డిటెన్షన్‌ క్యాంపుల్లో దీనగాథలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఎస్‌.పుణ్యవతిImage result for ఎస్‌.పుణ్యవతి

దేశ రాజధాని ఢిల్లీ మహా నగరం. కూత వేటు దూరంలో పార్లమెంటు. కొంచెం అవతలికి వెళ్తే రాష్ట్రపతి భవనం. ఎదురుగా దూసుకుపోతున్న రోడ్డు. అటూ ఇటూ బోట్‌ క్లబ్‌ మైదానం. రోడ్డు చివర ఇండియా గేటు. ఇంకో నాలుగు రోజులు పోతే ఎటు చూసినా పూదోటలు సందడి చేస్తాయి. రకరకాల గులాబీలతో మొఘల్‌ గార్డెను కనుల విందు చేస్తుంది. దేశంలో పుట్టిన 130 కోట్ల జనం ఎప్పుడైనా ఈ దృశ్యాలు చూశారో లేదో! నాకైతే ఆ మహద్భాగ్యం కలిగింది. అతిరథ మహారథులు, అధికార గణాలు, వారిని కాపాడే రక్షక దళాలు ఓహ్… అబ్బుర పడాల్సిందే. అయినా మనసు ఆహ్లాదంగా లేదు. శాంతి లేదు. పైగా వణుకు. వెన్నులోంచి వణుకు. చలికా? రగ్గులు కప్పుకోవచ్చు. అయినా నిద్ర పట్టదు. ఆ రోజు ‘హాజ్‌రాని’ సందర్శించా. అంతకు ముందు ‘షహీన్‌ బాగ్‌’. రాత్రీ లేదు. పగలూ లేదు. తాత్కాలికంగా వేసిన టెంట్లలో బురఖాలు వేసుకున్న సోదరీమణులు ఆందోళనగా ఉన్నారు. వారి చుట్టూ వందల మంది పిల్లలు. వారికి సిఎఎ, ఎన్‌ఆర్‌సి పుట్టించిన వణుకుతో వెచ్చదనానికి రోడ్ల మీదకి వచ్చారు. ‘నేను ముస్లిం కాదు కదా! నాకేం కాదులే’. మనసుకు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశా. సమస్యంతా బురఖా లేసుకున్న ఆడవాళ్లదే కదా! మనది ‘ధర్మనిష్టాపరులైన’ హిందూ జాతి కదా! ‘హిందువులకేం ఢోకా లేదు’ అని అమిత్‌ షా ఘంటాపథంగా చెబుతుంటే ఇంకెందుకు భయం. అయినా ఎక్కడో అనుమానం. సందేహ నివృత్తి కోసం అంతర్జాలాన్ని ఆశ్రయించా. అనుమానం నిజమయ్యింది. గుండెల మీద పిశాచిలాగా భయం తిష్టవేసింది. ‘చావులు… చావులు… చావులు’ అసోం డిటెన్షను క్యాంపులో చావులు. ఒకరా? ఇద్దరా? 30 మంది. ఎందుకు మరణించారు? అసలీ డిటెన్షను క్యాంపులో ఎందుకున్నారు?

అసోం పౌరసత్వ మరణ గాథలు వేసవిలో కూడా వణుకు పుట్టిస్తాయి. ఎన్‌.ఆర్‌.సి దేశమంతా పెడితే మన గతీ ఇంతే కదా అనిపిస్తాయి. అసోం ఎన్‌.ఆర్‌.సి, డిటెన్షను క్యాంపులపై ఇటీవల సంవత్సరాల్లో అన్ని ప్రధాన స్రవంతి పత్రికలు రకరకాల కథనాలు ప్రచురిస్తూనే వున్నాయి. ‘1971కి ముందు మేము అసోం లోనే పుట్టాం. మేము అస్సామీయులమే’ అని రుజువు చేసుకోవడానికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. పుట్టిన తేదీ, స్థలం వివరాలతో పాటు తల్లిదండ్రులు, అవ్వా తాతలు పుట్టిన స్థలం, తేదీ వివరాల కోసం అధికారుల చుట్టూ పనీ పాటా మానుకొని, తిరిగి తిరిగి రుజువులు సంపాదించారు.
అయినా కొన్ని లక్షల మంది మిగిలిపోయారు. సుమారు 3 కోట్ల అసోం జనాభాలో 19 లక్షల మందికి పైగా రుజువులు లేక అల్లాడుతున్నారు. విదేశీయులుగా ముద్ర పడితే ఎక్కడ దేశం నుండి తరిమేస్తారో, ఎక్కడ నిర్బంధ శిబిరాల్లో మగ్గాలోనని బెంగతో కుంగిపోతున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది అమాయకులు జైళ్ల లాంటి నిర్బంధ శిబిరాల్లో మగ్గుతున్నారు. బెంగపడి కొందరు, గుండె పగిలి కొందరు, అంటురోగాలతో కొందరు ‘స్వర్గస్తులయ్యారు’. వారు నిరుపేదలని వేరే చెప్పాలా? వారిలో ఒకరి కథే ‘నరేష్‌ కోక్‌’ అనే అసోం రాష్ట్ర ఆదివాసీ పౌరసత్వ మరణ గాథ.

నరేష్‌ కోక్‌ అసలు సిసలు అస్సామీయుడు. ఆయన భార్య ‘జిను’. ఈమె ‘గారో’ అనే ఆదివాసీ తెగ స్త్రీ. గారో తెగవారు ఎక్కువ మంది మేఘాలయ సరిహద్దుల్లో ఉంటారు. నరేష్‌ కోక్‌ అనామకుడు కాదు. చరిత్ర హీనుడు అంతకన్నా కాదు. ‘కోక్‌’ రాజ్యం ఒకప్పుడు మహారాజు నరనారాయణ్‌, సేనాని చిలరామ్‌ వంటి వారి పాలనలో అసోం, బెంగాల్‌ లోని చాలా ప్రాంతాలకు విస్తరించింది. ఆదివాసీ గిరిజన ప్రాంతాలు నాగరికుల దాడులకు, ఆక్రమణలకు గురయ్యాయి. సమ్మక్క-సారలమ్మ మేడారం రాజ్యం మన కళ్ల ముంగటి చరిత్రే కదా! కోక్‌ గిరిజన జాతిదీ అదే పరిస్థితి. దోపిడీదారుల్లో కొందరు నవనాగరికుల్లా ఆకాశాన్నంటే భవనాల్లో కులుకుతుంటే, గిరిజన జాతి పొట్ట కూటి కోసం కూలి పనులు చేస్తోంది. కోక్‌ దంపతులు కూడా దగ్గరలోని చేపల చెరువుల్లో బతుకు తెరువు కోసం పని చేస్తున్నారు.

రెండేళ్ల క్రితం జరిగిన ఘటన. రోజంతా కష్టం చేశాడేమో, కష్టం మరిపించే మందు కోసం దగ్గర లోని సారా కొట్టుకు వెళ్లాడు. అక్కడ నుండి మళ్లీ ఇంటికి చేరలేదు. అటునుండి అటే పోలీసులు పట్టుకుపోయారు. కొద్ది రోజుల తరువాత గ్రామస్తులు ఆ నోటా ఈ నోటా అనుకుంటుంటే తెలిసిన వార్త ‘నరేష్‌ కోక్‌’ అస్సామీయుడు కాదని కోర్టు, అంటే ఫారినర్స్‌ ట్రిబ్యునల్‌ తేల్చిందని. కోర్టులో రుజువు చేసుకోవడం అంటే మాటలా! కోర్టు ఖర్చులకు కాదు కదా అతన్ని కలిసి రావడానికి రూ.100 ప్రయాణ ఖర్చులు భరించే స్థితి కూడా లేదు. రెండేళ్లు గడిచాయి. 2019 డిసెంబరు నెలలో నరేష్‌ ఇంటి ముందు పోలీసు జీపు ఆగింది. ‘నీ భర్త అనారోగ్యంతో ఉన్నాడు పద. గోల్పారా జిల్లా ఆసుపత్రికి’ అని ‘జిను’తో చెప్పారు. ఆమె దగ్గర చిల్లిగవ్వ లేదు. పోలీసులే రూ.100 ‘దానం’ ఇచ్చారు. ఆసుపత్రికి వెళితే అక్కడ నుండి రాష్ట్ర రాజధానిలో గౌహతి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసింది. స్థానిక పోలీసులు మళ్లీ రూ.1000 ఇచ్చి నరేష్‌ కోక్‌ భార్య ‘జిను’ను గౌహతి పంపించారు. ఆమెకు గౌహతి మహానగరం కాదు కదా పట్టణం ఎలా వుంటుందో కూడా తెలియదు. ఎలాగో ఆసుపత్రి చేరింది. భర్త మాట్లాడే స్థితిలో కూడా లేడు. పిచ్చి చూపులు చూడ్డం తప్ప. మానసిక ఆందోళన పెరిగి పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. పోలీసు పహారాలో భర్తకు చేరువలో 13 రోజులు ఆసుపత్రిలో గడిపింది జిను. జనవరి 5న నరేష్‌ చనిపోయాడు. ఎన్నో చిక్కు ప్రశ్నలకు మనల్ని జవాబులు వెతుక్కోమని.

ఏమిటా చిక్కు ప్రశ్నలంటారా?
భార్య జిను, కొడుకు బాబూలాల్‌ ఇద్దరూ అస్సామీయులే, భారతీయులే. కాని జన్మనిచ్చిన తండ్రి, కాపురం చేసిన భర్త ఎలా విదేశీయుడు? బతికుండగా విదేశీయుడుగా ముద్ర వేసిన ప్రభుత్వం చచ్చాక శవాన్ని ఎలా స్వదేశస్తులైన కుటుంబానికి అందజేసింది. ఏ చట్టం చెప్పింది. మోడీ-షా ద్వయం గంట బజాయించి చెప్పేదేమంటే పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌ బంగ్లాదేశ్‌ నుండి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, పార్శీలు వగైరాలకు పౌరసత్వం ఇస్తాం ఒక్క ముస్లింలకు తప్ప అని. మరి నరేష్‌ కోక్‌ ముస్లిం కాదు కదా! ఆదివాసీ తెగలకు వారి తెగ సాంప్రదాయాలున్నాయి కదా! వారిని కూడా హిందువుల లెక్కలోనే వేసుకుంటున్నారు కదా సంఘీయులు! మరి ‘నరేష్‌ కోక్‌’ పౌరసత్వం నిరాకరించి అతని చావుకు ఎందుకు కారకులయ్యారు. ఇది ఎన్‌ఆర్‌సి పేరుతో ప్రభుత్వం చేసిన హత్య కాదా! దీనికి ఎవరు బాధ్యులు? ఇలా గాల్లో కలిసి పోయిన 30 మంది ప్రాణాలు ఎవరు తిరిగి తెస్తారు?

అతిరథ మహారథులకు భోగభాగ్యాలు, అద్భుత భవనాలు, చీని చీనాంబరాలు, వేల రూపాయల సూట్లు, రక్షణ దళాల కాపలాలు, స్వర్గాన్ని మరిపించే సుఖాలు. ఏ జనం అయితే శ్రమించి సంపద వృద్ధి చేస్తే ఈ దొరలు కులుకుతున్నారో ఆ జనం ‘నేను ఈ గడ్డ మీదనే పుట్టాను మొర్రో’ అని రుజువు చేసుకోవాలా? చేసుకోకపోతే నిర్బంధ శిబిరాల్లో చావాలా? ప్రధాని మోడీజీ ‘ఈ దేశంలో నిర్బంధ శిబిరాలు లేనే లేవు’ అని నొక్కి వక్కాణించిన కొద్దిరోజులకే పేద గిరిజనుడు డిటెన్షన్‌ క్యాంపులో మనోవ్యధతో మరణించాడు. ఇట్లా ఇప్పటికే కొన్ని వేలమంది నిర్బంధ శిబిరాల్లో మగ్గుతుండగా, ఇంకా శిబిరాలు కడుతున్నారు. నిర్బంధ శిబిరాలు అబద్ధమా? మోడీజీ మాటలు అబద్ధమా?
నరేష్‌ కోక్‌ ఆత్మ ప్రశ్నిస్తోంది అమాయకంగా. ఏమనంటే ‘విదేశీయులను, చొరబాటుదార్లను గుర్తించాలనే సాకుతో మా జీవితాల మీద, మా పౌరసత్వం మీద ఎందుకు దాడి చేస్తున్నారు మోడీజీ’ మీ విశాలమైన ఛాతీ వెనక గుప్పెడు మనసుందా! ఉంటే బదులు చెప్పండి! అని.

ఎందుకో తెలియకనా! మోడీజీ ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు చేశారు! రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, పేదరిక నిర్మూలన అన్నారు. ఎక్కడున్నాం? ఉద్యోగాల కల్పనలో 45 సంవత్సరాలు వెనక్కి వెళ్లాం. ఆకలి కేకల్లో ప్రపంచ దేశాల్లో 102వ స్థానానికి దిగజారి పోయాం.
‘నేను హిందూ స్త్రీని. నేను సురక్షితం. పోయేది బురఖా వాళ్లు కదా’ అని అనుకుంటూ ‘ఈశ్వర్‌ అల్లా తేరే నామ్‌’ అని బాపూజీ పలవరించిన చోటే కొట్టుకు చస్తుంటే దొడ్డి దారిన బ్యాంకుల్లో మనం దాచుకొన్న సొమ్ములు దేశ సంపదలు పందికొక్కులకు ఫలహారం అయ్యే రోజు వచ్చింది.
ఇప్పటికైనా కళ్లు తెరుద్దాం. సిఎఎ, ఎన్‌ఆర్‌సి ఎన్‌పిఆర్‌ రద్దు కోసం నిలబడదాం. ‘కాగితం ఇచ్చేది లేదు. జవాబు చెప్పేదీ లేదు’ అని తెగేసి చెబుదాం. నరేష్‌ కోక్‌తో సహా నిర్బంధ శిబిరాల్లో మరణించిన 30 మందికి జోహార్లర్పిద్దాం.

( వ్యాసకర్త ఐద్వా జాతీయ కోశాధికారి )

Courtesy Prajashakti

RELATED ARTICLES

Latest Updates