జైళ్లలో కాశ్మీరీ యువత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టులు
ఆర్నెళ్లుగా కన్న బిడ్డలకు దూరమయ్యామంటూ తల్లుల ఆక్రందన
వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విన్నపం

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణం 370 రద్దుకు గతేడాది ఆగస్టు 5న కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి ముందు కాశ్మీర్‌లోని పలువురు ముస్లిం యువకుల్ని కేంద్ర భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రజా భద్రతా చట్టం(పీఎస్‌ఏ) కింద 412మందిని అదుపులోకి తీసుకున్నట్టు జమ్మూకాశ్మీర్‌ కొయిలిషన్‌ ఆఫ్‌ సివిల్‌ సొసైటీ(జేకేసీసీఎస్‌) తెలిపింది. వీరిలో చాలామంది దేశంలోని పలు జైళ్లకు తరలించబడ్డారు. ఆరు నెలలు కావొస్తున్నా వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియక కన్న తల్లులు పుట్టెడు శోకంలో మునిగిపోయారు. పీఎస్‌ఏ కింద ఎలాంటి విచారణ లేకుండా రెండేండ్లపాటు నిర్బంధించేందుకు వీలున్నది. కాశ్మీర్‌ నుంచి ఆకస్మికంగా జైళ్లకు తరలించబడిన బాధిత యువకుల తల్లులు కొందరిని న్యూస్‌క్లిక్‌ విలేకరి కమ్రాన్‌ యూసుఫ్‌ పలుకరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

పుల్వామా జిల్లా బెల్లో గ్రామానికి చెందిన 80 ఏండ్ల జైనా తన కుమారుడి రాక కోసం కండ్లు కాయలు చేసి ఎదురు చూస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమె తన కుమారుడు లతీఫ్‌ అహ్మద్‌దార్‌ ఫోటో చేత పట్టుకొని ఇంట్లో ఓ మూలన కూర్చొని ఆవేదన చెందుతున్నారు. తన కొడుకును చూపించాలని వేడుకుంటున్నారు. తన కళ్ల వెలుగైన కుమారున్ని పట్టుకెళ్లి తనకు గుండె కోత మిగిల్చారని దీనంగా రోదిస్తున్నారు. ఆగస్టు 1న తన కొడుకుని భద్రతా దళాలు పట్టుకెళ్లాయని ఆమె తెలిపారు. ఆ రోజున తాను ఇంట్లో లేనని, తెలియగానే పరుగున వచ్చానని తెలిపారు. రాజ్‌పొర పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన కొడుకును చూశానని ఆమె తెలిపారు. ముఖంలో కళ తప్పి ఆందోళనలో ఉన్న తన కొడుకును చూసి కన్నీటి పర్యంతమయ్యానని ఆ రోజు సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. మొదట సెంట్రల్‌ జైలులో ఉంచారని, ఆ తర్వాత ఆగ్రాకు తరలించారని ఆమె తెలిపారు. సెంట్రల్‌ జైలులో ఉన్నపుడు మరోసారి తన కొడుకును చూసేందుకు వెళ్లానని, ఆగస్టు 15 తర్వాత విడుదల చేస్తామని అధికారులు చెప్పారని, ఇప్పటి వరకూ వదిలిపెట్టలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కరీమాబాద్‌కు చెందిన మమూన్‌ పండిట్‌(18)ను ఆగస్టు 4న భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆరోజు తన కుమారున్ని పట్టుకెళ్లిన తీరు తమకు ఆందోళన కలిగించిందని ఆయన తల్లి నసీమా(56) తెలిపారు. భద్రతాదళాలు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారని, తననూ తన కూతుళ్లనూ ఓ గదిలో బంధించి తన కుమారున్ని తీసుకెళ్లారని ఆమె తెలిపారు. ఆరోజు సంఘటనను తలచుకుంటే తనకు కంటిమీద కునుకు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు ఇంట్లోంచి బయటకు కూడా వెళ్లేవాడు కాదని ఆమె తెలిపారు. ఒక్కరోజు కూడా తనను విడిచి వెళ్లేవాడు కాదని ఆమె రోదిస్తున్నారు. తన కొడుకును దూరపు జైలుకు తరలించినట్టు తెలిసిందని, అక్కడికి ఎలా వెళ్లాలో అర్థం కావడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీనగర్‌లోని మైసూమా ప్రాంతానికి చెందిన అటిఖా(55) పదేండ్ల క్రితం భర్తను కోల్పోయారు. గతేడాది ఆగస్టు 5న తనకు మందులు తేవడానికి వెళ్లిన కుమారుడు ఫైజల్‌ అస్లాంమీర్‌(30) తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందారు. ఆరా తీస్తే మార్గమధ్యంలోనే సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఫైజల్‌ను పట్టుకెళ్లినట్టు తెలిసింది. పీఎస్‌ఏ కింద అరెస్టయిన ఫైజల్‌ను మూడు రోజులపాటు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి ఆ తర్వాత శ్రీనగర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించి అక్కడ ఆగస్టు 21 వరకూ ఉంచారు. చివరికి ఆగ్రాకు తరలించారు. తనకున్నది ఒక్క కొడుకేనని, వాడు లేకుండా తనకు ఈ బతుకెందుకంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

పుల్వామాకు సమీపంలోని పావూ గ్రామానికి చెందిన సారాబానోది రైతు కుటుంబం. ఆమె కుమారుడు ఫయాజ్‌ అహ్మద్‌(26) యూనివర్సిటీ ఆఫ్‌ కాశ్మీర్‌ నుంచి అరబిక్‌లో ఎంఏ పూర్తి చేశారు. పీహెచ్‌డీ మధ్యలో ఉండగా గతేడాది ఆగస్టు 4న అరెస్టయ్యారు. యూపీ బరేలీలోని జైలుకు తరలించారు. పోలీసులపై రాళ్లు విసిరినట్టు ఫయాజ్‌పై కేసు నమోదైంది. కానీ, తన కుమారుడికి అలాంటివేమీ తెలియవని, సెలవుల్లో ట్రాక్టర్‌ తోలుతూ కుటుంబాన్ని పోషించేవాడని సారాబానో చెబుతున్నారు. ఇప్పటివరకూ తన కొడుకును చూడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పుల్వామా జిల్లా కరీమాబాద్‌కు చెందిన రుబీనా(45) తన కుమారుడు మున్నర్‌ ఉల్‌ ఇస్లాంను ఆగస్టు 4న భద్రతా దళాలు పట్టుకెళ్లిన తీరును గుర్తు చేసుకున్నారు. ఆ రోజు సైన్యం ఆకస్మికంగా వచ్చి తన కుమారున్ని తీసుకెళ్తుండగా వెంబడించేందుకు ప్రయత్నించానని, తనను భయపెట్టేందుకు కాల్పులు జరపగా కొన్ని బుల్లెట్లు తమ ఇంటి తలుపులకు తగిలాయని ఆమె తెలిపారు. తన కొడుకు జుట్టు పెంచాడని తీసుకెళ్లారు. జుట్టు వల్ల వాళ్లకు ప్రమాదమేమిటని ఆమె అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. తన కొడుకును తీసుకెళ్లడం వల్ల ప్రభుత్వానికి మేలేమిటని ఆమె అంటున్నారు. పేదరికం వల్ల తన కుమారున్ని చూడటానికి వెళ్లలేకపోయానని ఆమె చెప్పారు.

కరీమాబాద్‌కు చెందిన జనా 75 ఏండ్ల వృద్ధురాలు. పీఎస్‌ఏ కింద ఈమె కుమారుడు బిలాల్‌ అహ్మద్‌దార్‌ను పట్టుకెళ్లారు. తాను నడుం, కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నానని, తన కొడుకు కోసం ఎదురు చూడటం తప్ప ఎక్కడికీ వెళ్లలేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పుల్వామా జిల్లా రత్నీపొరాకు చెందిన గుల్షాన్‌(70) పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈమె కుమారుడు షమీమ్‌ అహ్మద్‌(32)ను ఆగస్టు 4న అరెస్ట్‌ చేశారు. మా బిడ్డల్ని జైళ్లలో ఎందుకు పెడుతున్నారని ఆమె ప్రశ్నిస్తున్నారు. కుటుంబాన్ని పోషించాల్సినవారిని తీసుకెళ్తే తామెలా బతకాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తన ఐదేండ్ల మనవరాలు తండ్రి గురించి ప్రశ్నిస్తే తన దగ్గర సమాధానం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓసారి తన కొడుకును చూసేందుకు వెళ్లాలంటే రూ.20 వేల వరకూ ఖర్చవుతుంది. తమను పోషించేవాడే లేనప్పుడు తమకు అంత డబ్బు ఎవరిస్తారని ఆమె రోదిస్తున్నారు. తమ బిడ్డల్ని వెంటనే విడుదల చేయాలని ఈ తల్లులంతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates