నేటి నుంచి సత్యాగ్రహ పాదయాత్ర

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– యూపీ సర్కారు దారుణాలపై పోరు
– చౌరీచౌరాలో ప్రారంభం
– 60 రోజులు సాగి రాజ్‌ఘాట్‌లో ముగింపు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ సర్కారు, పోలీసులు చేస్తున్న దారుణాలకు వ్యతిరేకంగా దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల విద్యార్థుల ఆధ్వర్యంలో నేటి నుంచి (ఫిబ్రవరి 1) ‘నాగరిక్‌ సత్యాగ్రహ పాదయాత్ర’ యూపీలో ప్రారంభం కానున్నది. 60 రోజులపాటు సాగే ఈ పాదయాత్ర యూపీలోని చౌరీచౌరాలో ప్రారంభమై ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద ముగుస్తుంది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆందోళనకారులు, ముఖ్యంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, ఆందోళనల్లో 25కుపైగా సంభవించిన మరణాలను ఖండిస్తూ ఈ మార్చ్‌ సాగనున్నది. దీనికి ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్సిటీ (జేఎన్‌యూ), జామియా మిలియా వర్సిటీ (జేఎంఐ), అలహాబాద్‌ వర్సిటీ, బనారస్‌ వర్సిటీ (బీహెచ్‌యూ)లతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాల విద్యార్థులు నేతృత్వం వహించనున్నారు. నాగరిక్‌ సత్యాగ్రహ పాదయాత్ర మూడు దశల్లో సాగనున్నది. మొదటి దశలో చంపారన్‌ నుంచి వారణాసి వరకు, రెందో దశ పాదయాత్ర వారణాసి నుంచి కాన్పూర్‌ వరకు జరుగనున్నది.

మూడో దశ పాదయాత్ర కాన్పూర్‌ నుంచి రాజ్‌ఘాట్‌కు చేరుకుంటుంది. ఈ 60 రోజుల్లో ఆయా వర్సీటీల విద్యార్థి బృందాలు ఆయా ప్రాంతాల్లో .. ప్రజలపై రాష్ట్ర సర్కారు, పోలీసుల క్రూర చర్యలను గురించి వివరించనున్నాయి. ఈ పాదయాత్రలో విద్యార్థులతో పాటు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ‘గాంధీ ఉద్యమంలో హింసకు చోటు లేదు. చౌరీచౌరా నేర్పిన పాఠాల నుంచి 98 ఏండ్ల అనంతరం, మేము ఫిబ్రవరి 1న అదే స్థలం నుండి గాంధేయ సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తున్నాం’ అని పాదయాత్ర నిర్వాహకులు మనీష్‌ శర్మ తెలిపారు.

తమిళనాడులో మానవహారం
చెన్నై : మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా తమిళనాడులో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా భారీ మానవహారం నిర్వహించారు. తమిళనాడు ఫ్లాట్‌ఫాం ఫర్‌ పీపుల్స్‌ యూనిటి (టీఎన్‌పీపీయూ) నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలోని 200లకుపైగా నగరాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 40 లక్షలమందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. సామాజిక సంస్థలు, హక్కుల కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొని సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలపటంతో పాటు ఆయా పార్టీల నేతలు కూడా పాల్గొని తమ నిరసనను వ్యక్తంచేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్‌ తీసుకొచ్చిన సీఏఏ, ఎన్సార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా టీఎన్‌పీపీయూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో ప్రజలను విభజిస్తున్నదంటూ టీఎన్‌పీపీయూ కో-ఆర్డినేటర్‌ కె అరుణన్‌ విమర్శించారు. ‘నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ చట్టాలను తీసుకొచ్చింది. కులం, మతం, జాతి, భాష, లింగ సంబంధం లేకుండా పౌరసత్వం అందిస్తామని రాజ్యాంగం హామీ ఇస్తున్నది. కానీ, మోడీ సర్కార్‌ రాజ్యాంగానికే తూట్లు పొడిచేలా చట్టాలను తెచ్చి ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నది’ అన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేయటంతోపాటు, న్యాయపోరాటం ప్రారంభించిన కేరళను అరుణన్‌ అభినందించారు. తమిళనాడు ప్రభుత్వం కూడా అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఆయన డిమాండ్‌చేశారు. ‘ఈ విషయంపై తమిళనాడు వైఖరిపై మేం చాలా అసంతృప్తిగా ఉన్నాం. రాష్ట్రంలో ఈ చట్టాలను అమలుచేయబోమని అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం’ అన్నారు.

గాంధీ పేరును దుర్వినియోగం చేస్తున్నారు : మోడీపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ విమర్శ
అహ్మదాబాద్‌ : తనకుతాను ప్రమోట్‌ చేసుకునేందుకు మహాత్మా గాంధీ పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుర్వినియోగం చేస్తున్నారనీ ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ విమర్శించారు. మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా ఇక్కడ జరిగిన సభలో గుహ ప్రసంగించారు. గాంధీ బతికివుంటే కేంద్ర సర్కార్‌ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవారని అన్నారు. గాంధీనే స్వయంగా ఏర్పాటుచేసిన గుజరాత్‌ విద్యాపీఠ్‌, సబర్మతి ఆశ్రమం సహా ఇతర గాంధేయ సంస్థలు సీఏఏకు వ్యతిరేకంగా నోరువిప్పకపోవటాన్ని ఆయన విమర్శించారు. పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే సీఏఏ అశాస్త్రీయమైనది, అనైతికమైనది, అనారోగ్యకరమైనదని ఆరోపించారు. రాజ్యాంగం, అహింసను విశ్వసించే వారు, నైతికత కలిగివున్నవారెవరైనా దీనిని వ్యతిరేకిస్తారని చెప్పారు. ‘సుప్రీంకోర్టు సీఏఏను సమర్థించినప్పటికీ, దానిని ప్రతిఘటించాలి, అది అహింసాయుతంగా ఉండాలి’ అన్నారు. హింసను అధిగమించటం, చర్చించటం, సహనం కలిగివుంటం రాజకీయవర్గ బాధ్యత అని స్పష్టంచేశారు. కానీ, మన రాజకీయ నాయకత్వ రికార్డు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నదనీ, ఇది దురదృష్టకరమని చెప్పారు. ‘గుర్తుంచుకోండి… మోడీ, షాలకు ముందూ గుజరాత్‌ ఉంది, మోడీ మరియు షా తరువాతా గుజరాత్‌ ఉంటుంది’ అని గుహ వ్యాఖ్యానించారు. ఈ సభ తర్వాత.. నగరంలోని రాఖియల్‌ ప్రాంతాన్ని గుహ సందర్శించారు. ఇక్కడ ముస్లిం మహిళలు సీఏఏకు వ్యతిరేకంగా ‘షాహీన్‌బాగ్‌’ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా అక్కడ నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ అధికారులకు ఎలాంటి పత్రాలూ చూపించొద్దు : జిగేశ్‌ మేవానీ
పూణె : ప్రభుత్వ అధికారులు ఇంటికి వస్తే ఎలాంటి పత్రాలూ చూపించొద్దని దళిత నాయకుడు, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగేశ్‌ మేవాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మేం ఎలాంటి పత్రాలూ చూపించబోమని గౌరప్రదంగా వారికి చెప్పండి’ అన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌పై సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పూణెలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా సంవిధాన్‌ బజావో మంచ్‌ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగసభనుద్దేశించి జిగేశ్‌ ప్రసంగించారు. సమాజంలో మత విభజన సృష్టించేందుకే కేంద్ర సర్కార్‌ సీఏఏను తీసుకొచ్చిందని విమర్శించారు. ‘అటవీ ప్రాంతాల్లో చాలా మంది నివసిస్తున్నారు. సంచార ప్రజలున్నారు. పౌరసత్వం నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలు వారి వద్ద లేవు. ఆధారాలను వారు ఎలా నిరూపించుకుంటారు? అని జిగేశ్‌ ప్రశ్నించారు. ‘రాజ్యాంగ పీఠిక కాపీని మీ దగ్గర పెట్టుకోండి. మీ ఇంటి ముందుకు ఎవరైనా వస్తే.. పత్రాలకు బదులు, రాజ్యాంగ పీఠికను చూపించండి’ అని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవహాద్‌ చెప్పారు.

నిన్న దేశద్రోహం కేసు… నేడు అరెస్టు
సీఏఏకు వ్యతిరేకంగా నాటకం వేశారన్న కారణంతో కర్నాటకలోని ఓ పాఠశాలపై దేశద్రోహం కేసు నమోదు చేయగా… ఆ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు, ఓ విద్యార్థి తల్లిని పోలీసులు శుక్రవారం అరెస్టుచేశారు. ప్రధాన మంత్రి మోడీని కించపరిచేవిధంగా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారన్న ఆరో పిస్తూ బీజేపీ కార్యకర్త నీలేష్‌ రక్షాలా పాఠశాలపై కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా, జ్యూడిషియల్‌ కస్టడీ విధించారనీ, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు చెప్పారు. నాలుగు, అయిదు, ఆరో తరగతి విద్యార్థులు జనవరి 21న ఈ నాటకాన్ని ప్రదర్శించారు. జనవరి 26న పాఠశాల యాజమాన్యంపై దేశద్రోహం కేసు నమోదుచేశారు. కాగా, నాటకానికి సంబంధించిన వీడియోలో ప్రధాని గురించి ఒక్క మాటా లేదని వార్తా కథనాలు తెలుపుతుండటం గమనార్హం.

Courtesy: NT

 

RELATED ARTICLES

Latest Updates