రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉండాలి?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సారంపల్లి మల్లారెడ్డి

వచ్చే ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్‌ రాబోతున్నది. 2019- 20లో మొదట ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ 1,82,016 కోట్లు కాగా మాంద్యం పేరుతో ఫైనల్‌ బడ్జెట్‌లో 1,46,492 కోట్లకు తగ్గించారు. అనగా 35,524 కోట్లు తగ్గించింది. ఈ తగ్గింపు ప్రధానంగా దళిత, గిరిజన, బీసీ, మహిళ, మైనార్టీ, విద్యా రంగాలలో జరిగింది. వారికి కేటాయించిన బడ్జెట్‌లో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ నుంచి 11,380 కోట్లు తగ్గించారు. చివరికి గ్రామ పంచాయతీలకు కూడా 10,716 కోట్ల నుంచి 8,384 కోట్లకు తగ్గించారు. ఏటా బడ్జెట్లు పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడమే తప్ప వాస్తవ వ్యయం చూస్తే 25శాతం వరకు తగ్గింపు కొనసాగుతున్నది.
సంవత్సరం బడ్జెట్‌ వాస్తవం తరుగు (రూ.కోట్లలో)
2014-15 1,02,172 62,786 39,386
2015-16 1,27,583 93,417 34,166
2016-17 1,72,269 1,40,606 31,663
2017-18 1,79,571 1,49,127 30,444
2018-19 1,74,454 1,40,200 34,254
మొత్తం 7,56,049 5,86,136 1,69,913
(ఆధారం : ఎకౌంటెంట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా)
ప్రతి సంవత్సరం 22శాతం అప్పులు తెస్తున్నప్పటికీ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాలు ఖర్చు చేయడం లేదు. భారీ కేటాయింపులు చూపి, మిగులు రాష్ట్రం అని చెప్పి ప్రజలను భ్రమల్లో ఉంచే విధంగా బడ్జెట్‌ రూపొందించడం ఆనవాయితీగా మారింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా 2014-15లో ఉన్న 70వేల కోట్ల అప్పు 2019-20 నాటికి 230కోట్లకు చేరుకున్నట్టు బడ్జెట్‌ నివేదికలు తెలుపుతున్నాయి. ఇవికాక కార్పొరేషన్‌ అప్పులు 500 నుంచి 2000కోట్ల వరకు బడ్జెట్‌ అప్పుల్లో జమచేయలేదు. ప్రత్యేక కన్సార్టియం ఏర్పాటు చేసి డబుల్‌ బెడ్రూం, మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకు తెచ్చిన అప్పులు (సుమారు 70వేల కోట్లు) కూడా బడ్జెట్‌ అప్పుల్లో చూపలేదు. ప్రాజెక్టుల నిర్మాణానికి, మిషన్‌ భగీరథ కోసం హడ్కో, నాబార్డ్‌, ఆంధ్రాబ్యాంక్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఇండియన్‌ నేషనల్‌ బ్యాంకు లాంటి సంస్థలు వేల కోట్లు అప్పులిచ్చాయి. ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో 39.42లక్షలమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ప్రతి నెల 840కోట్లు పెన్షన్లు చెల్లిస్తున్నారు. ఏడాదికి 10,116 కోట్లు చెల్లింపులు సాగుతున్నాయి. ఈ సంక్షేమ పథకాలను చూపి ఉత్పత్తి రంగాన్ని దెబ్బతీసే విధంగా బడ్జెట్‌ రూపొందిస్తున్నారు.

వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 110నుంచి 128లక్షల టన్నుల లక్ష్యం కాగా, 90-93లక్షల టన్నులు మాత్రమే వాస్తవ దిగుబడి వస్తున్నది. 2015-16లో 48.50లక్షల టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. పప్పు ధాన్యాల లక్ష్యం 5.25లక్షల టన్నులు. కానీ 2.5లక్షల టన్నులకు మించలేదు. నూనెగింజల ఉత్పత్తి 15లక్షల నుంచి 6లక్షల టన్నులకు తగ్గింది. సాగు విస్తీర్ణం 162లక్షలు కాగా 111-139 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతున్నది. ఏటా కరువు వల్ల సగటున 250మండలాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. రైతుబంధు పథకం కొంతమేరకు లాభించినా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో

రైతులు 8,500కోట్లు మార్కెట్లలో నష్టపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అమలు కావడం లేదు. ఇప్పటికీ 9లక్షల మందికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వలేదు. వారికి మొదటినుంచీ రైతుబంధు వర్తించటం లేదు. సాదా బైనామాల రిజిస్ట్రీ కోసం 12లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2,50,000మందికి మాత్రమే అమలు చేశారు. మిగిలినవి పెండింగ్‌లో పెట్టి రెండేండ్లయింది. పోడుభూముల సాగు పరిరక్షిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి, దాడులు చేయిస్తూ 60-70 ఏండ్ల నుంచి సాగుచేసుకుంటున్నవారిని వారి భూముల నుంచి తరిమేస్తున్నారు. సాగుభూమిని సక్రమంగా వినియోగించక పోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు గతంకన్నా బాగా తగ్గాయి. కల్తీలపై దాడిచేసి అందుకు బాధ్యులైన వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు పెట్టాలని చెప్పిన ప్రభుత్వం, వేల టన్నులు కల్తీ విత్తనాలు పట్టుబడినప్పటికీ ఒక్క కంపెనీపై కూడా కేసు పెట్టలేదు. వంటనూనెలు, కారం, పసుపు, మాంసం తదితర నిత్యావసర వస్తువులు కూడా పెద్ద ఎత్తున కల్తీ చేసి అమ్ముతున్నారు. మినరల్‌ వాటర్‌ పేరుతో రాష్ట్రంలో 4,500 కోట్ల వ్యాపారం సాగుతున్నది. ఇందులో కూడా కల్తీ బాగా ఉంటోంది. మిషన్‌ భగీరథ కింద ఇంటింటికీ నీరు అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ వేల కుటుంబాలకు తాగునీటి సౌకర్యం కల్పించలేదు. వైద్య సౌకర్యం విషయానికొస్తే గిరిజన ప్రాంతా లలో నేటికీ మలేరియాతో చాలా మంది చనిపోతున్నారు.
బీపీఎల్‌ కుటుంబాల ఆదాయం పెంచారు. గ్రామాలలో రూ.60వేల నుంచి రూ.1.5లక్షల వరకు, పట్టణాల్లో రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు పెంపుదల చేస్తూ వారికి తెల్ల కార్డు ఇచ్చి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఇంతవరకు ఈ పథకం అమలుచేయలేదు. నిరుపేదల సంఖ్య పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఏటా వేలమంది హైదరాబాద్‌ వంటి పట్టణాలకు వలసవెళ్తున్నారు. గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. జిల్లా కేంద్రాలలో కూడా కనీస వైద్య సౌకర్యాలు లభించడంలేదు. మొబైల్‌ వ్యాన్లు పెట్టి ‘అందరికీ ఆరోగ్యం’ పథకం పట్టణాలకే పరిమితమైంది.

ఒప్పంద కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని పదేపదే చెప్పారు. 57వేల మంది ఒప్పంద కార్మికులు, 11,524మంది వర్క్‌ ఛార్జ్‌డ్‌, 51,339మంది గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కార్మికులు పర్మినెంట్‌ ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్నారు. వీరికి కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదు. దళితుల సబ్‌ప్లాన్‌ పరిశీలిస్తే, ప్రభుత్వ విధానంలో దళితుల సంక్షేమం ఎంత అధ్వాన్నంగా ఉందో అర్ధమవుతోంది. 2014 నుంచి 2019 వరకు దళితులకు 56,979కోట్లు కేటాయించగా నిజంగా ఖర్చుపెట్టింది 33,361కోట్లు మాత్రమే. గిరిజనులకు 33,623కోట్లు కేటాయించగా 14,202కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. బడ్జెట్‌లో ప్రతి శాఖ నుంచి 15శాతం దళితులకు, 6శాతం గిరిజనులకు కేటాయించిన నిధుల్ని వ్యయం చేయడానికి ప్రతి జిల్లాకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ను పెట్టి అతని ద్వారా ఈ రెండు రంగాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. కానీ ఇంతవరకూ నోడల్‌ ఆఫీసర్‌ను నియమించలేదు. 2019-20లో దళితులకు 12,400కోట్లు, గిరిజనులకు 7,185కోట్లు కేటాయింపు చూపారు. వీరికి విద్య, వైద్యం, ఇండ్లు, తాగునీరు కల్పించడం వంటి వాటికి ప్రాధాన్యతలు ఇవ్వడం ద్వారా మాత్రమే అభివృద్ధి కాగలరు.

కేజీ నుంచి పీజీ విద్య చెప్పినప్పటికీ రాష్ట్రంలో 66.54శాతం అక్షరాస్యత మించడంలేదు. మొత్తం 3.50కోట్ల ప్రజలలో, 1.44కోట్ల మందికి అక్షర జ్ఞానం లేదు. విద్య గురించి విస్తృత ప్రచారం చేస్తున్న ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన నిధులలో 2019-20లో 2,320 కోట్లు తగ్గించింది. 2014 నుంచి ఈ తగ్గింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబమే లేకుండా చేస్తానని చెప్పిన ప్రభుత్వం 2.80లక్షల డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసి ఆరేండ్లలో 1.23లక్షల ఇండ్లు మాత్రమే పూర్తిచేశారు. 55వేల ఇండ్లు నిర్మాణం ఇంకా సాగుతూనే ఉంది. మిగిలినవి ప్రారంభించనే లేదు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ కింద 2019-20 నాటికి 585కోట్లు ఖర్చు చేసి 5,376మందికి 13,404 ఎకరాలు పంపిణీ చేసింది. రాష్ట్రంలో 3కోట్ల మంది భూమిలేని దళితులుండగా 5వేల మందికి మాత్రమే భూపంపిణీ జరిగింది. ఇప్పటికీ చట్టవిరుద్ధంగా భూములు ఆక్రమించినవారు, భూములు కలిగిఉన్నవారి వద్దనుంచి 5లక్షల ఎకరాల వరకు పేదలకు పంపిణీ చేయవచ్చు. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. మన ఊరు-మన ప్రణాళిక క్రింద పంచాయతీలలో 20 వేల కోట్లు, మండలాలలో 12 వేల కోట్లు, జిల్లాలో 32 వేల కోట్లతో పనులను చేపట్టి పూర్తిచేస్తామన్న పథకం ప్రారంభదశలోనే నిలిచిపోయింది. గ్రామాల అభివృద్ధి జరగకుండా రాష్ట్రం అభివృద్ధి కాదన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ప్రజలను మరింత దివాళా తీయించడానికి, ప్రభుత్వానికి ఆదాయం రాబట్టుకోవడానికి మద్యం అమ్మకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ఆర్థికంగాను, శారీరకంగాను ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. వార్షిక ఆదాయం 500కోట్ల నుంచి నేడు 30వేల కోట్లకు పెంచుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేశారు. పై విధానాల వల్ల ఆశించిన బంగారు తెలంగాణ సాధ్యం కాదని ప్రభుత్వం గుర్తించాలి. కనీసం రానున్న బడ్జెట్‌ను రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే విధంగా రూపొందించాలి. ప్రతి మండల కేంద్రంలో కనీసం 50పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్య సౌకర్యం కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారిని చైతన్యవంతులను చేయడంతోపాటు ఉచిత వైద్యం చెయ్యాలి. కల్తీలను నిషేధించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. కల్తీల వల్ల ప్రజల ఆరోగ్యంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కూడా దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన 163లక్షల ఎకరాల భూమిని సాగుచేసే విధంగా వ్యవసాయ శాఖ ప్రణాళికను రూపొందించాలి. సాగుభూమిని సాగేతర భూమిగా మార్చకుండా చట్టం రూపొందించాలి. అలాగే నాణ్యమైన వ్యవసాయ ఉపకరణాలు రైతులకు అందుబాటులో ఉంచాలి. భూసార పరీక్షలు జరిపి ఎరువులు వాడే విధానాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చెయ్యాలి. పత్తి, చెరుకు, పసుపు పరిశోధనా కేంద్రాలను స్థాపించి ఆ పరిశోధనల ద్వారా రైతులకు విజ్ఞానాన్ని అందించి ఉత్పాదకత పెంచాలి. వ్యవసాయంలో గ్రీన్‌హౌస్‌ పద్దతి ప్రవేశపెట్టాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలి. విద్యా, వైద్య రంగాలకు ప్రస్తుత కేటాయింపులపై రెట్టింపు శాతం పెంచాలి. ఒప్పంద కార్మికులను పర్మినెంటుగా ఆమోదించి కనీస వేతనం నెలకు రూ.21 వేలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. రైతులు మార్కెట్‌ దోపిడీకి గురికాకుండా సివిల్‌ సప్లైస్‌, మార్కెటింగ్‌ సంస్థలను రంగంలోకి తెచ్చి మార్కెట్‌ జోక్యం పథకం ద్వారా సరుకులు కొనుగోలు చేయాలి. అక్రమ భూములు కలిగిఉన్నవారి నుంచి ఆ భూములను తీసుకుని దళితులకు పంపిణీ చేయాలి. ఇల్లు లేని వారి గణాంకాలు సేకరించి ఒక ఏడాదిలో ఇండ్ల నిర్మాణం పూర్తి చెయ్యాలి. తాగునీటి వసతి అందరికీ కల్పించాలి. అందుకనుగుణంగా సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేస్తూనే ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. ప్రస్తుతం ఇరిగేషన్‌ పేరుతో జరుగుతున్న వక్రీకరణలను సరిచేసుకుని ఇప్పటికే 70శాతం పూర్తయిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి వాటి ద్వారా ఉత్పత్తిని పెంచే ఏర్పాటు చేయాలి. పంట కాల్వలు తీయకుండా ప్రాజెక్టు పనులు పూర్తి కావు. నీటిని సద్వి నియోగం చేసే విధంగా ఇరిగేషన్‌ శాఖను పునః నిర్మించాలి. మేజర్‌ ఇరిగేషన్‌, మైనర్‌ ఇరిగేషన్‌ల మధ్య సత్సంబంధాలను కొనసాగించి ప్రాజెక్టుల నీటి ద్వారా చెరువులు నింపాలి. ప్రతి మండల కేంద్రంలో పురుషులకు, మహిళలకు కనీసం జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలి. శాఖలకు వచ్చే గ్రాంట్లను అభివృద్ధికి మాత్రమే వినియో గించాలి. ఆ విధంగా బడ్జెట్‌ రూపకల్పన ద్వారా మాత్రమే రాష్ట్రం ఉత్పత్తి రంగంలో అభివృద్ధి అవుతుంది.

సెల్‌: 9490098666

RELATED ARTICLES

Latest Updates