భూమాయ@110 కోట్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హైదరాబాద్‌లోని మణికొండలో కబ్జా
సర్వే నంబర్‌ 200 లో అక్రమాలు
ప్రభుత్వ భూమి ప్రయివేటుపరం
పహణీల్లో అక్రమ ఎంట్రీలు

అది గండిపేట మండలంలోని మణికొండ జాగీర్‌ ప్రాంతం. రియల్‌ ఎస్టేట్‌ మాఫియా రాజ్యమేలుతున్న రంగారెడ్డి జిల్లాలో అది అత్యంత విలాసవంతమైనది. ఒకవైపు ల్యాంకో హిల్స్‌, చుట్టూ ఐటీ కంపెనీలు కొలువైన ఆ ప్రాంతంలో భూమి ధరలకు రెక్కలు వచ్చాయి. విలువైన ప్రభుత్వ భూములపై కన్నేసిన కొందరు స్వార్థ పనులు రెవిన్యూ అధికారుల అండదండలతో రికార్డులను తారు మారు చేస్తున్న ఉదంతాలు ఎన్నో గతంలో వెలుగు చూశాయి. తాజాగా మణికొండ జాగీర్‌లోని ప్రభుత్వ భూమి వ్యవహారం ఆ ప్రాంతంలో కలకలం రేపుతున్నది. 200 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న కొందరు ప్రయివేటు వ్యక్తులు ఇటీవల ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి దీనిని ధారాదత్తం చేశారు. ఎకరం రూ. 40 కోట్లకు పైగా విలువ చేసే ఆ భూమిని పరిరక్షించటంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి.

నగర శివారు ప్రాంతంలో ఉన్న మణికొండ సమీపంలో ఐటీ కంపెనీల నిర్మాణం తర్వాత స్వార్ధ పరుల కన్ను అక్కడి భూములపై పడింది. వక్ఫ్‌, జాగీర్‌, అసైన్‌మెంట్‌, కాందిశీకుల పేరుతో ఉన్న అన్ని రకాల భూముల రికార్డులను తారుమారు చేసి వాణిజ్య సముదాయాలు, ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తున్నారు. అక్రమ లేఅవుట్లు, నిర్మాణ అనుమతులను పొంది అపర కుబేరులుగా మారి పోయారు. 200 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమి కూడా ఇదే వరుసలో చేరింది. ఆ భూమిలో ఒక భారీ కట్టడం నిర్మించటానికి ఒక నిర్మాణ సంస్థ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2.34 గుంటల (దాదాపు 13 వందల గజాల పై చిలుకు) ప్రభుత్వ భూమిని మణికొండ గ్రామస్తులు 80 వ దశకం వరకూ కాపాడుకుంటూ వచ్చారు. ఆ భూమిలో ఉన్న చిన్న రాతి గుండుపై ఆంజనేయుడి గుడి కూడా ఉన్నది. గ్రామస్తులు అక్కడ పూజలు కూడా నిర్వహిస్తూ వచ్చారు. 1987 లో కొందరు స్వార్ధ పనులు కొందరు రెవిన్యూ అధికారులతో కలిసి ఈ భూమి రికార్డులను తారుమారు చేసినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక కొందరు పెద్దల హస్తం కూడా ఉన్నట్టు వారు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి జిల్లా రెవిన్యూ అధికారి లేఖ ఆదేశాల లేఖ నంబర్‌ బీ1/486/87 తేదీ 20.101987 ఆదేశాలతో పహ ణీల్లో కొన్ని పేర్లను చేర్చారు. పట్టాదారు స్థానంలో ఉన్న ‘సర్కార్‌’ అనే పదం వద్ద గుండ్రటి గీత గీసి అక్కడ ఇరువురి పేర్లను నమోదు చేశారు. రెవిన్యూ రికార్డులో అత్యంత ప్రామాణికంగా భావించే 1958 ఖాస్రా పహణీలోకూడా ఇటువంటి మార్పు చేశారు. మణికొండ గ్రామస్తులు అడ్డు చెప్పినా రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు. అదే గ్రామానికి చెందిన ఒక రెవిన్యూ ఉద్యోగి ఈ వ్యవహారంలో కీలక పాత్ర నిర్వహించినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ల్యాంకో హిల్స్‌ నిర్మాణం తర్వాత భూమి ధరలు పెరిగిపోవటంతో ఇక్కడి ప్రభుత్వ భూమి చేతులు మారింది. చివరిగా ఇటీవల ఒక నిర్మాణ కంపెనీ ఈ భూమిలో రేకులతో ప్రహరీ నిర్మించింది. దీనిని కూడా స్థానికులు మూడు సార్లు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమికి సంబంధించిన రికార్డులు తారుమారు కావటంతో దీని వెనుక నిజాలను వెలికి తీయటానికి కొందరు గ్రామస్తులు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఫైల్‌ను తగులబెట్టి…
మణికొండ భూరికార్డుల తారుమారు వ్యవహారంపై పి. సురేష్‌ అనే సమాచార కార్యకర్త రెవిన్యూ అధికారులను సమాచారం కోరినా వారు వివరాలను వెల్లడించలేదు. ఆయన సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. సమాచారం అందించాలని కమిషన్‌ ఆదేశించిన తర్వాత రాజేంద్రనగర్‌ ఆర్డీవో, జిల్లా రెవిన్యూ అధికారి స్పందించారు. మణికొండలోని ప్రభుత్వ భూమికి సంబంధించిన రికార్డు లభ్యం కాలేదని వారు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన గ్రామస్తులకు అక్కడి అధికారులు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. సర్వే నంబర్‌ 200 కి సంబంధించిన ఫైల్‌ తగులబెట్టి ఆ ప్రదేశంలో ఫైల్‌ నంబర్‌తో కూడిన చిన్న కాగితం పెట్టారని అధికారులు తెలిపారు.

హైకోర్టును ఆశ్రయిస్తాం…
వంద కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తులకు అప్పగిం చటంతో కొందరు రెవిన్యూ అధికారుల హస్తం ఉన్నది. పహణీల్లో పేర్లు చొప్పించిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. వంద కోట్లకు పైగా విలువ చేసే 2.34 గుంటల ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోకపోతే హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాము. కొత్తగా వచ్చిన కలెక్టర్‌ వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలి.
పి. సురేష్‌, సమాచార కార్యకర్త, మణికొండ

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌…
మణికొండలోని విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన రెవిన్యూ శాఖ లేఖ నంబర్‌ 20734 ద్వారా 22.9.2016 న భూపరిపాలనా కమిషనర్‌కు, రంగారెడ్డి కలెక్టర్‌కు ఒక లేఖ రాసింది. ఈ భూమి వ్యవహారంపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయినా రెవిన్యూ యంత్రాంగంలో కదలిక రాలేదు. గ్రామస్తుల ఫిర్యాదుతో 2017 జనవరి 21 న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గండిపేట తహసిల్దార్‌కు లేఖ నంబర్‌ ఈ1-30-2017 పేరుతో ఒక లేఖ రాశారు. సర్వే నంబర్‌ 200 లోని భూవ్యవహారంపై దర్యాప్తు నివేదికను ఆయన కోరారు. అయినప్పటికీ కింది స్థాయి అధికారులు స్పందించలేదు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates