గ్యాస్‌ గుప్పిట ఉప్పూడి!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • డ్రిల్‌సైట్‌లో భారీ శబ్ధాలతో గ్యాస్‌ లీక్‌
  • ఆందోళనలో పరిసర గ్రామాల ప్రజలు
  • పునరావాస కేంద్రాలకు తరలింపు

అమలాపురం : కోనసీమలో గ్యాస్‌ కలకలం రేగింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామం గ్యాస్‌ గుప్పిట్లో చిక్కుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో డ్రిల్లింగ్‌ సైట్‌ నుంచి అకస్మాత్తుగా భారీ శబ్ధంతో గ్యాస్‌ లీక్‌ కావడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. లీకేజీ కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బందితోపాటు ఓఎన్‌జీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పూడితోపాటు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఫైర్‌ ఇంజన్లను తెప్పించి తీవ్రఒత్తిడితో లీక్‌ అవుతున్న గ్యాస్‌ను అదుపుచేసేందుకు కృషిచేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. గ్యాస్‌ లీకేజీని అదుపు చేసేందుకు నరసాపురం, రాజమహేంద్రవరం, తాటిపాక, విశాఖపట్నం నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలను రప్పిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిందిలా..
మహిపాలచెరువు-పల్లంకుర్రు వెళ్లే ప్రధాన రహదారికి సమీపంలోని ఉప్పూడి వద్ద అపార గ్యాస్‌ నిక్షేపాలున్నట్టు ఓన్‌జీసీ అధికారులు 2006లో గుర్తించారు. రెండేళ్లక్రితం ఈ బావిని పీహెచ్‌ఎల్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీకి అప్పగించారు. మూడు రోజుల నుంచి ఈ గ్యాస్‌బావికి సంబంధించి వెల్‌క్యాప్‌ ఓపెన్‌ చేసి పేరుకుపోయిన మురికిని హైప్రెజర్‌ ద్వారా పంపింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గ్యాస్‌ ప్రెజర్‌ తీవ్రమై ఉవ్వెత్తున భారీ శబ్ధాలతో ఎగసిపడింది. దీంతో అక్కడ పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది భయంతో పరుగులుతీశారు.

కొన్ని గంటలపాటు గ్యాస్‌ భారీ ప్రెజర్‌తో ఎగదన్నడం వల్ల ఉప్పూడి పరిసర ప్రాంతాలన్నీ గ్యాస్‌తో కలుషితమయ్యాయి. ముందుజాగ్రత్తగా కాట్రేనికోన మండలానిక్లి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. డ్రిల్‌సైట్‌కు దగ్గరగా ఉన్న 70 కుటుంబాలతోపాటు సుమారు 2వేలకి పైగా జనాభా ఉన్న ఉప్పూడి గ్రామం మొత్తం ఖాళీ చేయించారు. లీకేజీ సమాచారం తెలియగానే ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌కుమార్‌, ఆర్డీవో భవానీశంకర్‌, డీఎస్పీ మాసూమ్‌బాషా అక్కడకు చేరుకున్నారు. బాధితులను ప్రత్యేక బస్సుల్లో చెయ్యేరు, మహిపాల చెరువులలోని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.

నిర్లక్ష్యం ఫలితమే..
ఓఎన్జీసీ, పీహెచ్‌ఎల్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ అధికారుల నిర్లక్ష్య ఫలితమే గ్యాస్‌ లీకేజీకి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనతో ఓఎన్జీసీకి సంబంధం లేదని, 2016-17లో ఈ బావిని పీహెచ్‌ఎల్‌ యాజమాన్యానికి అప్పగించామని అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఎగసిపడుతున్న గ్యాస్‌ వల్ల కళ్లు మంటలు, దద్దుర్లు వస్తున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Courtesy Andhrajyothi

 

RELATED ARTICLES

Latest Updates