ఎక్కడికక్కడే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

స్తంభించిన బ్యాంకింగ్‌ మొదటిరోజు సమ్మె విజయవంతం
వేతన సవరణను కేంద్రం, ఐబీఏ పట్టించుకోవడం లేదు : బెఫి ప్రధాన కార్యదర్శి దేబాసిస్‌

న్యూఢిల్లీ : వేతన సవరణ చేపట్టాలన్న డిమాండ్‌తో పాటు ఐదు రోజుల పనివిధానం వంటి ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన రెండు రోజుల బంద్‌లో భాగంగా శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ కార్య కలాపాలు స్తంభించిపోయాయి. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఆధ్వర్యాన చేపట్టిన ఆలిండియా సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైతో పాటు దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన లక్షలాది ఉద్యోగులు సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ, ఇండియన్‌ బ్యాంక్‌
అసోసియేషన్‌ (ఐబీఏ) తీరుకు నిరసనగా ర్యాలీలు తీశారు. సమ్మెలో భాగంగా ఉద్యోగులు బ్యాంకుల ఎదుట శిబిరాలు ఏర్పాటుచేసి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం స్పందించకుంటే మరోమారు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమ్మె శనివారం కూడా కొనసాగుతుందని బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బెఫి) ప్రధాన కార్యదర్శి దేబాసిస్‌ బసు చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజుల సమ్మెకు రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయని అన్నారు. ఇది సమ్మెలో ఉన్న బ్యాంక్‌ ఉద్యోగులకు ప్రోత్సాహంతో పాటు మరింత బలం చేకూర్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు నగరాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు కూడా నిర్వహించారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఏటీఎం సేవలు నిలిచిపోయాయని తెలిపారు.

పరిష్కారం కాని ఉద్యోగుల సమస్యలు
శుక్రవారం సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినందుకు దేభాసిస్‌ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు బెఫి నేత దేబాసిస్‌ బసు చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లు, కార్మికులకు చివరిసారిగా చేసిన వేతన సవరణ 2012, నవంబర్‌ 1వ తేదీన అమల్లోకి వచ్చి 2017, డిసెంబర్‌ 31 నాటికి ముగిసిందని దేభాసిస్‌ బసు పేర్కొన్నారు. సెటిల్‌మెంట్‌ ముగిసి దాదాపు రెండు సంవత్సరా లకు పైగా కావచ్చిందని అన్నారు. రిటైర్లు ఉద్యోగులు, వారిపై ఆధార పడ్డ వారికి ఇస్తున్న పెన్షన్‌ను 1993లో ప్రవేశపెట్టారని, దాన్ని ఇప్పటి వరకూ అప్‌డేట్‌ చేయలేదని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులు కూడా సమాన పనికి సమాన వేతనం పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో కార్పొరేట్‌ పన్ను ఎగవేతదారుల సంఖ్య పెరిగిపోతు న్నదనీ, దీని కారణంగా ఎన్పీఏలు పెరిగిపోతున్నాయని దేభాసిస్‌ పేర్కొన్నారు. దీనిపై ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు గానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. వీటి నుంచి బ్యాంకులను రక్షించాల్సిన కేంద్రం కార్పొరేట్లకు వివిధ రూపాల్లో నజరానాలు ప్రకటించే పనిలో ఉందని అన్నారు. బ్యాంకింగ్‌ ఆదాయం కోసం కష్టపడుతున్న, కష్టపడిన ఉద్యోగులు, కార్మికులు, మాజీ ఉద్యోగులకు డబ్బులు కేటాయించమంటే ప్రభుత్వానికి బ్యాంకింగ్‌ ఆర్థిక స్థితి గుర్తుకు వస్తుందని విమర్శించారు. తమ డిమాండ్లను సాధించుకోవడంతోపాటు దేశ ఆర్థిక పరిస్థితులు కూడా ప్రాధాన్యమేనని, ఇందు కోసం పోరాటంలో ముందుంటామని పేర్కొన్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates