప్రభుత్వరంగ సంస్థ గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ నుంచి 2006-2009 మధ్య కాలంలో సహజ వాయువును తక్కువ ధరకు ఇప్పించడం ద్వారా రూ.70 కోట్లమేర లబ్ధి చేకూర్చింది. 2015 కాగ్‌ నివేదిక ప్రకారం 2008-2009 కాలంలో అదానీ ఓడరేవుకు రూ.59 కోట్లమేర లబ్ధి చేకూరింది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అదానీ గ్రూప్‌నకు భారీ లబ్ధి చేకూర్చినట్టు కాగ్‌ మూడు నివేదికల్లోనూ స్పష్టమైంది. ప్రస్తుతం మోడీ ప్రధాని కాగా, అక్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో అదానీ గ్రూప్‌ మరిన్ని ప్రయోజనాలను పొందుతున్నట్టుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాగ్‌ నివేదికలు కూడా అందుకు బలం చేకూర్చడం గమనార్హం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates