22 విజ్ఞప్తులూ బుట్టదాఖలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కాళేశ్వరానికి మొండిచేయి..
  • భగీరథ, కాకతీయకు నిధుల్లేవ్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర నిరాశే మిగిలింది. కేసీఆర్‌ సర్కారు చేసిన విజ్ఞప్తులను కేంద్రం బుట్టదాఖలు చేసింది. కాళేశ్వరం సహా పలు కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని చేసిన ప్రతిపాదనలను పక్కనపెట్టింది. సీఎం కేసీఆర్‌ గతంలో నేరుగా ప్రధాని మోదీని కలిసి చేసిన 22 విజ్ఞప్తుల్లో ఒక్కదానిపైనా కేంద్రం స్పందించలేదు. తెలంగాణలో ఉన్న పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణకు నిధులు కేటాయించడం మినహా ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్దగా కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. డిసెంబరులో జరిగిన బడ్జెట్‌ ముందస్తు సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అనేక ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, నిధులు కేటాయించాలని చేసిన వినతినీ పరిగణనలోకి తీసుకోలేదు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకు నిధులు కేటాయించాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనలపై బడ్జెట్‌లో ప్రస్తావించనేలేదు.

భగీరథకు రూ.19,205 కోట్లు, కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ గతంలో సిఫారసు చేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలో సమీకృత ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రకటించాలని చేసిన వినతినీ కేంద్రం ప్రస్తావించలేదు. హైదరాబాద్‌లోని వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీ కోసం ఇబ్రహీంపట్నంలో 41 ఎకరాల అదనపు భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలకూ విలువ లేకుండా పోయింది. తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు ఐదో విడత కింద రూ.450 కోట్లు విడుదల చేయాలని, బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.. ౖ బడ్జెట్టులో ఎలాంటి ప్రస్తావన లేదు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై ఎలాంటి ప్రకటనా లేదు.

పరిశ్రమలకు మొండిచేయి..
జహీరాబాద్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన ‘నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌)’కు 500 కోట్లు కేటాయించాలని, ఆదిలాబాద్‌లోని సీసీఐని పునరుద్ధరించాలనే విజ్ఞప్తికి స్పందన లేదు. అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌ను వరంగల్‌ జిల్లాలో ఏర్పాటు చేయనుంది. దీనికి 1000 కోట్లు ఇవ్వాలని కోరినా కేంద్రం స్పందించలేదు. దక్షిణాది రాష్ట్రాల రాజధానుల మధ్య పారిశ్రామికాభివృద్ధికి హైదరాబాద్‌- బెంగళూరు- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్రం కోరుతోంది. దీంతోపాటు హైదరాబాద్‌- నాగ్‌పూర్‌, వరంగల్‌- హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్లు నెలకొల్పాలనీ కోరుతున్నా.. స్పందించలేదు.

హైదరాబాద్‌ చుట్టూ రీజనల్‌ రింగ్‌ రోడ్‌కు నిధుల అంశాన్నీ పట్టించుకోలేదు. పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా (42ు)లో కేంద్ర బడ్జెట్‌ ఒక శాతం కోత విధించింది. దీంతో రూ. 2,381 కోట్ల మేరకు స్వతంత్రంగా వాడుకునే నిధుల్లో కోత పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం.. రాష్ట్రానికి పన్నుల వాటాగా రావాల్సిన రూ. 19,718 కోట్లలో రూ. 3,731 కోట్ల మేర కోత విధించారు. దీని ప్రభావం కూడా రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్రంగా పడనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటాగా రూ. 16,726 కోట్ల మేరకే కేటాయించారు. గ్రాంట్స్‌-ఇన్‌-ఎయిడ్‌ కింద రాష్ట్రానికి రూ. 8,177 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. సవరించిన అంచనాల్లో రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్‌-ఇన్‌-ఎయిడ్‌ తగ్గింది.

కొత్త విద్యాసంస్థలూ లేవు!
ఏపీలో ఐఐఎం, ఐఐఎ్‌సఈఆర్‌ విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ రెండు విద్యాసంస్థల్లో కనీసం ఒక్కటైనా తెలంగాణకు కేటాయిస్తారని ఆశించగా.. నిరాశే మిగిలింది. ఎన్‌ఐడీని తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలని, కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ నెలకొల్పాలని కోరినా.. కేంద్రం స్పందించలేదు. ములుగులో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయం ఖర్చునూ సెంట్రల్‌ యూనివర్సిటీ మాదిరిగా అంతా కేంద్రమే భరించాలని కోరింది. అలాగే వెనకబడిన ప్రాంతాల్లో 4000 కి.మీ. రహదారులను మెరుగుపరిచేందుకు ప్రధాని గ్రామ సడక్‌ యోజన కింద నిధులు కేటాయించాలని, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని కోరినా.. ఎలాంటి హామీ దక్కలేదు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates