సంక్షోభ కాలంలో సత్తువ లేని బడ్జెట్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 పి. చిదంబరం

2020-–21 ఆర్థిక సంవత్సరంలో అసంతృప్తికర వృద్ధిరేటుతో కుంటినడకన సాగే ఆర్థిక వ్యవస్థకు సంసిద్ధంగా వుండండి. ఇది మీకు తగినది కాదని నాకూ తెలుసు. అయినా, గత ఏడాది దక్కింది కూడా అటువంటి ఆర్థికమే కదా.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం, బడ్జెట్ అంకెలనుంచి మనకు విశదమయ్యే వాస్తవమేమిటి? ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వృద్ధిరేటు పెరుగుదలను వేగవంతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులను పెంపొందించడం, ఆర్థిక నిర్వహణా దక్షతను మెరుగుపరచడం, ఉద్యోగాలను సృష్టించడం, ప్రపంచ వాణిజ్యంలో మరింత అధిక వాటాను సముపార్జించుకోవడం… ఈ బృహత్ కర్తవ్యాలను బీజేపీ ప్రభుత్వం విడనాడిందనే…!

రాష్ట్రపతి ప్రసంగం, ఆర్థికసర్వే, బడ్జెట్‌ ఈ మూడూ ప్రభుత్వ ఆర్థిక విధానాలూ, లక్ష్యాలనూ వివరించే మూడు ప్రధాన పత్రాలు. అంతేకాదు, ఆ మూడూ, తన విధానాలూ, లక్ష్యాలను వివరించి, పార్లమెంటు లోపలా బయటా విస్తృత చర్చకు పెట్టేందుకు పాలకులకు లభిస్తున్న శాసన విహిత అవకాశాలు కూడా.

తొలుత రాష్ట్ర పతి ప్రసంగాన్ని నిశితంగా చదివాను. అంతకంతకూ విషమిస్తోన్న దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం సంకల్పించిన చర్యల గురించి ఏమైనా సంకేతాలు వున్నాయా అని చూశాను. ఎలాంటి సంకేతాలు కన్పించలేదు.

ఆ తరువాత ఆర్థిక సర్వేను అధ్యయనం చేశాను. ఈ ఏడాది యీ కీలక ఆర్థిక పత్రాన్ని రూపొందించిన విజ్ఞుడు కె. వి. సుబ్రమణియన్. అర్థశాస్త్రంతో పాటు తమిళ పద్యాలన్నా కూడా ఆయనకు ఎంతో మక్కువ వున్నట్టు కన్పిస్తోంది. సంపద సృష్టి మంగళప్రదమైనది, సంపద స్రష్టలను గౌరవించి తీరాలి. ఇది ఇంకెంత మాత్రం వినూత్న భావనా కాదు, వివాదాస్పద భావనా కాదు. మార్కెట్లలో ప్రభుత్వ జోక్యం ఆర్థికాభివృద్ధికి మేలు కంటే ఎక్కువ హాని ఎలా చేస్తుందనే విషయాన్ని ఒక అధ్యాయమంతా వివరించారు. ఇదే, ఈ ఆర్థిక సర్వేలోని ఏకైక ఆక్షేపణీయ అధ్యాయం.

ఈ ఆర్థిక సర్వేను నివేదించిన మరుసటి రోజే ఆర్థిక మంత్రి ఆయన సలహాను పెడచెవిన పెట్టారు! వ్యవస్థాగత సంస్కరణలపై ఇతర సిఫారసులను సైతం ఆమె అలక్ష్యం చేశారు. ఇక 2020–-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ చూద్దాం. బడ్జెట్ – అంకెలు, ప్రసంగం, ప్రతిపాదనలను మూడు శీర్షికల కింద అంచనా వేయదలుచుకున్నాను. అవి: లక్ష్యశుద్ధి, బడ్జెట్ కు మూలాధారమైన ఆర్థిక తాత్వికత, సంస్కరణలు.

2019 జూలైలో చివరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. అయితే 2019-–20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలు ఫలించనందుకు ఆర్థిక మంత్రిని బాధ్యురాలిని చేయడం సమంజసం కాదు. అయితే, పలు అంచనాల విషయంలో ఆమె విఫలమయ్యారన్న వాస్తవాన్ని నమోదు చేసి తీరాలి. ఆ వైఫల్యాలేమిటో చూద్దాం: స్థూల దేశియోత్పత్తి (జీడీపీ) పెరుగుదల 12 శాతంగా వుంటుందని అంచనా వేశారు. అయితే 2019–-20 లో జీడీపీ పెరుగుదల 8.5 శాతం మాత్రమే. 2020-–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ పెరుగుదల అంచనా 10 శాతం. ద్రవ్యలోటు అంచనా 3.3 శాతం కాగా అది 2019-–20 ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతంగా వుండనున్నది.

ఇక 2020-–21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.5 శాతంగా ఉంచాలని ప్రతిపాదించారు. నికర పన్ను రాబడి వసూళ్ళు రూ. 16,49,582 కోట్లుగా అంచనా వేశారు. అయితే ప్రభుత్వం 2020 మార్చి నెలాఖరుకు కేవలం రూ. 15,04,587 కోట్లు మాత్రమే వసూలు చేయగలుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.1, 05, 000 కోట్ల మేరకు ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ చర్య ద్వారా ప్రభుత్వానికి రూ.65, 000 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. 2019-–20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన పథకాలు, కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలకు మొత్తం రూ. 27,86,349 కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించింది.అయితే రూ. 26, 98,552 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. అందునా అదనంగా రూ.63,086 కోట్ల రుణాన్ని తీసుకున్నప్పటికీ సంకల్పించిన వ్యయాన్ని పూర్తిగా చేయలేకపోవడం గమనార్హం.

అసలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఒక మౌలిక ఆర్థిక తాత్వికత ఉన్నదా అనేది సందేహాస్పద విషయమే. ఒక నిర్దిష్ట ఆర్థిక తాత్వికత కొరవడడమనేది ఆందోళనకర విషయం. గత ఆరు సంవత్సరాలుగా వివిధ పథకాలు, కార్యక్రమాల పేరిట ప్రజానీకంలో విస్తారంగా చెలామణీలో పెట్టిన అనేకానేక సంక్షిప్త పదాల నుంచి ఆ ‘తాత్వికత’ ఏమిటో మనం గ్రహించ వలసి ఉంటుంది. స్వావలంబన, దేశీయ పరిశ్రమల సంరక్షణ విధానాలు, నియంత్రణ, (ఉత్పత్తి దారుల, వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా) వ్యాపార వర్గాలకు అనుకూలంగా పక్షపాతం చూపడం, తీవ్రతర పన్నుల విధానం, ప్రభుత్వ వ్యయంలో పరిపూర్ణ విశ్వాసం మొదలైనవి ప్రాథమికంగా బీజేపీ ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలుగా కన్పిస్తున్నాయి.

2020–-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రభుత్వ ఆర్థిక చింతనలో మార్పును సూచించడంలేదనేదే నిజం. దేశం ఎదుర్కొంటున్న స్థూల ఆర్థిక సంక్షోభంపై తమ ప్రభుత్వ ఆలోచనలు ఏమిటో ఆర్థిక మంత్రి వెల్లడించలేదు. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఎందువల్ల–వ్యవస్థాగత కారణాలతోనా లేక చక్రీయ హెచుతగ్గుల వల్లా-– నెలకొన్నదో ఆర్థిక మంత్రి చెప్పనే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఇక్కట్లకు కారణాలను నిరాకరించే ధోరణినే ప్రభుత్వం కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డిమాండ్ (వినియోగదారు తనకు కావాల్సిన వస్తువును కొనుగోలు చేసే శక్తిని కలిగి వుండడమే) కొరవడడం, పెట్టుబడులు రాకపోవడం వల్లే ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిందన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. వాస్తవాలను నిరాకరించే వైఖరిని కొనసాగిస్తుండడం వల్లే చేపట్టవల్సిన సంస్కరణల గురించి తీవ్రంగా ఆలోచించేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తోంది.

‘సంస్కరణల’ గురించి ప్రభుత్వ భావన ఏమిటి? పన్ను చెల్లింపుదారులకు స్వల్ప స్థాయిలో పన్ను రేట్లను తగ్గించడమేనని నేను భావిస్తున్నాను. కొన్ని నెలల క్రితం కార్పొరేట్ కంపెనీలకు పన్నుల చెల్లింపులో మినహాయింపులనివ్వడం ద్వారా ఇలా ఉపశమనం కల్పించింది. ప్రస్తుత బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రూ.40,000 కోట్ల మేరకు ఉపశమనం కల్పించారు. కార్పొరేట్ సంస్థలు తెచ్చిన ఒత్తిళ్ల మూలంగా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డిడిటి) ను ఆర్థిక మంత్రి రద్దు చేశారు. డిడిటి చాలా సమర్థమైన పన్ను అని, అది డివిడెండ్ ఆదాయంపై పన్ను ఎగవేతను అరికట్టిందన్నది ఎవరూ కాదనలేని సత్యం.

డిడిటిని రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయ నష్టం భారీగా వుండగలదని నిశ్చితంగా చెప్పగలను. కార్పొరేట్లకు పన్నులు తగ్గించే క్రమంలో ఆర్థికమంత్రి రెండు పన్ను వసూళ్ళ పద్ధతులను (ఒకటి మినహాయింపులతో, రెండోది మినహాయింపులు లేకుండా) ప్రవేశపెట్టారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను వ్యవస్థను బహుళ పన్నురేట్లతో సంక్లిష్టం చేశారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ను ప్రవేశపెట్టినప్పుడు ఎటువంటి ప్రభుత్వం ఏ పొరపాటు చేసిందో ఇప్పుడూ అదే పొరపాటును చేసింది.

సంస్కరణలకు సంబంధించి ఆర్థిక మంత్రి మూడు ఇతివృత్తాల (ధీమ్స్) ను సవివరంగా తెలిపారు. ప్రతి ఒక్కదానిలోను అనేక అంశాలు, పలు కార్యక్రమాలు భాగంగా వున్నాయి. ఉదాహరణకు ఆకాంక్షాయుత భారతదేశం అనే విషయం కింద మూడు అంశాల (సెగ్మెంట్స్) ను ఆమె ప్రస్తావించారు. ప్రతి అంశానికి సంబంధించి అనేక కార్యక్రమాల (ప్రోగ్రామ్స్) ను ప్రకటించారు. ఇదే ధోరణి లో ఆమె ఒక గంటపాటు ఇతర రెండు విషయాలు– అందరికీ ఆర్థికాభివృద్ధి, కేరింగ్ సొసైటీ (సహానుభూతితో సంరక్షణకు పూచీవహించే సామాజిక సముదాయం) గురించి వివరించారు.

నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఎన్నిసార్లు థీమ్స్, సెగ్మెంట్స్, ప్రోగ్రామ్స్ అనే పదాలను ప్రస్తావించారో లెక్క పెట్టడం నా వల్ల కాలేదు. ఆమె ప్రసంగం విని, ఆ తరువాత ప్రసంగ పాఠాన్ని సైతం చదివాను. అయితే వ్యవస్థాగత సంస్కరణల గురించి ఎలాంటి విషయమూ నాకు కన్పించలేదు. ప్రధాన ఆర్థిక సలహాదారు శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఇదలా వుంచితే, ఆర్థిక మంత్రి ఈ క్రింది విషయాలను చాలా సగర్వంగా ప్రకటించారు.

అవి: (1) 2006–-16 సంవత్సరాల మధ్య 27.10 కోట్ల మంది ప్రజలను పేదరికం విముక్తం చేయడం జరిగింది; (2) 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నాము; (3) స్వచ్ఛ్ భారత్ ఒక మహా విజయం. దేశవ్యాప్తంగా ఎక్కడా బహిరంగ మల విసర్జనలు జరగడం లేదు; (4) ప్రతి గృహానికి విద్యుత్ సదుపాయం కల్పించడం జరిగింది; (5) 2024 సంవత్సరంనాటికి భారత్‌ను 5 ట్రిలియన్ (1 ట్రిలియన్ = లక్ష కోట్లు) డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించనున్నాము (ఆర్థిక సర్వే ఈ గడువును 2025 సంవత్సరం నాటికి పొడిగించింది).

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం, బడ్జెట్ అంకెలనుంచి మనకు విశదమయ్యే వాస్తవమేమిటి? ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, వృద్ధిరేటు పెరుగుదలను వేగవంతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులను పెంపొందించడం, ఆర్థిక నిర్వహణా దక్షతను మెరుగుపరచడం, ఉద్యోగాలను సృష్టించడం, ప్రపంచ వాణిజ్యంలో మరింత అధిక వాటాను సముపార్జించుకోవడం… ఈ బృహత్ కర్తవ్యాలను బీజేపీ ప్రభుత్వం విడనాడిందనే కాదూ? మరి భవిష్యత్తేమిటి? 2020-–21 ఆర్థిక సంవత్సరంలో అసంతృప్తికర వృద్ధి రేటుతో కుంటినడక తో సాగే ఆర్థిక వ్యవస్థకు సంసిద్ధంగా వుండండి. ఆ ఆర్థికం మీకు అర్హమైనదికాదని నాకు తెలుసు. అయితే మీకు గత ఏడాది దక్కింది కూడా అటువంటి ఆర్థికమే కదా.

(కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates