నాడి పట్టే నాథుల్లేరు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 తెలంగాణలోని సీహెచ్‌సీల్లో వైద్యనిపుణుల కొరత 59 శాతం
ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో వెక్కిరిస్తోన్న ఖాళీలు
పారామెడికల్‌ పోస్టుల్లోనూ ఇదే పరిస్థితి
గ్రామీణ ఆరోగ్య గణాంకాల్లో వెల్లడి

తెలంగాణలో మొత్తం 4744 ఆరోగ్య ఉప కేంద్రాల్లో (సబ్‌సెంటర్లు) 73 శాతం అద్దె భవనాల్లో సేవలందిస్తున్నాయి. వీటిల్లో 98 శాతం కేంద్రాల్లో మరుగుదొడ్డి సౌకర్యం లేదు. 

గ్రామీణ తెలంగాణలో 3 వేల నుంచి 5 వేల జనాభాకు ఒకటి చొప్పున  ఆరోగ్య ఉప కేంద్రం పనిచేస్తోంది.

ఈనాడు-హైదరాబాద్‌: రాష్ట్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో వైద్య నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సీహెచ్‌సీల్లో మంజూరైన పోస్టుల్లో 59 శాతం స్పెషలిస్టు పోస్టులు ఖాళీగా ఉండగా.. ప్రాంతీయ ఆసుపత్రుల్లో 52 శాతం, జిల్లా ఆసుపత్రుల్లో 17 శాతం ప్రత్యేక వైద్యనిపుణుల కొరత నెలకొంది. నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టుల పోస్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వైద్యసేవలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 2018-19 సంవత్సరానికి ‘గ్రామీణ ఆరోగ్య గణాంకాల’ను మంగళవారం విడుదల చేసింది. గతేడాది మార్చి వరకూ అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందించారు. గ్రామీణ భారత ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు.

 దేశంలో 64 శాతం పీహెచ్‌సీల్లో మాత్రమే పురుషులు, మహిళలకు వేర్వేరు మరుగుదొడ్లు ఉండగా.. తెలంగాణలో అన్ని పీహెచ్‌సీల్లోనూ మరుగుదొడ్ల సౌకర్యముంది.
 దేశంలో 2005-2019లో అలోపతి వైద్యుల సంఖ్యను 46.7 శాతం పెంచగా.. ఇప్పటికీ 6 శాతం లోటుంది.
 రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లో 41 మంది వైద్యుల పోస్టుల ఖాళీలున్నాయి. 30 వేల నుంచి 40 వేల జనాభాకు ఒకటి చొప్పున పీహెచ్‌సీ సేవలు లభిస్తున్నాయి.
 గ్రామీణ తెలంగాణలో 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) ఉండగా.. అన్నింటికీ సొంత భవనాలున్నాయి.
 దేశంలో 77శాతం సీహెచ్‌సీల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్డి సౌకర్యం ఉండగా.. రాష్ట్రంలోని అన్ని సీహెచ్‌సీల్లోనూ మరుగుదొడ్డి సౌకర్యం అందుబాటులో ఉంది.
 దేశం మొత్తమ్మీద సీహెచ్‌సీల్లో వైద్యనిపుణుల సంఖ్య 2018లో 4074 ఉండగా.. 2019లో 3881కి తగ్గిపోయింది. తెలంగాణలో 2018 కంటే 2019లో 146 మంది స్పెషలిస్టులు పెరిగారు. అయినా వీటిల్లో 367 స్పెషలిస్టు పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates